Saturday, 26 September 2026

Tag: అనకాపల్లి జిల్లా

అనకాపల్లి

శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు!

పల్లె నిద్రలో పోలీసుల హెచ్చరిక.. ఎన్నికలు ప్రశాంతంగా సాగేందుకు సహకరించాలి పున్నమి ప్రతినిధి ఆనంద్ (అనకాపల్లి జిల్లా బ్యూరో) యలమంచిలి: యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెదపల్లి మున్సిపాలిటీలో శుక్రవారం యలమంచిలి రూరల్ సీఐ ధనుంజయ రావు తో కలిసి పోలీస్ అధికారులు పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని పోలీసులకు సహకారం అందించారు. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని అధికారులు సూచించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించడం, అనవసర వివాదాలకు పాల్పడటం, చట్టవిరుద్ధ కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, ట్రాఫిక్ నిబంధనలు, రహదారి భద్రత, మహిళలు, చిన్నారుల రక్షణపై అవగాహన కల్పించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులకు, అధికారులకు పూర్తిగా సహకరించాలని గ్రామస్తులు, రాజకీయ నాయకులను కోరారు.

అనకాపల్లి

అనకాపల్లి జిల్లాకు సొంత జిల్లా పరిషత్ కార్యాలయం!

ప్రారంభోత్సవానికి హాజరైన ఎమ్మెల్యేలు, కలెక్టర్.. నూర్‌భాషా కార్పొరేషన్ డైరెక్టర్ ఇబ్రహీం భాషా పున్నమి ప్రతినిధి ఆనంద్ ( జిల్లా బ్యూరో) అనకాపల్లి: విశాఖపట్నం జిల్లా నుంచి విడిపోయి అనకాపల్లి జిల్లాగా ఏర్పడిన అనంతరం జిల్లా పరిషత్ కార్యాలయాన్ని అనకాపల్లిలో ప్రారంభించారు. శుక్రవారం జరిగిన కార్యక్రమానికి అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ఆహ్వానం మేరకు రాష్ట్ర నూర్‌భాషా కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ ఇబ్రహీం భాషా హాజరయ్యారు. కార్యక్రమానికి అనకాపల్లి జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అలాగే బీజేపీ నాయకుడు ఈర్ల శ్రీరామ్‌మూర్తి, జిల్లా పరిషత్ సీఈఓ, డిప్యూటీ సీఈఓ, పీడీతో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ కార్యాలయం ద్వారా జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, స్థానిక సంస్థల పరిపాలన మరింత సమన్వయంతో ముందుకు సాగాలని ప్రజాప్రతినిధులు, అధికారులు ఆకాంక్షించారు. నూతన జిల్లా పరిషత్ కార్యాలయం ప్రారంభంతో పరిపాలనా కార్యక్రమాలకు మరింత సౌలభ్యం కలగనుందని పేర్కొన్నారు.

అనకాపల్లి

చెడుగుడు పోటీలకు జోష్.. క్రీడాకారులను పరిచయం చేసుకున్న యూనిట్ ఇన్‌చార్జ్!

మూలజంపలో దుర్గాంబిక అమ్మవారి పండగ సందర్భంగా జిల్లా స్థాయి పోటీలు పున్నమి ప్రతినిధి ఆనంద్ (అనకాపల్లి జిల్లా బ్యూరో) రాంబిల్లి: రాంబిల్లి మండలం మూలజంప గ్రామంలో శ్రీశ్రీశ్రీ దుర్గాంబిక అమ్మవారి పండగ సందర్భంగా నిర్వహిస్తున్న జిల్లా స్థాయి చెడుగుడు పోటీలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం జరుగుతున్న చెడుగుడు పోటీలను యూనిట్ ఇన్‌చార్జ్ అందుకూరి ప్రసాద్ పరిశీలించారు. పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులను పరిచయం చేసుకుని, వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్రీడాకారులతో ముచ్చటించి పోటీల నిర్వహణ, ఏర్పాట్లను పరిశీలించారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా ప్రతిభను ప్రోత్సహించేందుకు ఇలాంటి పోటీలు నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. దుర్గాంబిక అమ్మవారి పండగలో భాగంగా జరుగుతున్న ఈ జిల్లా స్థాయి పోటీలకు వివిధ ప్రాంతాల నుంచి క్రీడాకారులు హాజరవడంతో మూలజంపలో సందడి నెలకొంది.

అనకాపల్లి

పదవులకు వీడ్కోలు.. ప్రజాసేవకు కాదు!

ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న ఎంపీపీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఘన సత్కారం పున్నమి ప్రతినిధి ఆనంద్ (అనకాపల్లి జిల్లా బ్యూరో) అచ్యుతాపురం: ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న అచ్యుతాపురం మండల పరిషత్ అధ్యక్షురాలు కోన సంధ్య బుజ్జి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కో-ఆప్షన్ సభ్యులను ఎంపీడీవో కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. 2021–2026 పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న ప్రజాప్రతినిధులకు పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీవో చైతన్య, మండల పరిషత్ స్పెషల్ ఆఫీసర్ ఎం. యశ్వంత్, మాజీ జెడ్పీటీసీ లాలం రాంబాబు, కో-జెడ్పీటీసీ నర్మాల కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు దేశంశెట్టి శంకరరావు, కోన బుజ్జి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాజీ ప్రజాప్రతినిధులు భావోద్వేగానికి గురయ్యారు. “పదవికి మాత్రమే విరమణ.. ప్రజాసేవకు మాత్రం విరమణ లేదు” అంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి కొనసాగిస్తామని తెలిపారు. ఎంపీపీ కోన సంధ్య బుజ్జి మాట్లాడుతూ ఐదేళ్లపాటు తనకు సహకరించిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలతో తన అనుబంధం ఎల్లప్పుడూ కొనసాగుతుందని పేర్కొన్నారు.

అనకాపల్లి

కొక్కిరపల్లి జంక్షన్ వద్ద విషాదం.. గుర్తుతెలియని వ్యక్తి దుర్మరణం!

పున్నమి ప్రతినిధి ఆనంద్ ( జిల్లా బ్యూరో) యలమంచిలి: యలమంచిలి మండలం కొక్కిరపల్లి జంక్షన్ సమీపంలో గురువారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తుని నుంచి అనకాపల్లి వైపు వెళ్లే రహదారిపై సుమారు 40–45 సంవత్సరాల వయస్సు కలిగిన గుర్తుతెలియని వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుండగా, గుర్తుతెలియని వాహనం అతడిని ఢీకొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి రహదారిపై పడిపోగా, అదే మార్గంలో ప్రయాణించిన ఇతర వాహనాలు అతని శరీరం మీదుగా వెళ్లడంతో మృతదేహం తీవ్రంగా ఛిద్రమై, గుర్తుపట్టలేని స్థితిలో లభించింది. మృతుడి పేరు, స్వస్థలం, ఇతర వివరాలు ప్రస్తుతం తెలియరాలేదు. మృతుడు బిచ్చమెత్తుకుంటూ జీవించే వ్యక్తిగా పోలీసులు భావిస్తున్నారు. కొక్కిరపల్లి వీఆర్వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ ఉపేంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి గుర్తింపు కోసం చర్యలు చేపట్టడంతో పాటు ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అనకాపల్లి

వినాయక ఉత్సవాలకు వెళ్లి.. డ్రైనేజీ కాలువలో విగతజీవిగా!

పున్నమి ప్రతినిధి ఆనంద్ ( జిల్లా బ్యూరో) ఎలమంచిలి: వినాయక ఉత్సవాలను చూసేందుకు ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి మరుసటి రోజు డ్రైనేజీ కాలువలో మృతిచెందిన ఘటన ఎలమంచిలిలో చోటుచేసుకుంది. ఎలమంచిలి ఉలకపేటకు చెందిన మల్ల నూకరాజు (51) ఈ ఘటనలో మృతిచెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 24న రాత్రి సుమారు 7 గంటలకు తులసినగర్ భూలోకమాంబ వినాయక ఉత్సవాలను చూసేందుకు నూకరాజు వెళ్లారు. కుటుంబ సభ్యులు నిమజ్జనం కార్యక్రమం ముగించుకుని రాత్రి ఒంటి గంటకు ఇంటికి చేరుకున్నప్పటికీ ఆయన తిరిగి రాలేదు. నరాల బలహీనత కారణంగా నెమ్మదిగా నడిచే నూకరాజు ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో గాలించారు. ఈ క్రమంలో 25న ఉదయం సుమారు 7 గంటలకు కర్రి ఆదిలక్ష్మి ద్వారా కరణం అప్పారావు అపార్ట్‌మెంట్ సమీపంలోని ట్రాన్స్‌ఫార్మర్ వద్ద డ్రైనేజీ కాలువలో నూకరాజు పడి ఉన్నట్లు సమాచారం అందింది. కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని చూడగా ఎడమ నుదుటి భాగంలో, కుడివైపు దవడపై గాయాలు కనిపించాయి. ఎలమంచిలి టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇన్‌క్వెస్ట్ అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ప్రమాదవశాత్తు కాలువలో పడిపోవడం లేదా విద్యుత్‌ షాక్‌ కారణంగా మృతి చెంది ఉండవచ్చన్న కుటుంబ సభ్యుల అనుమానాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అనకాపల్లి

సీఎం చంద్రబాబును కలిసిన ప్రగడ నాగేశ్వరరావు.. సమస్యలపై కీలక వినతి!

దుప్పితూరు సమస్యలు, ఏడుమూర్ల గట్టు, CMRF సాయం.. కొయ్య శ్రీనివాస్ కుటుంబానికి అండగా ఉండాలని విజ్ఞప్తి పున్నమి ప్రతినిధి ఆనంద్ (అనకాపల్లి జిల్లా బ్యూరో) యలమంచిలి: యలమంచిలి నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్, ఏపీ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APRDC) చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు గురువారం అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రాలు అందజేశారు. దుప్పితూరు గ్రామాన్ని చుట్టుముట్టిన పరిశ్రమలతో ఏర్పడుతున్న ఇబ్బందులు, పునరావాస కాలనీ, ప్రత్యేక ప్యాకేజీ, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనపై గ్రామస్తులతో కలిసి వినతిపత్రం సమర్పించారు. సారదా నది పరివాహక ప్రాంతంలో కీలకమైన ఏడుమూర్ల గట్టు పునర్నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కోరారు. గట్టు పునర్నిర్మాణంతో సుమారు 4 వేల ఎకరాల సాగుకు, వరదల సమయంలో 10 గ్రామాల్లోని 15 వేల మందికి రక్షణ కలుగుతుందని వివరించారు. అలాగే నిరుపేద నాయకులు, కార్యకర్తలకు సంబంధించిన రూ.10 లక్షలు, అంతకంటే ఎక్కువ విలువైన CMRF వైద్య సహాయ ఫైళ్లను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల మృతిచెందిన యువ సర్పంచ్ కొయ్య శ్రీనివాస్ కుటుంబానికి ప్రభుత్వం, పార్టీ తరఫున అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. సీఎం సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

అనకాపల్లి

స్కూల్‌ పక్కనే ప్రమాదం పొంచి ఉంది! వర్షాలతో వాలిన విద్యుత్‌ స్తంభం.. భయాందోళనలో స్థానికులు

పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో) యలమంచిలి : ఏటికొప్పాక గ్రామంలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రమాదకర పరిస్థితి నెలకొంది. సాధన ఇంగ్లీష్ మీడియం పాఠశాల సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభం ఒకవైపు వాలిపోవడంతో పాటు, పాఠశాల ప్రహరీ గోడకు ఆనుకుని ఉన్న మట్టి వాలు కూడా జారిపడే పరిస్థితికి చేరింది. దీంతో పాఠశాలకు వచ్చే విద్యార్థులు, ఉపాధ్యాయులు, అటుగా రాకపోకలు సాగించే స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. విద్యుత్ స్తంభం, వైర్లు ప్రమాదకరంగా ఉండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని తల్లిదండ్రులు, చుట్టుపక్కల ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను గత మూడు నెలలుగా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇప్పటివరకు తగిన చర్యలు తీసుకోలేదని స్థానికులు చెబుతున్నారు. విద్యార్థులకు లేదా ప్రజలకు ఏదైనా ప్రమాదం జరగకముందే విద్యుత్ శాఖ, పంచాయతీ, సంబంధిత అధికారులు సంయుక్తంగా పరిశీలించి వాలిన స్తంభాన్ని, విద్యుత్ వైర్లను, ప్రమాదకర వాలును వెంటనే సరిచేయాలని స్థానికులు కోరుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించే పరిస్థితి కాకుండా ముందస్తుగానే చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు. పాఠశాల పరిసరాల్లో విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు. Uploaded Video:

అనకాపల్లి

నక్కపల్లి డిగ్రీ కళాశాలకు సొంత భవనం!

వినతిపత్రంపై సానుకూలంగా స్పందించిన హోంమంత్రి అనిత.. త్వరలో నిర్మాణ పనులు పున్నమి ప్రతినిధి ఆనంద్ (అనకాపల్లి జిల్లా బ్యూరో) నక్కపల్లి: అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనం ఏర్పాటు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి శ్రీ వంగలపూడి అనితకు వినతిపత్రం అందజేశారు. కళాశాలకు సొంత భవనం అవసరాన్ని, విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కళాశాలకు శాశ్వత భవనం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. వినతిపత్రంపై హోంమంత్రి వంగలపూడి అనిత సానుకూలంగా స్పందించారు. కళాశాల భవన నిర్మాణానికి స్థలం కేటాయించామని, త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. దీంతో నక్కపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనం ఏర్పాటుకు మార్గం సుగమమైందని కళాశాల ప్రతినిధులు తెలిపారు. కళాశాలకు సొంత భవనం ఏర్పాటు అయితే విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. తమ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించి, స్థలం కేటాయించి త్వరలో నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపిన హోంమంత్రి వంగలపూడి అనితకు కళాశాల ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.

అనకాపల్లి

బాలు స్వరానికి ఘన నివాళి.. భావోద్వేగంగా 6వ వర్ధంతి కార్యక్రమం!

స్వరఝరి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు పున్నమి ప్రతినిధి ఆనంద్ (అనకాపల్లి జిల్లా బ్యూరో) యలమంచిలి: గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం 6వ వర్ధంతిని పురస్కరించుకుని స్వరఝరి వ్యవస్థాపక అధ్యక్షుడు మత్తుర్తి రామారావు ఆధ్వర్యంలో గురువారం నివాళి కార్యక్రమం నిర్వహించారు. తన నివాసంలో బాలు చిత్రపటానికి పూలమాలలు వేసి, పుష్పాలతో అలంకరించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సంగీత ప్రపంచానికి అందించిన అపూర్వ సేవలను స్మరించుకున్నారు. బాలు గాత్రం, గాన ప్రతిభ తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో భీముని సత్యనారాయణ, శెలంశెట్టి ప్రకాష్, యల్లపు పైడికొండ, అబ్దుల్లా మాష్టారు, ఆవుపాటి సుబ్బారావు, మత్తుర్తి సాయికుమార్ తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.