అనపర్తి, ఆగస్టు 21 (పున్నమి ప్రతినిధి): గత కొన్నేళ్లుగా విద్యుత్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న అనపర్తి, పరిసర గ్రామాల ప్రజలకు ఊరట కల్పించేలా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కీలక చర్యలు చేపట్టారు. లక్ష్మీనరసాపురంలో నూతన విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణం కోసం రూ.4.60 కోట్ల నిధులను మంజూరు చేయించారు.
లక్ష్మీనరసాపురంలో 33/11 కేవీ సబ్‌స్టేషన్‌తో పాటు ఫీడర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్తంభాల నిర్మాణం చేపట్టేందుకు ఈ నిధులను కేటాయించారు.
నూతన సబ్‌స్టేషన్ నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే అనపర్తి, లక్ష్మీనరసాపురం, పరిసర గ్రామాల్లో విద్యుత్ సరఫరా వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. తరచూ ఎదురవుతున్న విద్యుత్ అంతరాయాలు, లో-వోల్టేజ్ సమస్యలు తగ్గడంతో పాటు విద్యుత్ సరఫరా నాణ్యత మెరుగుపడనుంది.
ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే నల్లమిల్లి ప్రత్యేక చొరవ తీసుకుని రూ.4.60 కోట్ల నిధులు మంజూరు చేయించడం పట్ల అనపర్తి నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సబ్‌స్టేషన్ నిర్మాణంతో విద్యుత్ కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించనుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


