Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Blog

అనకాపల్లి

మాతృశిశు సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో) అనకాపల్లి, అక్టోబర్ 6: గర్భిణులు, బాలింతలు, శిశువులకు అవసరమైన వైద్య సేవలు సకాలంలో అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. జిల్లాలో రూ.1.14 కోట్లతో నిర్మించిన నాలుగు ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలను మంత్రి సత్యకుమార్ యాదవ్ మండలవరం వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ విజయ కృష్ణన్ జిల్లా నుంచి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో మాతృ, శిశు ఆరోగ్యంపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. గర్భిణులకు అవసరమైన పరీక్షలు, వైద్య సేవలు, పోషకాహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రసవ సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా వైద్య సిబ్బంది ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. శిశు మరణాల రేటును తగ్గించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు మరింత విస్తృతం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

అనకాపల్లి

మొక్కల లెక్క కాదు.. మనుగడ లెక్కే ముఖ్యం!

2047 నాటికి ఏపీని 50 శాతం గ్రీన్ కవర్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం: నాగబాబు పున్నమి ప్రతినిధి ఆనంద్ ( జిల్లా బ్యూరో) మంగళగిరి, అక్టోబర్ 6: 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను 50 శాతం గ్రీన్ కవర్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగాలని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ నాగబాబు పిలుపునిచ్చారు. మంగళగిరిలోని అరణ్యభవన్‌లో మంగళవారం కమిటీ తొలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2026–27లో రాష్ట్రవ్యాప్తంగా నర్సరీల ద్వారా 10 కోట్ల మొక్కలను సిద్ధం చేయాలని, తొలి దశలో 500 మండలాల్లో 500 నర్సరీలకు స్థలాలను గుర్తించాలని సూచించారు. మొక్కలు నాటడంలో సంఖ్య కంటే మనుగడ శాతానికే ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. స్థానిక వాతావరణానికి అనువైన జాతులను ఎంపిక చేసి ‘రైట్ ట్రీ–రైట్ ప్లేస్’ విధానాన్ని అమలు చేయాలని తెలిపారు. రహదారుల వెంట పచ్చదనం, కోస్టల్ గ్రీన్ బెల్ట్స్, మడ అడవులు, తాటి తోటల విస్తరణకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలన్నారు. పరిశ్రమల భాగస్వామ్యంతో గ్రీన్ కారిడార్లు అభివృద్ధి చేయాలని సూచించారు. నర్సరీ నుంచి మహావృక్షంగా ఎదిగే వరకు జియో ట్యాగింగ్, డిజిటల్ పర్యవేక్షణ ఉండాలన్నారు. “మనం నాటేది మొక్క కాదు.. మన పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు పునాది” అని నాగబాబు పేర్కొన్నారు.

అనకాపల్లి

అర్చకుల సమస్యలకు పరిష్కారం చూపాలి

పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో) యలమంచిలి, అక్టోబర్ 6: అర్చకులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం యలమంచిలి కొమ్మాయిగుండం వద్ద శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. కాళ్లకూరి కామేశ్వర శర్మ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి యలమంచిలి, కశింకోట మండలాల నుంచి 60 మందికి పైగా అర్చకులు, సభ్యులు హాజరయ్యారు. వంశపారంపర్య అర్చకుల హక్కుల పరిరక్షణ, వృత్తిపరమైన భద్రత, అధికారిక గుర్తింపు కార్డుల మంజూరు తదితర అంశాలపై చర్చించారు. దేవాదాయ శాఖ పరిధిలోని పలు ఆలయాల్లో అర్చకులకు కనీస వేతనాలు కూడా అందడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ నిధులు లేదా వెల్ఫేర్ ఫండ్ ద్వారా అర్చకులకు ప్రతినెలా గౌరవప్రదమైన వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఒకే ఆలయంలో పలువురు వంశపారంపర్య అర్చకులు విధులు నిర్వహిస్తున్నప్పుడు ఎదురవుతున్న సమస్యలపై కూడా చర్చించారు. సమస్యలన్నింటినీ సమగ్ర నివేదికగా రూపొందించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సమావేశం తీర్మానించింది. కార్యక్రమంలో వెలవలపల్లి మృత్యుంజయ శర్మ, సుదర్శనం నారాయణాచార్యులు, నేతేటి గోపాల ఆచార్యులు, రాచకొండ శ్రీనివాస శర్మ తదితరులు పాల్గొన్నారు.

అనకాపల్లి

సీసీ కెమెరాలతో హిట్‌ అండ్‌ రన్‌ వాహనం గుర్తింపు

పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో) యలమంచిలి, అక్టోబర్ 6: పులపర్తి జంక్షన్‌ వద్ద సోమవారం ఉదయం రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున్న భార్యాభర్తలను ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయిన హిట్‌ అండ్‌ రన్‌ ఘటనలో వాహనాన్ని యలమంచిలి రూరల్‌ పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాల ఫుటేజీలను నిశితంగా పరిశీలించిన పోలీసులు ప్రమాదానికి కారణమైన AP 39 WH 1339 నంబర్‌ గల లారీని గుర్తించారు. ప్రమాద సమయంలో లారీని నడిపిన బీహార్‌ రాష్ట్రానికి చెందిన **ధర్మేంద్ర కుమార్‌ (బహదూర్‌ ప్రసాద్‌ కుమారుడు)**ను అదుపులోకి తీసుకున్నారు. సాంకేతిక ఆధారాలతో పాటు సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి తక్కువ సమయంలోనే ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించి నిందితుడిని అదుపులోకి తీసుకున్న యలమంచిలి రూరల్‌ పోలీస్‌ సిబ్బందిని సీఐ ధనుజయరావు అభినందించారు. ఘటనపై పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

అనకాపల్లి

అనకాపల్లిలో అంతర్రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠా గుట్టురట్టు!

పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో) ఇద్దరు అరెస్ట్.. 4.5 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం అనకాపల్లి, అక్టోబర్ 6: అనకాపల్లి పట్టణంలో చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రెండు స్నాచింగ్ కేసులను ఛేదించారు. వారి నుంచి సుమారు 4.5 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు మహేందర్ సింగ్ గతంలో 36కు పైగా చైన్ స్నాచింగ్ కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రాపిడో బైక్ రైడర్‌గా పనిచేస్తున్న అతడు ఒంటరిగా వెళ్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని బైక్‌పై వచ్చి బంగారు గొలుసులు లాక్కెళ్లేవాడని పేర్కొన్నారు. చోరీ చేసిన సొత్తును మండ్రు లత రత్నాకర్‌కు ఇచ్చి నగల దుకాణాల్లో విక్రయించేవాడని తెలిపారు. మే 22న అనకాపల్లి బొడ్డేడువారి వీధి, గాంధీనగర్‌లో జరిగిన రెండు చైన్ స్నాచింగ్ కేసులను పోలీసులు ఛేదించారు. ఎస్ఐ ఎ.వెంకటేశ్వరరావు, క్రైమ్ సిబ్బంది ప్రత్యేక నిఘాతో నిందితులను పట్టుకున్నారు. టౌన్ సీఐ జి.ప్రేమకుమార్, ఎస్ఐతో పాటు పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా అభినందించారు.

అనకాపల్లి

నూకాంబిక ఆలయంలో ఘనంగా వరుణ యాగం..

పున్నమి ప్రతినిధి ఆనంద్ ( జిల్లా బ్యూరో) అనకాపల్లి, అక్టోబర్ 6: ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీశ్రీశ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో దేవదాయ ధర్మదాయ శాఖ ఆదేశాల మేరకు వరుణ యాగాన్ని ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని రాష్ట్రంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, నీటి వనరులు నిండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు. రైతులకు సాగునీరు సమృద్ధిగా లభించి, ప్రజలు సుఖశాంతులతో సుభిక్షంగా జీవించాలన్న సంకల్పంతో వేదోక్త పద్ధతిలో వరుణ యాగాన్ని నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో గణపతి పూజ, పుణ్యాహవచనం, దీక్షా సంకల్పం, అగ్ని ప్రతిష్ఠ, వరుణ జపం, వరుణ యాగం, సహస్ర ఘటాభిషేకం, పూర్ణాహుతి తదితర కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శౌరిమాన్ పటేల్, ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, పీలా గోవింద సత్యనారాయణ, బత్తుల తాతయ్యబాబు, మల్లా సురేంద్ర, కోట్ని బాలాజీ, దేవదాయ శాఖ అధికారులు, ఆలయ చైర్మన్ పీలా నాగశ్రీను, ఈఓ యాళ్ల శ్రీధర్, జోనల్ కమిషనర్ చక్రవర్తి, ఆలయ ధర్మకర్తలు, అధికారులు, వేద పండితులు తదితరులు పాల్గొన్నారు.

అనకాపల్లి

మత్స్యకారులకు ఉచిత బియ్యం వెంటనే పంపిణీ చేయాలి

పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో) అచ్యుతాపురం, అక్టోబర్ 6: తుపాను పరిస్థితులతో జీవనోపాధి కోల్పోయిన తీర ప్రాంత మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన 50 కేజీల ఉచిత బియ్యాన్ని తక్షణమే పంపిణీ చేయాలని పూడిమడక మత్స్యకార నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం అచ్యుతాపురం తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టి జూనియర్ అసిస్టెంట్ రాకేష్‌కు వినతిపత్రం అందజేశారు. జిల్లా మత్స్యకార నాయకులు చోడిపల్లి అప్పారావు, వాసుపల్లి శ్రీనివాసరావు, ఉమ్మిడి అప్పారావు మాట్లాడుతూ పూడిమడకతో పాటు తంతడి, ముత్యాలమ్మపాలెం, తిక్కవాణిపాలెం, లోవపాలెం, గజ్జిరెడ్డిపాలెం తదితర తీర గ్రామాల్లో వేలాది కుటుంబాలు సముద్ర వేటపైనే ఆధారపడి జీవిస్తున్నాయని తెలిపారు. వేట బంద్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు 50 కేజీల బియ్యం ప్రకటించి పది రోజులు దాటినా పంపిణీ ప్రారంభం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తహశీల్దార్ ఉన్నతాధికారులతో మాట్లాడి బియ్యాన్ని వెంటనే అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మత్స్యకారులు వాసుపల్లి రమణ, ఏరిపిల్లి అప్పన్న, కొండ్ల గణేష్, మద్దిల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అనారోగ్యంతో ఉన్న టీడీపీ సీనియర్ నాయకుడికి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పరామర్శ

కలిగిరి, అక్టోబర్ 6: కలిగిరి మండలం జిర్రావారిపాలెంకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు జిర్రా పెద్ద అంకిరెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆయన స్వగృహానికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వైద్య చికిత్సకు అవసరమైన సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జిర్రావారిపాలెంలో విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభం

కలిగిరి, అక్టోబర్ 6: గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అన్నారు. కలిగిరి మండలం జిర్రావారిపాలెంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్, ఎన్‌హెచ్‌ఎం నిధులతో రూ.30.80 లక్షల వ్యయంతో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్–ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కేంద్రం ద్వారా ప్రాథమిక వైద్యం, ఆరోగ్య పరీక్షలు, మందుల పంపిణీ తదితర సేవలు గ్రామస్థులకు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రజలు ఆరోగ్య కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో అధికారులు, వైద్య సిబ్బంది, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.