రావులపాలెం, ఆగస్టు 31 (పున్నమి ప్రతినిధి): తెలుగు భాష పరిరక్షణ, భావితరాల్లో మాతృభాషపై మమకారం పెంపొందించేందుకు రావులపాలెం సీఆర్‌సీ ఫంక్షన్ హాల్‌లో “శతక పద్య సహస్ర గలార్చన–వేమన శతకం” కార్యక్రమం నిర్వహించారు. ప్రగతి భారతం ట్రస్ట్, మాతృభాష పరిరక్షణ సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో 20కి పైగా పాఠశాలలకు చెందిన 1008 మంది చిన్నారులు పాల్గొన్నారు. వేమన శతకంలోని 108 పద్యాలను విద్యార్థులు కంఠస్థంగా, రాగయుక్తంగా ఆలపించి ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చిన్నారుల ప్రతిభను అభినందించారు. వేమన పద్యాల్లోని నీతి, సామాజిక సందేశాలను భావితరాలకు చేరువ చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పద్యాలపై పరీక్ష నిర్వహించి, ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసాపత్రాలు అందజేశారు. ప్రగతి భారతం ట్రస్ట్ చైర్మన్ తవనంపూడి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, టీడీపీ సాంస్కృతిక శాఖ అధ్యక్షులు ఆనందరెడ్డి (బాబా) తదితరులు పాల్గొన్నారు.




