Tuesday, 22 September 2026

Tag: East Godavari District

తూర్పు గోదావరి

8 మంది వితంతువులకు నూతనంగా పెన్షన్లు

పెన్షన్ పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బిక్కవోలు, సెప్టెంబరు 1 (పున్నమి ప్రతినిధి): బిక్కవోలు మండలంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా మండలానికి సంబంధించి నూతనంగా మంజూరైన వితంతు పెన్షన్లను 8 మంది లబ్ధిదారులకు అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అందజేశారు. బిక్కవోలు ఎంపీడీఓ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా మంజూరైన వితంతు పెన్షన్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బిక్కవోలు మండల, గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

బిక్కవోలులో ఇంటింటికీ వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి సామాజిక భద్రతా పింఛన్లు అందించిన ఎమ్మెల్యే నల్లమిల్లి బిక్కవోలు, సెప్టెంబరు 1 (పున్నమి ప్రతినిధి): బిక్కవోలు మండలంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పెన్షన్ మొత్తాలను అందజేశారు. ప్రభుత్వం అందిస్తున్న సామాజిక భద్రతా పింఛన్లు అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర వర్గాలకు పెన్షన్లు ఆర్థిక భరోసాగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్లు అందించడంతో వారు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు సంక్షేమ పథకాల ప్రయోజనాలు నేరుగా అందేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిక్కవోలు మండల, గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

ఇళ్లపల్లిలో పీఎం సూర్య ఘర్ యోజనపై అవగాహన

సౌర విద్యుత్‌తో విద్యుత్‌ బిల్లుల భారం తగ్గుతుంది: నల్లమిల్లి మనోజ్‌రెడ్డి ఇళ్లపల్లి, ఆగస్టు 31 (పున్నమి ప్రతినిధి): బిక్కవోలు మండలం ఇళ్లపల్లి గ్రామంలో పీఎం సూర్య ఘర్ యోజన పథకంపై టీడీపీ అనపర్తి నియోజకవర్గ ఇన్‌చార్జి నల్లమిల్లి మనోజ్‌రెడ్డి గ్రామస్థులకు అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకం ద్వారా ఇళ్లపై సోలార్‌ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకుని సౌర విద్యుత్‌ను వినియోగించుకోవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా మనోజ్‌రెడ్డి మాట్లాడుతూ సూర్యకిరణాల ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేసుకునే అవకాశం ఈ పథకం కల్పిస్తుందని చెప్పారు. సోలార్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాల ద్వారా లభించే ప్రయోజనాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి ఒక్కరూ వాటిని వినియోగించుకునేలా కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో బిక్కవోలు మండల పార్టీ అధ్యక్షుడు బుజ్జి, మండల నాయకులు, ఇళ్లపల్లి గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

1008 మంది చిన్నారుల నోట వేమన పద్యాల గలార్చన

రావులపాలెం, ఆగస్టు 31 (పున్నమి ప్రతినిధి): తెలుగు భాష పరిరక్షణ, భావితరాల్లో మాతృభాషపై మమకారం పెంపొందించేందుకు రావులపాలెం సీఆర్‌సీ ఫంక్షన్ హాల్‌లో “శతక పద్య సహస్ర గలార్చన–వేమన శతకం” కార్యక్రమం నిర్వహించారు. ప్రగతి భారతం ట్రస్ట్, మాతృభాష పరిరక్షణ సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో 20కి పైగా పాఠశాలలకు చెందిన 1008 మంది చిన్నారులు పాల్గొన్నారు. వేమన శతకంలోని 108 పద్యాలను విద్యార్థులు కంఠస్థంగా, రాగయుక్తంగా ఆలపించి ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చిన్నారుల ప్రతిభను అభినందించారు. వేమన పద్యాల్లోని నీతి, సామాజిక సందేశాలను భావితరాలకు చేరువ చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పద్యాలపై పరీక్ష నిర్వహించి, ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసాపత్రాలు అందజేశారు. ప్రగతి భారతం ట్రస్ట్ చైర్మన్ తవనంపూడి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, టీడీపీ సాంస్కృతిక శాఖ అధ్యక్షులు ఆనందరెడ్డి (బాబా) తదితరులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

రూ.50 లక్షలతో బలభద్రపురం రుద్రభూమి అభివృద్ధి

అంతిమ సంస్కారాలకు గౌరవప్రదమైన వాతావరణం కల్పిస్తాం: ఎమ్మెల్యే నల్లమిల్లి బలభద్రపురం, ఆగస్టు 31 (పున్నమి ప్రతినిధి): బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలోని రుద్రభూమిని రూ.50 లక్షలతో ఆధునికంగా అభివృద్ధి చేసేందుకు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి భూమిపూజ చేశారు. మండల పరిషత్ నుంచి రూ.4 లక్షలు, గ్రామ పంచాయతీ నుంచి రూ.10 లక్షలు, దాతల సహకారంతో రూ.36 లక్షలు సమకూర్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బలభద్రపురం రుద్రభూమిలో కనీస వసతులు లేకపోవడంతో అంతిమ సంస్కారాలకు వచ్చే గ్రామస్థులు, బంధువులు చాలా కాలంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు రుద్రభూమిని అన్ని మౌలిక వసతులతో ఆధునికంగా తీర్చిదిద్దాలని నిర్ణయించామన్నారు. అంతిమ సంస్కారం కూడా ప్రతి ఒక్కరికీ గౌరవప్రదంగా జరిగేలా వసతులు కల్పించడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. రుద్రభూమిలో అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో పాటు పరిశుభ్రమైన, సురక్షితమైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్రామస్తుల సహకారంతోనే రూ.50 లక్షల నిధులు సమకూరాయని, పార్టీలకు అతీతంగా అందరూ కలిసి అభివృద్ధికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. బిక్కవోలు, రామవరం గ్రామాల్లోనూ రుద్రభూముల అభివృద్ధి చేపట్టామని, ఇదే తరహాలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. బలభద్రపురం రుద్రభూమి అభివృద్ధి పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తయ్యేందుకు గ్రామస్తులంతా ఐక్యంగా సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం స్ఫూర్తిదాయకమని ఆయన అభినందించారు.

తూర్పు గోదావరి

బలభద్రపురంలో రూ.50 వేలతో బస్‌ షెల్టర్‌ నిర్మాణం

ప్రయాణికుల సౌకర్యార్థం ప్రారంభించిన ఎమ్మెల్యే నల్లమిల్లి బలభద్రపురం, ఆగస్టు 31 (పున్నమి ప్రతినిధి): బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో ప్రయాణికుల సౌకర్యార్థం రూ.50 వేలతో నిర్మించిన బస్‌ షెల్టర్‌ను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. పాస్టర్ విజయప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలోని ఐ ఫర్ గాడ్ ఫౌండేషన్, విజయప్రసాద్ ఫౌండేషన్ సంయుక్త సహకారంతో ఈ బస్‌ షెల్టర్‌ను నిర్మించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రయాణికులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఎండ, వర్షం నుంచి ప్రయాణికులకు రక్షణ కల్పించేలా బస్‌ షెల్టర్‌ నిర్మించడం ఎంతో ఉపయోగకరమన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి సేవా కార్యక్రమాలు చేపడుతున్న పాస్టర్ విజయప్రసాద్ రెడ్డిని అభినందించారు. కార్యక్రమంలో పాస్టర్ విజయప్రసాద్ రెడ్డి, బిక్కవోలు మండల కూటమి నాయకులు, బలభద్రపురం గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

గుబ్బాలమ్మ దేవస్థానం స్థలానికి రక్షణ కల్పించాలి

ప్రహరీ గోడ లేక ఆక్రమణకు గురైన ఆలయ స్థలాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లికి చూపించిన గ్రామస్థులు బలభద్రపురం, ఆగస్టు 31 (పున్నమి ప్రతినిధి): బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలోని శ్రీశ్రీశ్రీ గుబ్బాలమ్మ దేవస్థానానికి చెందిన స్థలం ఆక్రమణకు గురైన విషయాన్ని గ్రామస్థులు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆలయానికి ప్రహరీ గోడ లేకపోవడంతో ప్రాంగణానికి రక్షణ లేకుండా పోయిందని, ఈ కారణంగా ఆలయ స్థలంలో కొంత భాగం ఆక్రమణకు గురైందని ఎమ్మెల్యేకు వివరించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు ఆక్రమణకు గురైన ప్రాంతాన్ని ఎమ్మెల్యేకు ప్రత్యక్షంగా చూపించి, ఆలయ స్థలాన్ని పరిరక్షించేందుకు ప్రహరీ గోడ నిర్మాణంతో పాటు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆలయ స్థలం భవిష్యత్తులో మరింత ఆక్రమణకు గురికాకుండా శాశ్వత రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామస్థుల నుంచి సమస్య వివరాలను తెలుసుకున్న ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆలయ స్థలాన్ని పరిశీలించారు. సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిక్కవోలు మండల కూటమి నాయకులు, బలభద్రపురం గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

ప్రకృతి వ్యవసాయంతోనే భవిష్యత్‌కు భరోసా

రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించాలి మార్టేరులోని పరిశోధనలు, నూతన వరి వంగడాలపై అవగాహన కల్పించేందుకే విజ్ఞాన యాత్ర అనపర్తి, ఆగస్టు 31 (పున్నమి ప్రతినిధి): మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని, ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సూచించారు. అనపర్తి పంచాయతీ కార్యాలయం వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “అంతరజిల్లా రైతుల వ్యవసాయ విజ్ఞాన యాత్ర” లో భాగంగా మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థకు బయలుదేరిన బస్సులను ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనపర్తి నియోజకవర్గం, ముఖ్యంగా అనపర్తి బ్లాక్‌ పరిధి నుంచి సుమారు 110 మంది రైతులను మార్టేరు వ్యవసాయ పరిశోధనా సంస్థకు తీసుకెళ్లి అక్కడ జరుగుతున్న పరిశోధనలు, నూతన వ్యవసాయ విధానాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా నూతన వరి వంగడాలు, ఆధునిక సాగు పద్ధతులను రైతులకు ప్రత్యక్షంగా పరిచయం చేయడం ద్వారా వ్యవసాయ రంగంలో కొత్త ఆలోచనలకు ప్రోత్సాహం లభిస్తుందన్నారు. ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని గణనీయంగా తగ్గించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రసాయన ఎరువుల అధిక వినియోగంతో భూమి సారం తగ్గిపోవడంతో పాటు పర్యావరణ, ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. భూమిని సారవంతంగా కాపాడుకోవడంతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. సాంప్రదాయ పద్ధతుల నుంచి రైతులు ఆధునిక, ప్రకృతి ఆధారిత సాగు విధానాల వైపు రావాల్సిన అవసరం ఉందని, మార్టేరులో జరుగుతున్న పరిశోధనలు రైతుల్లో నూతన ఉత్సాహాన్ని కలిగిస్తాయని తెలిపారు. ఇతర దేశాల్లో అభివృద్ధి చేస్తున్న ఆధునిక వ్యవసాయ పద్ధతులను అధ్యయనం చేసి, వాటిని స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రైతులు అవలంబిస్తే అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుందన్నారు. అనపర్తి ఏ.డి. పరిధిలోని వివిధ మండలాల నుంచి రైతులను ఈ విజ్ఞాన యాత్రకు తరలించిన ఆత్మ కార్యక్రమ నిర్వాహకులకు, ఆత్మ చైర్మన్‌, ఏ.డి. వ్యవసాయ శాఖ అధికారులకు, ఇతర అధికారులకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అనపర్తి టౌన్ కూటమి నాయకులు, కార్యకర్తలు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

రైతుల సమస్యల పరిష్కారానికి కృషి: ఎమ్మెల్యే నల్లమిల్లి

ఎరువుల యాప్‌లో సాంకేతిక సమస్యలు పరిష్కరించాలి.. ఎల్‌నినో నేపథ్యంలో మెట్ట ప్రాంత చెరువులు నింపాలి కాకినాడ, ఆగస్టు 29 (పున్నమి ప్రతినిధి): కాకినాడ జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అధ్యక్షతన, జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ IAS ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశా) సమావేశానికి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల పురోగతిపై సమావేశంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ ఎరువుల పంపిణీ కోసం ప్రవేశపెట్టిన యాప్‌లోని సాంకేతిక సమస్యల కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా భూయజమాని, కౌలుదారు మధ్య పలు OTPలు చెప్పాల్సి రావడం వల్ల సమయం వృథా అవుతోందన్నారు. ఈ సమస్యలను శాసనసభలో ప్రస్తావించగా, అధికారులు తనను కలిసి సమస్యలను నమోదు చేసుకున్నారని, త్వరలో పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో గోదావరి నీటిని పొదుపుగా వినియోగిస్తూ మెట్ట ప్రాంతంలోని చెరువులను నింపేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. రబీ సీజన్‌లో పంటలతో పాటు తాగునీరు, పశువుల అవసరాలు, భూగర్భ జలాల పరిరక్షణకు ఇది కీలకమన్నారు. రైతులు తక్కువ ఎరువుల వినియోగంతో సాగు ఖర్చు తగ్గించుకుని ఆదాయం పెంచుకునే విధానాలపై దృష్టి పెట్టాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై గ్రామస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే కోరారు. సమావేశంలో ఐసీడీఎస్, డీఆర్‌డీఏ, డ్వామా, వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, వైద్య, విద్య, బ్యాంకింగ్, పంచాయతీరాజ్ తదితర శాఖలపై సమీక్ష జరిగింది.

తూర్పు గోదావరి

ఒడిశా తెలుగు రైతులకు ధాన్యం కొనుగోలు భరోసా!

ఎమ్మెల్యే నల్లమిల్లి చొరవ.. ఎంపీ పురంధేశ్వరి కృషితో సమస్యకు పరిష్కారం సుమారు 50 వేల మంది తెలుగు రైతులకు భారీ ఊరట అనపర్తి, ఆగస్టు 29 (పున్నమి ప్రతినిధి): ఒడిశా రాష్ట్రంలో వరి సాగు చేస్తున్న తెలుగు రైతులు ఎదుర్కొంటున్న ధాన్యం కొనుగోలు సమస్యకు పరిష్కారం లభించింది. తెలుగు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు ఒడిశా ప్రభుత్వం అంగీకరించడంతో సుమారు 50 వేల మంది రైతులకు ఊరట లభించనుంది. ఇటీవల పెదపూడి మండలానికి చెందిన పలువురు రైతులు తమ సమస్యను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ఒడిశాలో తాము సాగు చేస్తున్న వరి ధాన్యాన్ని అక్కడి ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వివరించారు. రైతుల సమస్యపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే నల్లమిల్లి రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరిని కలిసి సమస్యను వివరించారు. దీనిపై స్పందించిన ఎంపీ పురంధేశ్వరి ఒడిశా వ్యవసాయ శాఖ మంత్రి, ఇతర సంబంధిత మంత్రులతో ఫోన్‌లో మాట్లాడి ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో ఒడిశా ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు అంగీకరించినట్లు ఎమ్మెల్యే నల్లమిల్లి తెలిపారు. సమస్య పరిష్కారానికి కృషి చేసిన ఎంపీ పురంధేశ్వరికి, ఒడిశా ప్రభుత్వానికి, గవర్నర్ కంభంపాటి హరిబాబుకు, మంత్రులు పృథ్వీరాజ్ హరిచందన్, కృష్ణ చంద్ర పాత్ర, కనక్ వర్ధన్ సింగ్ డియోలకు ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.