Tuesday, 22 September 2026

Tag: East Godavari District

తూర్పు గోదావరి

అయ్యాన్ పుట్టినరోజున వృద్ధులకు అన్నదానం

పర్చూరు, సెప్టెంబరు 5 (పున్నమి ప్రతినిధి): వేమగిరికి చెందిన అడ్డగళ్ల నవీన్–వెంకట స్వాతి దంపతుల కుమారుడు అయ్యాన్ 2వ పుట్టినరోజు సందర్భంగా పర్చూరులోని ఆశ్రయ వృద్ధుల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ సేవా సమితి ఆధ్వర్యంలో, అయ్యాన్ తాతయ్య, నానమ్మలు అడ్డగళ్ల వెంకట సూర్యనారాయణ, నాగలక్ష్మి దంపతుల సహకారంతో వృద్ధులకు మధ్యాహ్న భోజనం అందించారు. పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమంగా నిర్వహించడం పట్ల ఆశ్రమ యాజమాన్యం, వృద్ధులు హర్షం వ్యక్తం చేసి దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. అయ్యాన్‌ను ఆశీర్వదించారు.

తూర్పు గోదావరి

అనపర్తి ఏరియా ఆసుపత్రిలో వైద్య సేవలకు మరింత బలం

అనపర్తి, సెప్టెంబర్ 5 (పున్నమి ప్రతినిధి): అనపర్తి ఏరియా ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్లడ్ స్టోరేజ్ యూనిట్, ఆర్ఓ ప్లాంట్‌ను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఆసుపత్రిలో వైద్య సేవలు గణనీయంగా మెరుగుపడ్డాయని, రోజుకు 400 నుంచి 500 మంది రోగులకు సేవలు అందుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. త్వరలో ఐపిహెచ్ఎల్ ల్యాబ్ అందుబాటులోకి వస్తే 165 రకాల పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. వైద్యులు, సిబ్బంది సేవలను అభినందిస్తూ ఆసుపత్రి అభివృద్ధికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. నూతన సూపరింటెండెంట్ డాక్టర్ పద్మశ్రీకి శుభాకాంక్షలు తెలిపారు. పదోన్నతి పొందిన డాక్టర్ రామాగుర్రెడ్డిని అభినందించారు. కార్యక్రమంలో హెచ్‌డీఎస్ సభ్యులు, కూటమి నాయకులు, వైద్యులు, సిబ్బంది, కార్యకర్తలు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

అనపర్తి ఏరియా ఆసుపత్రిలో వైద్య సేవలకు మరింత బలం

బ్లడ్ స్టోరేజ్ యూనిట్, ఆర్ఓ ప్లాంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే నల్లమిల్లి అనపర్తి, సెప్టెంబరు 5 (పున్నమి ప్రతినిధి): అనపర్తి ఏరియా ఆసుపత్రిలో వైద్య సేవలను మరింత బలోపేతం చేస్తూ నూతనంగా ఏర్పాటు చేసిన ఐపిహెచ్ఎల్ (ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీస్) బ్లడ్ స్టోరేజ్ యూనిట్, ఆర్ఓ ప్లాంట్‌లను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రి ప్రాంగణంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అనపర్తి ఏరియా ఆసుపత్రిలో బ్లడ్ స్టోరేజ్ యూనిట్, ఆర్ఓ ప్లాంట్ అందుబాటులోకి రావడం సంతోషకరమన్నారు. ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేసిన వైద్యులు, వైద్యేతర సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, హెచ్‌డీఎస్ సభ్యులు, కూటమి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. సివిల్ సర్జన్‌గా పదోన్నతి పొంది రాజమండ్రి జెడ్‌ఎంఓ మలేరియా అధికారిగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ రామాగుర్రెడ్డిని ఎమ్మెల్యే అభినందించారు. నూతన ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ పద్మశ్రీకి శుభాకాంక్షలు తెలిపారు. గత రెండేళ్లుగా ఆసుపత్రిలో అందుతున్న మెరుగైన వైద్య సేవలపై ప్రజలే మాట్లాడుకునే స్థాయికి తీసుకురావడంలో వైద్య సిబ్బంది కృషి అభినందనీయమన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో అనపర్తిలో 100 పడకల ఆసుపత్రి పనితీరు గణనీయంగా మెరుగుపడిందని, జన్మభూమి హాల్ట్ తర్వాత ఇది మరో ముఖ్యమైన విజయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆసుపత్రిలో చిన్నచిన్న లోపాలు ఉంటే వాటిని హెచ్‌డీఎస్ సభ్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పరిష్కరిస్తున్నారని తెలిపారు. సమస్యలను మీడియా కూడా సానుకూల దృక్పథంతో అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. కూటమి ప్రభుత్వం వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇప్పటికే 65 రకాల వైద్య పరీక్షలు అందుబాటులోకి వచ్చాయని, త్వరలో ఐపిహెచ్ఎల్ ల్యాబ్‌ను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి వర్చువల్‌గా ప్రారంభించనున్నారని చెప్పారు. అనంతరం అనపర్తి ఆసుపత్రిలో 165 రకాల పరీక్షలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. జిల్లాలో జీజీహెచ్ తర్వాత 100 పడకల ఆసుపత్రిగా అనపర్తి ఏరియా ఆసుపత్రికి పరిధిలోని సీహెచ్‌సీలను అనుసంధానం చేయడంతో రోగుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. ప్రస్తుతం రోజుకు సుమారు 400 నుంచి 500 మంది వరకు రోగులు ఆసుపత్రికి వస్తున్నారని, వారికి నిరంతరాయంగా వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు, సిబ్బందిని అభినందించారు. ఆసుపత్రి అభివృద్ధికి ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్‌డీఎస్ సభ్యులు, అనపర్తి నియోజకవర్గ కూటమి నాయకులు, అనపర్తి మండల, టౌన్ కూటమి నాయకులు, కార్యకర్తలు, వైద్యులు, వైద్యేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. చిన్నారుల వేషధారణకు ఎమ్మెల్యే నల్లమిల్లి దంపతుల అభినందనలు

అనపర్తి శ్రీ విష్ణాలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సతీమణి మహాలక్ష్మి దంపతులు ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో ముచ్చటగా అలరించిన చిన్నారులను ఎమ్మెల్యే దంపతులు ప్రత్యేకంగా అభినందించారు. చిన్నారుల వేషధారణ, చక్కటి ప్రదర్శనను ప్రశంసిస్తూ వారికి మెమెంటోలు అందజేశారు. చిన్నారులతో ముచ్చటించి, వారి ఉత్సాహాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి టౌన్ కూటమి నాయకులు, కార్యకర్తలు, చిన్నారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

ఎస్‌ఐఆర్‌ ఫేజ్‌–2 క్లెయిమ్స్‌, అభ్యంతరాలపై వేగం పెంచాలి

అనపర్తి, సెప్టెంబరు 4 (పున్నమి ప్రతినిధి): అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తన కార్యాలయంలో అనపర్తి టౌన్‌ బీఎల్‌ఏలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎస్‌ఐఆర్‌ ఫేజ్‌–2కు సంబంధించి క్లెయిమ్స్‌, అభ్యంతరాల స్వీకరణ గడువును సెప్టెంబరు 10వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపారు. క్లెయిమ్స్‌, అభ్యంతరాల ప్రక్రియను వేగవంతం చేసి, సేకరించిన క్లెయిమ్స్‌, అభ్యంతరాలను సంబంధిత బీఎల్‌ఓలకు అందజేయాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీఎల్‌ఏలను కోరారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఎటువంటి అర్హత కలిగిన ఓటరు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో అనపర్తి టౌన్‌ బీఎల్‌ఏలు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

పెద్దాడలో గమ్యం జూనియర్ కళాశాల నూతన క్యాంపస్‌కు శంకుస్థాపన

పెదపూడి, సెప్టెంబరు 4 (పున్నమి ప్రతినిధి): పెద్దాడ గ్రామంలో గమ్యం జూనియర్ కళాశాల నూతన క్యాంపస్ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొని, నూతన క్యాంపస్ నిర్మాణానికి కళాశాల యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం, ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెదపూడి మండల కూటమి నాయకులు, పెద్దాడ గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు, కళాశాల యాజమాన్య ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

శ్రీ విజయదుర్గ, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్ల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో ఎమ్మెల్యే నల్లమిల్లి

పీరా రామచంద్రాపురం, సెప్టెంబరు 4 (పున్నమి ప్రతినిధి): పీరా రామచంద్రాపురం సింగరాయకాలనీలో శ్రీ విజయదుర్గ, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్ల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యేతో పాటు అనపర్తి నియోజకవర్గ కూటమి నాయకులు, పీరా రామచంద్రాపురం గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని స్వామివార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, గ్రామస్థులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు.

తూర్పు గోదావరి

గురుకులంలో నాణ్యతలేని భోజనం

విద్యార్థుల ఆరోగ్యాలతో చెలగాటమాడితే సహించేది లేదు: ఎమ్మెల్యే నల్లమిల్లి కుళ్లిన కూరగాయలు, ఉడకని అన్నం, మాగిన అరటిపండ్లపై ఆగ్రహం అనపర్తి, సెప్టెంబరు 3: విద్యార్థుల ఆరోగ్యాలతో చెలగాటమాడితే సహించేది లేదని, నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. అనపర్తి మండలం లక్ష్మీనరసాపురంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల (బాలుర)ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని వసతిగృహం, భోజనశాలను పరిశీలించిన ఎమ్మెల్యే.. విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని స్వయంగా రుచి చూశారు. అన్నం సరిగ్గా ఉడకకపోవడం, కూర నాణ్యతగా లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులు తినలేక భోజనాన్ని డస్ట్‌బిన్లలో పడేస్తున్న పరిస్థితిని గమనించారు. భోజనశాలలో నిల్వ ఉంచిన కూరగాయలను పరిశీలించగా కుళ్లిపోయిన వంకాయలు, నీరు కారుతున్న ఉల్లిపాయలు, ముదిరిపోయిన ఆనపకాయలు, బెండకాయలు, పుచ్చిపోయిన టమోటాలు ఉన్నట్లు గుర్తించారు. ఇలాంటి కూరగాయలను విద్యార్థులకు ఎలా వినియోగిస్తున్నారని సిబ్బందిని ప్రశ్నించారు. పెరుగు పేరుతో అందిస్తున్న పదార్థం కూడా నాణ్యతగా లేదని, నీటిలా ఉందని పేర్కొన్నారు. మెత్తబడి నీరు కారుతున్న చిక్కీలు, పురుగులు ఉన్నట్లు కనిపించిన స్నాక్స్, మాగిపోయిన అరటిపండ్లను కూడా తనిఖీలో గుర్తించినట్లు తెలిపారు. మెనూ అమలుపై ఆగ్రహం ప్రభుత్వం నిర్దేశించిన మెనూను పాఠశాలలో సక్రమంగా అమలు చేయడం లేదని ఎమ్మెల్యే ఆరోపించారు. అల్పాహారం, స్నాక్స్, మధ్యాహ్నం, రాత్రి భోజనాల్లో మెనూ పాటించడం లేదన్నారు. ఆదివారం అందించాల్సిన చికెన్ భోజనం కూడా విద్యార్థులకు అందడం లేదని తెలిపారు. రాత్రి భోజనానికి సంబంధించిన అన్నం, పప్పును ఉదయం 10 గంటలకే వండి ఉంచడాన్ని ఎమ్మెల్యే తప్పుబట్టారు. సాయంత్రం వరకు ఆహారం నాణ్యత ఎలా ఉంటుందనే కనీస ఆలోచన కూడా లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాత్రి మెనూలో చిక్కుడుకాయ కూర ఉండాల్సి ఉండగా బొబ్బర్లను కట్ చేసి పెట్టిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. స్టాక్ రిజిస్టర్ నిర్వహణపై ప్రశ్నలు కూరగాయలు, ఇతర సరుకుల వివరాలను నమోదు చేసే స్టాక్ రిజిస్టర్ ఎక్కడ ఉందని కేర్‌టేకర్‌ను ఎమ్మెల్యే ప్రశ్నించారు. తొలుత వెరిఫికేషన్ కోసం సోషల్ వెల్ఫేర్ కార్యాలయానికి పంపించామని చెప్పి, అనంతరం తన ఇంటి వద్ద ఉందని సమాధానం చెప్పినట్లు తెలిపారు. పాఠశాలకు సంబంధించిన స్టాక్ రిజిస్టర్‌ను కాకినాడలోని వ్యక్తిగత ఇంటి వద్ద ఉంచడం ఏమిటని ప్రశ్నించారు. ప్రతిరోజూ వచ్చే సరుకులను మెస్ కమిటీ సభ్యులు పరిశీలించే విధానం కూడా సక్రమంగా లేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అవసరమైన చోట మాత్రమే వారి సంతకాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. పాఠశాల నిర్వహణలో ప్రిన్సిపల్, కేర్‌టేకర్ తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ సెలవులో ఉండటంతో ఆయనతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా పాఠశాలలో నెలకొన్న పరిస్థితిని ప్రభుత్వం, సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా కలెక్టర్, సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే నల్లమిల్లి తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వంతో మాట్లాడతానన్నారు. తనిఖీ సందర్భంగా విద్యార్థులు తెలిపిన ఇతర సమస్యలను కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి నిధులు అందుబాటులో ఉంటే వాటితో, లేకుంటే సీఎస్‌ఆర్‌ నిధుల ద్వారా అవసరమైన పనులు చేపడతామన్నారు. విద్యార్థులు కోరిన ఫ్యాన్లు, టైల్స్ తదితర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. గురుకులంలో భోజన నాణ్యతను మెరుగుపరచడంతో పాటు స్టాక్ నిర్వహణ, పరిశుభ్రత, విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే నల్లమిల్లి స్పష్టం చేశారు.

తూర్పు గోదావరి

వాకతిప్పలో ఘనంగా “మన ఊరు – మన జెండా” కార్యక్రమం

కపిలేశ్వరపురం, సెప్టెంబర్ 2 (పున్నమి ప్రతినిధి): మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలం వాకతిప్ప గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో “మన ఊరు – మన జెండా” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నూతనంగా ఏర్పాటు చేసిన బీజేపీ జెండా స్తూపం వద్ద అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమా జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ.. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి విశేషంగా సహకరిస్తోందన్నారు. అమరావతి, పోలవరం, విశాఖ రైల్వే జోన్, రహదారులు, రైల్వేలు, గృహ నిర్మాణం వంటి అనేక రంగాల్లో కేంద్రం సహకారం అందిస్తోందని తెలిపారు. బీజేపీ కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై పూర్తి అవగాహన పెంచుకుని అర్హులైన ప్రజలకు వాటి ప్రయోజనాలు అందించాలని సూచించారు. పార్టీ కార్యక్రమాలకు తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తమనంపూడి రామకృష్ణారెడ్డి, చిట్టిబాబు, మండల అధ్యక్షురాలు పద్మావతి, మాజీ సర్పంచ్ స్రవంతి, నియోజకవర్గ కన్వీనర్ సాయిరామ్ తదితరులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

ఒడిశా గవర్నర్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే నల్లమిల్లి

తెలుగు రైతుల ధాన్యం కొనుగోలు సమస్య పరిష్కారానికి చొరవ చూపిన గవర్నర్‌ కంభంపాటి హరిబాబు అనపర్తి నియోజకవర్గ పర్యటనకు సాదర ఆహ్వానం అనపర్తి, సెప్టెంబర్ 2 (పున్నమి ప్రతినిధి): ఒడిశాలో వ్యవసాయం చేస్తున్న తెలుగు రైతులు ఎదుర్కొంటున్న ధాన్యం కొనుగోలు సమస్య పరిష్కారానికి చొరవ చూపిన ఒడిశా గవర్నర్‌ శ్రీ కంభంపాటి హరిబాబుకు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు గవర్నర్‌కు ఫోన్‌ చేసి మాట్లాడారు. ఒడిశాలో తాము పండించిన ధాన్యాన్ని అక్కడి ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని తెలుగు రైతులు ఇటీవల ఎమ్మెల్యే నల్లమిల్లి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి సహకారంతో ఒడిశా ప్రభుత్వంలోని సంబంధిత మంత్రులతో చర్చించి సమస్య పరిష్కారానికి నల్లమిల్లి కృషి చేశారు. ఈ సమస్య పరిష్కారంలో గవర్నర్‌ కంభంపాటి హరిబాబు కీలకంగా స్పందించారు. ఎంపీ పురందేశ్వరి, ఎమ్మెల్యే నల్లమిల్లి విజ్ఞప్తి మేరకు సంబంధిత శాఖల మంత్రులతో మాట్లాడి తెలుగు రైతుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసేలా చొరవ తీసుకున్నారు. రైతుల సమస్యను తన దృష్టికి తీసుకురాగానే స్పందించి, సంబంధిత మంత్రులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేసిన గవర్నర్‌ హరిబాబుకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని ఎమ్మెల్యే నల్లమిల్లి తెలిపారు. ఈ సందర్భంగా అనపర్తి నియోజకవర్గానికి పర్యటించాలని గవర్నర్‌ హరిబాబును ఎమ్మెల్యే నల్లమిల్లి సాదరంగా ఆహ్వానించారు. ఆయన ఆహ్వానానికి గవర్నర్‌ సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.