Tuesday, 22 September 2026

Tag: East Godavari District

తూర్పు గోదావరి

కార్పొరేట్‌ ఆసుపత్రులకు దీటుగా అనపర్తి ఏరియా ఆసుపత్రి

అనపర్తి, సెప్టెంబర్ 21 (పున్నమి ప్రతినిధి): అనపర్తి ఏరియా ఆసుపత్రిలో అధునాతన వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. ఆసుపత్రిలో సౌకర్యాలు పెరగడంతో రోజువారీ ఓపీ 500 నుంచి 600 వరకు పెరిగిందని, చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలు వైద్యం కోసం వస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవల రూ.1.25 కోట్లతో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్‌ పబ్లిక్‌ హెల్త్‌ లేబొరేటరీస్‌ (ఐపీహెచ్‌ఎల్‌)ను ప్రారంభించారు. ఈ లేబొరేటరీ ద్వారా సుమారు 134 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. మైక్రోబయాలజీ, హీమటాలజీ, క్లినికల్‌ బయోకెమిస్ట్రీ తదితర విభాగాలకు సంబంధించిన పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అదేవిధంగా ఇటీవల ఆసుపత్రిలో బ్లడ్‌ స్టోరేజ్‌ సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో అత్యవసర సమయాల్లో రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందే అవకాశం ఏర్పడింది. ఈ నేపథ్యంలో సోమవారం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో స్వయంగా వైద్య పరీక్షలు చేయించుకోవడంతో పాటు ఎక్స్‌రే పరీక్ష కూడా చేయించుకుని అక్కడ అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాలను పరిశీలించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.

తూర్పు గోదావరి

పిల్లల్లో పఠనాసక్తి, అక్షరాస్యతా నైపుణ్యాల పెంపునకు కమ్యూనిటీ లైబ్రరీలు

అనపర్తి, సెప్టెంబర్ 21 (పున్నమి ప్రతినిధి): ఐటీసీ బంగారు భవిష్యత్ కార్యక్రమంలో భాగంగా ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనపర్తి ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన “కమ్యూనిటీ లైబ్రరీ కిట్” పంపిణీ కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లైబ్రరీ మెటీరియల్ కిట్‌ను రిబ్బన్ కట్ చేసి చిన్నారుల తల్లులకు అందజేశారు. అనపర్తి నియోజకవర్గ పరిధిలోని 26 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 1, 2వ తరగతులు చదువుతున్న విద్యార్థుల్లో ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా నైపుణ్యాలను అభివృద్ధి చేయడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. పిల్లల అభ్యాసంలో తల్లులను భాగస్వామ్యం చేస్తూ ఆయా గ్రామాల్లో కమ్యూనిటీ లైబ్రరీలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. లైబ్రరీల్లోని పుస్తకాలు, విద్యా సామగ్రిని వినియోగించడం ద్వారా చిన్నారుల్లో చదివే అలవాటు, అవగాహన, ప్రాథమిక నైపుణ్యాలు పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఓ రాజా రమేష్ ప్రేమ్‌కుమార్, ఎంపీడీఓ రామకృష్ణారెడ్డి, తహసీల్దార్ అనిల్‌కుమార్, ఎంఈఓ సత్తిరెడ్డి, అనపర్తి పీఏసీఎస్ అధ్యక్షుడు దత్తుడు శ్రీను, టీడీపీ సీనియర్ నాయకుడు ఆదినారాయణ, టీడీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు శేషారత్నం, మాజీ సర్పంచ్ హేమతులసి, ఐటీసీ వెల్ఫేర్ ఆఫీసర్ సింధూజ, ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ రీడ్ ఇండియా ప్రోగ్రామ్ మేనేజర్ సందీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

రాజమహేంద్రవరంలో ‘ద్వారక ఓవర్సీస్’ కన్సల్టెన్సీ ప్రారంభం

రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరంలో కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు కుమారుడు ముప్పిడి సుదర్శన్ ఏర్పాటు చేసిన ‘ద్వారక ఓవర్సీస్’ కన్సల్టెన్సీని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన కన్సల్టెన్సీ నిర్వాహకులకు వారు శుభాకాంక్షలు తెలిపారు. విదేశీ విద్య, ఉద్యోగ అవకాశాలను ఆశిస్తున్న వారికి నాణ్యమైన మార్గదర్శకత్వం అందించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, సుదర్శన్ కుటుంబ సభ్యులు, స్నేహితులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

గురజాడ జయంతి సందర్భంగా చిత్రపటానికి నివాళులు

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 21 (పున్నమి ప్రతినిధి): అభ్యుదయ కవితా పితామహుడు, వాడుక భాషా వ్యాప్తికి, సామాజిక సంస్కరణలకు తన రచనల ద్వారా కృషి చేసిన గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా రాజమహేంద్రవరంలోని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఐఏఎస్, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ మేఘా స్వరూప్ ఐఏఎస్, గురజాడ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గురజాడ అప్పారావు తెలుగు సాహిత్యానికి, వాడుక భాష ఉద్యమానికి, సామాజిక చైతన్యానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా రాజమహేంద్రవరంలో రక్తదాన శిబిరం

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 21 (పున్నమి ప్రతినిధి): సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా తూర్పుగోదావరి జిల్లా బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలోని తూర్పుగోదావరి జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, రాజమహేంద్రవరం ఎంపీ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరంలో పలువురు కార్యకర్తలు, యువత రక్తదానం చేశారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా రక్తదానం చేయడం ద్వారా అత్యవసర సమయాల్లో రోగులకు ఉపయోగపడుతుందని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ నాయకులు, తూర్పుగోదావరి జిల్లా బీజేపీ నాయకులు, యువమోర్చా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

తాపీ ధర్మారావు ఆశయాలను కొనసాగించాలి: నల్లమిల్లి

అనపర్తి, సెప్టెంబర్ 19 (పున్నమి ప్రతినిధి): తాపీ ధర్మారావు జయంతి సందర్భంగా అనపర్తిలో ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవహారిక భాషను జర్నలిజంలోకి తీసుకురావడంలో తాపీ ధర్మారావు కీలక పాత్ర పోషించారని అన్నారు. ప్రజలకు సులభంగా అర్థమయ్యే వాడుక భాషలో రచనలు చేసి భాషాభివృద్ధికి విశేష కృషి చేశారని పేర్కొన్నారు. నేటి తరంలో తెలుగు, వ్యవహారిక భాషపై పట్టు తగ్గుతున్న నేపథ్యంలో మాతృభాషను ఆదరిస్తూనే వ్యవహారిక భాషను అలవర్చుకోవాలని సూచించారు. తాపీ ధర్మారావు వంటి మహనీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని భాషా విలువలను కాపాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అధికారులు, అనపర్తి టౌన్ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి: కలెక్టర్ కీర్తి చేకూరి

బిక్కవోలు, సెప్టెంబర్ 18 (పున్నమి ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు బిక్కవోలు మండలం కొమరిపాలెం గ్రామ పంచాయతీ కళ్యాణ మండపంలో ‘ఒక నెల–ఒక నియోజకవర్గం’ కార్యక్రమంలో భాగంగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక–ప్రజా దర్బార్ (PGRS) నిర్వహించారు. కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ మేఘా స్వరూప్, అనపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి నల్లమిల్లి మనోజ్‌రెడ్డి పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ ప్రజల సమస్యలను గుర్తించి సత్వర పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. బిక్కవోలు మండలంలో ప్రధానంగా రెవెన్యూ శాఖకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వచ్చినట్లు చెప్పారు. ముఖ్యంగా 22ఏ భూములు, భూముల విస్తీర్ణంలో వ్యత్యాసాలు, సివిల్ వివాదాలకు సంబంధించిన అర్జీలు అందినట్లు తెలిపారు. అర్జీలను పరిశీలించి తహసీల్దార్, ఆర్డీఓ, జేసీ స్థాయిల్లో పరిష్కరించాల్సిన సమస్యలను గుర్తించి సంబంధిత అధికారుల లాగిన్‌లలో నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. పరిష్కారం కావాల్సిన సమస్యలను అధికారులు ప్రత్యేకంగా పరిశీలించాలని ఆదేశించినట్లు చెప్పారు. వచ్చే వారం రంగంపేట మండలంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నట్లు, ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ కోరారు. కార్యక్రమంలో జిల్లా, మండల అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

పెదపూడి ఎంపీపీ, ఎంపీటీసీలకు ఎమ్మెల్యే నల్లమిల్లి సత్కారం

పెదపూడి, సెప్టెంబర్ 18 (పున్నమి ప్రతినిధి): పెదపూడి ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ పేపకాయల రామచంద్రరావు అకాల మరణానికి సంతాపం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే, ఎంపీటీసీ సభ్యులు, కూటమి నాయకులు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. అనంతరం సెప్టెంబర్ 23తో పదవీకాలం పూర్తికానున్న పెదపూడి మండల ఎంపీపీ కేత తులసి, ఎంపీటీసీ సభ్యులను ఎమ్మెల్యే నల్లమిల్లి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు సేవలందించిన వారి సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్, కాకినాడ డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్, అనపర్తి నియోజకవర్గ, పెదపూడి మండల కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

అనపర్తి ఏరియా ఆసుపత్రిలో సేవా సంకల్ప్ అభియాన్‌ కార్యక్రమాలు

అనపర్తి, సెప్టెంబర్ 17 (పున్నమి ప్రతినిధి): ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా ‘సేవా సంకల్ప్ అభియాన్’ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అనపర్తి ఏరియా ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఆసుపత్రిలో పారిశుధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతో పాటు మహిళా కార్మికులకు రొమ్ము క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. రక్తదానం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చని, ప్రజలు సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పద్మశ్రీ, డాక్టర్‌ తరుణ్‌, వైద్య సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

ఎల్‌నినో ప్రభావంపై రైతుల్లో అవగాహన అవసరం: ఎమ్మెల్యే నల్లమిల్లి

అనపర్తి, సెప్టెంబర్ 16 (పున్నమి ప్రతినిధి): ఎల్‌నినో ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సూచించారు. అనపర్తి సచివాలయం-5 వద్ద ఆత్మ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కిసాన్ మేళాలో ఆయన పాల్గొని మాట్లాడారు. వర్షాలు అధికంగా కురవడం మాత్రమే ప్రకృతి వైపరీత్యం కాదని, వర్షాభావ పరిస్థితులు కూడా తీవ్ర ప్రభావం చూపుతాయని ఎమ్మెల్యే తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరగడం, సాగునీరు, భూగర్భజలాల లభ్యతపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. గోదావరి డెల్టా ప్రాంతంలో ప్రస్తుతం సాగునీటి పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ, ఇతర ప్రాంతాల్లో నీటి కొరత తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. ఉష్ణోగ్రతల్లో అసమతుల్యత కారణంగా వరి పంటకు చీడపీడల సమస్యలు పెరిగి పెట్టుబడి వ్యయం అధికమయ్యే అవకాశం ఉందని, దిగుబడులపై కూడా ప్రభావం పడవచ్చని రైతులను అప్రమత్తం చేశారు. భవిష్యత్‌లో సాగునీటితో పాటు తాగునీటి లభ్యతపై కూడా ముందస్తు ప్రణాళిక అవసరమని సూచించారు. ప్రకృతిని పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రకృతి వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణపై రైతులు అవగాహన పెంచుకోవాలని నల్లమిల్లి కోరారు. కిసాన్ మేళాలో ఏర్పాటు చేసిన వ్యవసాయ, ప్రకృతి వ్యవసాయ ప్రదర్శన స్టాళ్లను రైతులు సందర్శించి నూతన పద్ధతులపై అవగాహన పొందాలని సూచించారు. కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.