రేగుపాలెం జంక్షన్‌లో ఘోర ప్రమాదం.. లారీ చక్రాల కింద పడి బైక్ రైడర్ దుర్మరణం
పున్నమి ప్రతినిధి ఆనంద్ : యలమంచిలి, సెప్టెంబర్ 20: యలమంచిలి మండలం రేగుపాలెం జంక్షన్ వద్ద ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విశాఖపట్నం కంచరపాలెంకు చెందిన దంతేష్ (36) విజయవాడ నుంచి విశాఖపట్నం వైపు తన మోటార్‌సైకిల్ (AP 40 JC 3338)పై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సాయంత్రం సుమారు 4.30 గంటల సమయంలో తనకు ముందు వెళ్తున్న లారీ (OD 05 X 8544)ను ఎడమ వైపు నుంచి ఓవర్‌టేక్ చేసే క్రమంలో బైక్ అదుపుతప్పి స్కిడ్ అయింది. దీంతో బైక్ లారీ వెనుక చక్రాల కింద ఇరుక్కుపోవడంతో దంతేష్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు యలమంచిలి రూరల్ ఎస్‌ఐ ఉపేంద్ర తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టి, ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. మృతుడి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఉపేంద్ర పేర్కొన్నారు.











