బ్లడ్ స్టోరేజ్ యూనిట్, ఆర్ఓ ప్లాంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే నల్లమిల్లి
అనపర్తి, సెప్టెంబరు 5 (పున్నమి ప్రతినిధి): అనపర్తి ఏరియా ఆసుపత్రిలో వైద్య సేవలను మరింత బలోపేతం చేస్తూ నూతనంగా ఏర్పాటు చేసిన ఐపిహెచ్ఎల్ (ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీస్) బ్లడ్ స్టోరేజ్ యూనిట్, ఆర్ఓ ప్లాంట్‌లను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రి ప్రాంగణంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని కూడా ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అనపర్తి ఏరియా ఆసుపత్రిలో బ్లడ్ స్టోరేజ్ యూనిట్, ఆర్ఓ ప్లాంట్ అందుబాటులోకి రావడం సంతోషకరమన్నారు. ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేసిన వైద్యులు, వైద్యేతర సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, హెచ్‌డీఎస్ సభ్యులు, కూటమి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
సివిల్ సర్జన్‌గా పదోన్నతి పొంది రాజమండ్రి జెడ్‌ఎంఓ మలేరియా అధికారిగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ రామాగుర్రెడ్డిని ఎమ్మెల్యే అభినందించారు. నూతన ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ పద్మశ్రీకి శుభాకాంక్షలు తెలిపారు. గత రెండేళ్లుగా ఆసుపత్రిలో అందుతున్న మెరుగైన వైద్య సేవలపై ప్రజలే మాట్లాడుకునే స్థాయికి తీసుకురావడంలో వైద్య సిబ్బంది కృషి అభినందనీయమన్నారు.
కూటమి ప్రభుత్వ హయాంలో అనపర్తిలో 100 పడకల ఆసుపత్రి పనితీరు గణనీయంగా మెరుగుపడిందని, జన్మభూమి హాల్ట్ తర్వాత ఇది మరో ముఖ్యమైన విజయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆసుపత్రిలో చిన్నచిన్న లోపాలు ఉంటే వాటిని హెచ్‌డీఎస్ సభ్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పరిష్కరిస్తున్నారని తెలిపారు. సమస్యలను మీడియా కూడా సానుకూల దృక్పథంతో అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.
కూటమి ప్రభుత్వం వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇప్పటికే 65 రకాల వైద్య పరీక్షలు అందుబాటులోకి వచ్చాయని, త్వరలో ఐపిహెచ్ఎల్ ల్యాబ్‌ను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి వర్చువల్‌గా ప్రారంభించనున్నారని చెప్పారు. అనంతరం అనపర్తి ఆసుపత్రిలో 165 రకాల పరీక్షలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
జిల్లాలో జీజీహెచ్ తర్వాత 100 పడకల ఆసుపత్రిగా అనపర్తి ఏరియా ఆసుపత్రికి పరిధిలోని సీహెచ్‌సీలను అనుసంధానం చేయడంతో రోగుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. ప్రస్తుతం రోజుకు సుమారు 400 నుంచి 500 మంది వరకు రోగులు ఆసుపత్రికి వస్తున్నారని, వారికి నిరంతరాయంగా వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు, సిబ్బందిని అభినందించారు.
ఆసుపత్రి అభివృద్ధికి ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో హెచ్‌డీఎస్ సభ్యులు, అనపర్తి నియోజకవర్గ కూటమి నాయకులు, అనపర్తి మండల, టౌన్ కూటమి నాయకులు, కార్యకర్తలు, వైద్యులు, వైద్యేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.









