అంతిమ సంస్కారాలకు గౌరవప్రదమైన వాతావరణం కల్పిస్తాం: ఎమ్మెల్యే నల్లమిల్లి
బలభద్రపురం, ఆగస్టు 31 (పున్నమి ప్రతినిధి): బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలోని రుద్రభూమిని రూ.50 లక్షలతో ఆధునికంగా అభివృద్ధి చేసేందుకు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి భూమిపూజ చేశారు. మండల పరిషత్ నుంచి రూ.4 లక్షలు, గ్రామ పంచాయతీ నుంచి రూ.10 లక్షలు, దాతల సహకారంతో రూ.36 లక్షలు సమకూర్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బలభద్రపురం రుద్రభూమిలో కనీస వసతులు లేకపోవడంతో అంతిమ సంస్కారాలకు వచ్చే గ్రామస్థులు, బంధువులు చాలా కాలంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు రుద్రభూమిని అన్ని మౌలిక వసతులతో ఆధునికంగా తీర్చిదిద్దాలని నిర్ణయించామన్నారు.
అంతిమ సంస్కారం కూడా ప్రతి ఒక్కరికీ గౌరవప్రదంగా జరిగేలా వసతులు కల్పించడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. రుద్రభూమిలో అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో పాటు పరిశుభ్రమైన, సురక్షితమైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.
గ్రామస్తుల సహకారంతోనే రూ.50 లక్షల నిధులు సమకూరాయని, పార్టీలకు అతీతంగా అందరూ కలిసి అభివృద్ధికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. బిక్కవోలు, రామవరం గ్రామాల్లోనూ రుద్రభూముల అభివృద్ధి చేపట్టామని, ఇదే తరహాలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు.
బలభద్రపురం రుద్రభూమి అభివృద్ధి పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తయ్యేందుకు గ్రామస్తులంతా ఐక్యంగా సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం స్ఫూర్తిదాయకమని ఆయన అభినందించారు.


