Tuesday, 22 September 2026

Tag: East Godavari District

తూర్పు గోదావరి

మాదకద్రవ్యాల నిర్మూలనకు సమష్టి కృషి అవసరం యువతను వ్యసనాల నుంచి దూరం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే నల్లమిల్లి

గొల్లల మామిడాడ, ఆగస్టు 22 (పున్నమి ప్రతినిధి): మాదకద్రవ్యాల వినియోగాన్ని నిర్మూలించి డ్రగ్స్‌ రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. పెదపూడి మండలం గొల్లల మామిడాడలోని ఏఆర్‌సీ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన ‘‘డ్రగ్స్‌ రహిత సమాజం–మాదకద్రవ్యాల వినియోగ నిర్మూలన’’ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. మాదకద్రవ్యాల వల్ల యువతలో నేరప్రవృత్తి పెరిగే ప్రమాదం ఉందని, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను గమనిస్తూ అవసరమైన సమయంలో కౌన్సెలింగ్‌, వైద్య సహాయం అందించాలని సూచించారు. విద్యార్థులపై ఉపాధ్యాయులు కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. మాదకద్రవ్యాల నిర్మూలన కేవలం పోలీసుల బాధ్యత కాదని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆశా వర్కర్లు, సచివాలయ సిబ్బంది, ప్రజలు అందరూ భాగస్వాములు కావాలని అన్నారు. గ్రామ స్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. యువతలో శాశ్వత మార్పు తీసుకురావడానికి అవగాహన, కౌన్సెలింగ్‌ కీలకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఆశా వర్కర్లు, సచివాలయ ఉద్యోగులు, మండలాధికారులు, పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

చిరంజీవి జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే నల్లమిల్లి

గొల్లల మామిడాడ, ఆగస్టు 22 (పున్నమి ప్రతినిధి): మెగాస్టార్ చిరంజీవి జన్మదినం, రాజయోగిని దాది ప్రకాష్‌మణి 19వ పుణ్యతిథి సందర్భంగా గొల్లల మామిడాడ బ్రహ్మకుమారీస్ ఆశ్రమంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి, మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రక్తదానాన్ని ప్రోత్సహించడంలో చిరంజీవి అందించిన స్ఫూర్తి అభినందనీయమన్నారు. రక్తదానంపై గతంలో ఉన్న అపోహలను తొలగించి, యువతలో సేవాభావాన్ని పెంపొందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వ్యసన రహిత భారత్‌ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్లాలని కోరారు. మాదకద్రవ్యాలు, ధూమపానం, మద్యం వంటి వ్యసనాలకు యువత దూరంగా ఉండాలని సూచించారు. ప్రతిజ్ఞ చేయడంతో పాటు దాన్ని ఆచరణలో పెట్టడం ముఖ్యమన్నారు. ప్రకృతి పరిరక్షణ, ఆరోగ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే సూచించారు. వ్యసనాలకు అలవాటు పడిన వారిలో మార్పు తీసుకురావడానికి కుటుంబ సభ్యులు ఓర్పు, సహనంతో కృషి చేయాలని తెలిపారు. చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే, ఆయన ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవిస్తూ సమాజ సేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నల్లమిల్లి మనోజ్‌రెడ్డి, బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

జన్మదిన వేడుకల సందర్భంగా వృద్ధాశ్రమంలో అన్నదానం

అనపర్తి, ఆగస్టు 22 (పున్నమి ప్రతినిధి): ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ సేవా సమితి–ఎన్జీవో బిక్కవోలు మండల శాఖ అధ్యక్షులు, రాష్ట్ర సేవా రత్న అవార్డు గ్రహీత (పీఎస్వీ), అనపర్తి నియోజకవర్గ ఇంచార్జి (ఆర్టీఐ కమిటీ, పీఎస్వీ), పున్నమి ప్రతినిధి శ్రీ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు (రమేష్ నాయుడు) జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీమతి మణికుమారి, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా మహిళా అధ్యక్షురాలు (ఆర్టీఐ కమిటీ, పీఎస్వీ) వారి కుమార్తెల ఆధ్వర్యంలో శనివారం అనపర్తిలోని శ్రీ శ్రీ తేతలి రామిరెడ్డి–మంగయ్యమ్మ చారిటీస్ వారి మహిళా వృద్ధాశ్రమంలో ఉన్న 25 మంది వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధుల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. అనంతరం వారి ఆశీర్వచనాలు తీసుకుని, వారితో కొంతసేపు ఆత్మీయంగా గడిపారు. జన్మదిన వేడుకలను ఆర్భాటాలకు దూరంగా సేవా కార్యక్రమంగా నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పెదపాటి విష్ణు, బిక్కవోలు టీడీపీ సీనియర్ నాయకులు చోడవరపు రాంబాబు, ఆశ్రమ వ్యవస్థాపకులు తేతలి నారాయణరెడ్డి, ఆశ్రమ సిబ్బంది, సేవా సమితి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమంతో జరుపుకోవడం ద్వారా సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు కుటుంబ సభ్యులు మానవతా విలువలను చాటుకున్నారు.

తూర్పు గోదావరి

గురువుగారి వీడియో సందేశంతో మణికుమారి దంపతులకు ఆనందం

బిక్కవోలు, ఆగస్టు 22 (పున్నమి ప్రతినిధి): ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ సేవా సమితి–ఎన్జీవో బిక్కవోలు మండల శాఖ అధ్యక్షులు, రాష్ట్ర సేవా రత్న అవార్డు గ్రహీత (పీఎస్వీ), అనపర్తి నియోజకవర్గం ఇంచార్జి (ఆర్టీఐ కమిటీ, పీఎస్వీ), పున్నమి ప్రతినిధి శ్రీ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు (రమేష్ నాయుడు) జన్మదినం సందర్భంగా ఆయన సతీమణి, ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ సేవా సమితి సభ్యురాలు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా మహిళా అధ్యక్షురాలు (ఆర్టీఐ కమిటీ, పీఎస్వీ) శ్రీమతి సిరిసిపల్లి మణికుమారి చిన్ననాటి గురువు, ప్రముఖ బుల్లితెర నటుడు, మూవీ ఆర్టిస్ట్, రెండు తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితులైన జబర్దస్త్ సత్తిపండు (లెక్కల మాస్టారు) వీడియో సందేశం ద్వారా రమేష్ నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం తమకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని మణికుమారి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, చిన్ననాటి నుంచే తనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువుగారిపై తనకు ఎంతో గౌరవం, అభిమానముందని తెలిపారు. చదువుతో పాటు విలువలతో కూడిన విద్యను అందించడంతో పాటు, ప్రతి విద్యార్థిలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి, దానిని అభివృద్ధి చేసుకునేలా ప్రోత్సహించి ఉన్నత మార్గంలో నడిపించారని పేర్కొన్నారు. అలాగే దేశం పట్ల, సమాజం పట్ల ప్రేమాభిమానాలు కలిగి ఉండాలని, ఆపదలో ఉన్న తోటి మనిషిని గుర్తించి తమవంతు సహాయ సహకారాలు అందించాలనే సేవా భావాన్ని కూడా చిన్ననాటి నుంచే గురువులు తమలో పెంపొందించారని మణికుమారి తెలిపారు. తనకు చిన్ననాట విద్యాబుద్ధులు నేర్పిన గురువుగారు, తన భర్త రమేష్ నాయుడు జన్మదినం సందర్భంగా ప్రత్యేకంగా వీడియో సందేశం ద్వారా శుభాకాంక్షలు తెలియజేయడం తమ కుటుంబానికి ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని కలిగించిందని ఆమె అన్నారు. ఈ సందర్భంగా తనకు విద్యాబుద్ధులు నేర్పి, జీవితానికి విలువైన మార్గనిర్దేశం చేసిన గురువులందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని శ్రీమతి సిరిసిపల్లి మణికుమారి పేర్కొన్నారు.

తూర్పు గోదావరి

లక్ష్మీనరసాపురంలో రూ.4.60 కోట్లతో విద్యుత్ సబ్‌స్టేషన్

అనపర్తి, ఆగస్టు 21 (పున్నమి ప్రతినిధి): గత కొన్నేళ్లుగా విద్యుత్‌ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న అనపర్తి, పరిసర గ్రామాల ప్రజలకు ఊరట కల్పించేలా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కీలక చర్యలు చేపట్టారు. లక్ష్మీనరసాపురంలో నూతన విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మాణం కోసం రూ.4.60 కోట్ల నిధులను మంజూరు చేయించారు. లక్ష్మీనరసాపురంలో 33/11 కేవీ సబ్‌స్టేషన్‌తో పాటు ఫీడర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ స్తంభాల నిర్మాణం చేపట్టేందుకు ఈ నిధులను కేటాయించారు. నూతన సబ్‌స్టేషన్‌ నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే అనపర్తి, లక్ష్మీనరసాపురం, పరిసర గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. తరచూ ఎదురవుతున్న విద్యుత్‌ అంతరాయాలు, లో-వోల్టేజ్‌ సమస్యలు తగ్గడంతో పాటు విద్యుత్‌ సరఫరా నాణ్యత మెరుగుపడనుంది. ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్‌ సమస్యలను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే నల్లమిల్లి ప్రత్యేక చొరవ తీసుకుని రూ.4.60 కోట్ల నిధులు మంజూరు చేయించడం పట్ల అనపర్తి నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సబ్‌స్టేషన్‌ నిర్మాణంతో విద్యుత్‌ కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించనుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

తూర్పు గోదావరి

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు పురందేశ్వరికి ఎమ్మెల్యే నల్లమిల్లి శుభాకాంక్షలు

రాజమహేంద్రవరం, ఆగస్టు 19 (పున్నమి ప్రతినిధి): బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి నియమితులైన సందర్భంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రాజమహేంద్రవరంలో ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పురందేశ్వరి జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు చేపట్టడం పట్ల ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పార్టీకి, ప్రజలకు ఆమె అందిస్తున్న సేవలు మరింత విస్తరించాలని, కొత్త బాధ్యతల్లో విజయవంతంగా రాణించాలని ఆకాంక్షించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.