-అయ్యలూరివారిపల్లిలో పండుగలా 42వ బృహత్ వైద్య శిబిరం
పామూరు, సెప్టెంబర్ 1 ( పున్నమి ప్రతినిధి ): రమణమ్మ మెమోరియల్ మల్లికార్జున రెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మంగళవారం సీ.ఎస్. పురం మండలంలోని అయ్యలూరివారిపల్లి గ్రామంలో నిర్వహించిన 42వ ఉచిత బృహత్ వైద్య శిబిరానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ఈ శిబిరంలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు 250 మందికి పైగా గ్రామస్థులకు నిపుణులైన వైద్యులు ఉచితంగా బాహ్య రోగుల విభాగ పరీక్షలు చేయడమే కాకుండా, రక్తపోటు, మధుమేహం వంటి ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా ఔషధాలను పంపిణీ చేశారు. గ్రామీణ ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్న ఆసుపత్రి అధినేత డాక్టర్ పి. మల్లికార్జున్ రెడ్డి సేవా నిరతిని స్థానికులు కొనియాడారు. గ్రామానికి చెందిన సమాన తిరుపతి, సమాన రమణయ్య, సమాన రమేష్, డి. కేశవరావు (గ్రామీణ వైద్యుడు) శిబిరానికి వచ్చిన రోగులకు ఉచితంగా అరటిపండ్లు, చల్లని మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేసి ఆప్యాయతను చాటుకున్నారు. అనంతరం గ్రామ పెద్దలు డాక్టర్ మల్లికార్జున్ రెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించి ఆయన సామాజిక సేవలను అభినందించారు.


