Tuesday, 22 September 2026

Tag: అనకాపల్లి జిల్లా

అనకాపల్లి

యలమంచిలిలో సద్భావన దివస్‌ సందర్భంగా న్యాయ అవగాహన సదస్సు…!

యలమంచిలి | పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ యలమంచిలిలో సద్భావన దివస్‌ను పురస్కరించుకుని అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె. రమేష్ ఆధ్వర్యంలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వమే భారతీయ సంస్కృతికి మూలమని, కుల, మత, ప్రాంతీయ, భాషా భేదాలకు అతీతంగా మత సామరస్యం, జాతీయ సమగ్రతను పెంపొందించుకోవాలని సూచించారు. హింసకు తావులేకుండా పరస్పరం గౌరవించుకుంటూ శాంతియుతంగా జీవించాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో తలెత్తే పగలు, ప్రతీకారాలు, చిన్నచిన్న విభేదాలను న్యాయస్థానాల వెలుపల సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుని విభేదరహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అనకాపల్లి

వ్యవసాయ సబ్‌డివిజన్ పరిధిలో ఘనంగా కిసాన్ మేళా…!

యలమంచిలి | పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ యలమంచిలి గ్రామంలో రాపేటి శ్రీను కల్లాల వద్ద ఆత్మ సౌజన్యంతో కిసాన్ మేళా నిర్వహించారు. నాలుగు మండలాలకు చెందిన అభ్యుదయ రైతులు, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా రిసోర్స్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వరికి ప్రత్యామ్నాయంగా రాగులు, కందులు, జనుము, ఉలవలు వంటి తక్కువ నీటి పంటలను సాగు చేయాలని సూచించారు. ఏడీఏ శ్రీధర్ రైతులు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని తెలిపారు. రైతులు ఫసల్ బీమా యోజన కింద పంట బీమా నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. రైతు సేవా కేంద్రాల ద్వారా అవసరమైన విత్తనాలను సకాలంలో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతు సేవా కేంద్రాల సిబ్బంది, అభ్యుదయ రైతులు పాల్గొన్నారు.

అనకాపల్లి

ఎకో క్లబ్ ఫర్ మిషన్ లైఫ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం..!

అనకాపల్లి జిల్లా: పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ ఎస్. రాయవరం: ఎస్. రాయవరం మండలం రేవుపోలవరం జెడ్.పి.హెచ్.ఎస్. పాఠశాలలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా “ఎకో క్లబ్ ఫర్ మిషన్ లైఫ్” కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి అరుణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పి.డి. మాస్టర్ శ్రీ కృష్ణ, జీవశాస్త్ర ఉపాధ్యాయులు, ఎకో క్లబ్ ఇన్‌ఛార్జ్ శ్రీ కె. ప్రవీణ్ కుమార్ సమక్షంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులు పాఠశాల ఆవరణలో వివిధ రకాల మొక్కలను నాటి, వాటికి నీరు పోసి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను చాటుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు “ఎకో క్లబ్ ఫర్ మిషన్ లైఫ్” సర్టిఫికెట్లను ప్రధానోపాధ్యాయురాలు అరుణ, ఉపాధ్యాయులు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా హెచ్.ఎం. అరుణ మాట్లాడుతూ “ప్రతి విద్యార్థి కనీసం ఒక మొక్కను నాటి, దానిని సంరక్షించి పెంచడం మనందరి కర్తవ్యం” అని పిలుపునిచ్చారు.

అనకాపల్లి

పశువైద్యశాల ఉంది.. వైద్యుడే లేడు! అత్యవసర వేళ పశువుల పరిస్థితి ఏంటి?

పేరుకే మేజర్ పంచాయతీ.. సమస్యలే సమస్యలు.. పరిష్కారాలు కరువు! యలమంచిలి , ఆగస్టు 20 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): ఎలమంచిలి మండలంలోని మేజర్ పంచాయతీ ఏటికొప్పాకలో పశువైద్యశాల ఉన్నా రెగ్యులర్ పశువైద్యాధికారి లేకపోవడం పశుపోషకులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. ప్రస్తుతం ఎస్‌ఓ, ఒక అటెండర్‌తోనే పశువైద్యశాల నడుస్తుండగా, ఎలమంచిలి నుంచి వారంలో రెండు రోజులు మాత్రమే వైద్య సేవలు అందుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. రూమ్ ఉంది.. కుర్చీ ఉంది.. డాక్టర్ మాత్రం లేరు! పశువులకు అనారోగ్యం, ప్రమాదం లేదా ప్రసవ సమయంలో అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే వైద్యం అందకపోవడంతో పశుపోషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర సమయంలో పశువులను ఎలమంచిలి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని వాపోతున్నారు. మేజర్ పంచాయతీ స్థాయిలో ఉన్న పశువైద్యశాలలోనే పూర్తిస్థాయి వైద్య సేవలు అందకపోవడంపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి ఏటికొప్పాకకు శాశ్వత పశువైద్యాధికారిని నియమించాలని కోరుతున్నారు. ముఖ్యంగా ఎలమంచిలి ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారించి పశువైద్యశాలకు పూర్తిస్థాయి సిబ్బందిని అందుబాటులోకి తీసుకురావాలని పశుపోషకులు విజ్ఞప్తి చేస్తున్నారు.

అనకాపల్లి

మహిళలపై ఆన్‌లైన్ వేధింపులపై అవగాహన.. అప్రమత్తతే రక్షణ!

మహిళలపై ఆన్‌లైన్ వేధింపులపై అవగాహన.. అప్రమత్తతే రక్షణ! ఎలమంచిలి, ఆగస్టు 19 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): ఎలమంచిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళలపై జరుగుతున్న ఆన్‌లైన్ వేధింపులపై బుధవారం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఉమెన్ ఎంపవర్‌మెంట్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సోషల్ మీడియా ద్వారా మహిళలు, యువతులు ఎదుర్కొంటున్న సైబర్ వేధింపులు, అశ్లీల సందేశాలు, బెదిరింపులపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. ఉమెన్ ఎంపవర్‌మెంట్ సెల్ కన్వీనర్ డా. కె. సుజాత, ఇంగ్లీష్ అధ్యాపకురాలు డా. పద్మప్రియ మాట్లాడుతూ సాంకేతికత పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయని తెలిపారు. వ్యక్తిగత వివరాలను సోషల్ మీడియాలో పంచుకునే విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వేధింపులు ఎదురైతే భయపడకుండా సైబర్ క్రైమ్ పోలీసులకు లేదా దిశ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. కంప్యూటర్ అధ్యాపకులు దేవి, సంధ్య డిజిటల్ భద్రత, ప్రైవసీ సెట్టింగులపై వివరించారు. కార్యక్రమంలో రాజేశ్వరి, మహిళా అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

అనకాపల్లి

ఎస్సీ యువతకు ఉచిత డొమైన్ శిక్షణ.. శిక్షణ అనంతరం ఉద్యోగావకాశాలు!

విశాఖపట్నం: ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు చెందిన ఎస్సీ యువతీ, యువకులకు 6 డొమైన్లలో ఉచిత శిక్షణ అందించనున్నట్లు అధికారులు తెలిపారు. 10వ తరగతి పాస్ లేదా ఫెయిల్, ఇంటర్మీడియట్, డిగ్రీ చదివిన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. శిక్షణ పొందే వారికి ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పించడంతో పాటు, శిక్షణ పూర్తయిన అనంతరం ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న యువత వెంటనే ఎస్సీ కార్పొరేషన్‌ను సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: 6303204314, 8317559817, 9866306567

అనకాపల్లి

తేరువుపల్లిలో ‘ఇంటింటా తెలుగుదేశం’.. కూటమి ప్రభుత్వ అభివృద్ధిపై విస్తృత ప్రచారం

ఎలమంచిలి, ఆగస్టు 19 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): ఎలమంచిలి మున్సిపాలిటీ 3వ వార్డు పరిధిలోని తేరువుపల్లి గ్రామంలో ‘ఇంటింటా తెలుగుదేశం’ కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు, కార్యకర్తలు విజయవంతంగా నిర్వహించారు. బూత్ నంబర్లు 66, 67 పరిధిలో ప్రతి ఇంటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. రోడ్లు, డ్రైనేజీ పనులు, భోగాపురం ఎయిర్‌పోర్టు, పోలవరం ప్రాజెక్టు వంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు తల్లికి వందనం, ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్‌, అన్నదాత సుఖీభవ, శ్రీశక్తి, అన్న క్యాంటీన్లు, దీపం-2 వంటి సంక్షేమ పథకాల వివరాలతో కూడిన కరపత్రాలను ఇంటింటికీ అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు గొర్లె శివన్నారాయణ మూర్తి (నానాజీ), క్లస్టర్‌ ఇన్‌చార్జి కరణం రవికుమార్‌, ఏవీఎస్‌ నాయుడు, వార్డు అధ్యక్షుడు పిల్ల గంగాధర్‌, సెక్రటరీ తుంపాల గంగాధర్‌, తుంపాల కోటిపల్లి నాయుడు, గేదెల అప్పలనాయుడు, పిల్ల సత్యనారాయణ, గళ్ళ నూకినాయుడు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన కల్పించడమే కార్యక్రమం లక్ష్యమని నాయకులు తెలిపారు.

అనకాపల్లి

548 మందికి ఉచిత వస్తి కర్మ చికిత్స.. ఆయుర్వేద రంగంలో ప్రపంచ రికార్డు

అనకాపల్లి, ఆగస్టు 19 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): అనకాపల్లి జిల్లా కొడూరు గ్రామంలోని ఆరోగ్యధాత్రి ఆయుర్వేద రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో నిర్వహించిన మెగా ఆయుర్వేద వైద్య శిబిరం చారిత్రాత్మకంగా నిలిచింది. చరక జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆగస్టు 16 నుంచి 18 వరకు నిర్వహించిన శిబిరంలో 548 మంది రోగులకు ఉచితంగా వస్తి కర్మ చికిత్స అందించారు. వస్తి కర్మతో పాటు విద్ధ కర్మ, అగ్ని కర్మ వంటి ప్రత్యేక ఆయుర్వేద చికిత్సలను కూడా ఉచితంగా అందించారు. 548 మందికి ఉచితంగా వస్తి కర్మ నిర్వహించినందుకు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ ఈ కార్యక్రమాన్ని గుర్తించింది. సంస్థ భారతదేశ ముఖ్య అడ్జుడికేటర్ యతీష్ శుక్లా కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించి రికార్డు సర్టిఫికెట్, ట్రోఫీ, మెడల్‌ను ఆరోగ్యధాత్రి ఆయుర్వేద రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్, వరము చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. టి. సుందర రాజ్ పెరుమాల్‌కు అందజేశారు. ఈ మెగా శిబిరానికి “సౌత్ ఇండియన్ చరక”గా పేరొందిన డా. ఎన్. ఆంజనేయ మూర్తి మార్గదర్శకత్వం వహించారు. కార్యక్రమ విజయానికి పలువురు ఆయుర్వేద వైద్యులు, వైద్య సిబ్బంది, వాలంటీర్లు, నిర్వాహకులు కృషి చేశారు. ఈ రికార్డు కేవలం అవార్డు మాత్రమే కాదని, ఆచార్య చరకుని వారసత్వానికి, ఆయుర్వేద వైద్యుల సేవాభావానికి దక్కిన గౌరవమని డా. సుందర రాజ్ పెరుమాల్ పేర్కొన్నారు.

అనకాపల్లి

శారదా నది ఘాట్ల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

అనకాపల్లి, ఆగస్టు 19 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): వినాయక చవితి సందర్భంగా శారదా నది పరివాహక ప్రాంతాల్లో నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని పలువురు కోరారు. ఘాట్ల వద్ద తాగునీరు, పారిశుద్ధ్యం, లైటింగ్‌, భద్రత, ట్రాఫిక్‌ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించారు. నిమజ్జనం సందర్భంగా నదిలో కాలుష్యం పెరగకుండా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ముందస్తు ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి భక్తులకు సౌకర్యవంతమైన నిమజ్జనాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

అనకాపల్లి

చదువుకున్న పాఠశాలకు సేవ.. రూ.4 వేల విలువైన వంట సామగ్రి విరాళం!

యలమంచిలి, ఆగస్టు 18 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): పేట బయ్యవరం ఎంపీపీ పాఠశాలలో ఎండీఎం నిర్వాహకులకు మిక్సీ, కుక్కర్‌ వంట పనిముట్లను ఉచితంగా అందజేశారు. ఇదే పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసిన పెదపూడి డానియల్‌ డీఎస్సీ-2025లో ఏపీ రెసిడెన్షియల్‌ స్కూల్‌ పీజీటీగా ఉద్యోగం సాధించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు సుమారు రూ.4 వేల విలువైన మిక్సీ, కుక్కర్‌ను పాఠశాల ఎండీఎం ఏజెన్సీకి విరాళంగా అందించారు. డానియల్‌ తల్లి కొండమ్మ విద్యార్థుల పేరిట పనిముట్లను అందజేశారు. సేవాభావంతో విరాళం అందించిన కుటుంబ సభ్యులకు ప్రధానోపాధ్యాయురాలు బి.వి.ధనలక్ష్మి, ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.