అనకాపల్లి, సెప్టెంబర్ 8 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
అనకాపల్లి సబ్ డివిజన్ ఇన్చార్జ్, స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) డీఎస్పీగా విశేష సేవలందించి పదవీ విరమణ పొందిన శ్రీ జి.ఆర్.ఆర్. మోహన్‌కు అనకాపల్లి పట్టణంలోని బొడ్డేడ కన్వెన్షన్ హాల్లో ఘనంగా ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ముఖ్యఅతిథిగా హాజరై మోహన్ దంపతులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ.. 35 ఏళ్ల సుదీర్ఘ పోలీస్ సేవలో మోహన్ నిష్కళంక రికార్డుతో, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించారని కొనియాడారు. ఎస్బీ విభాగాన్ని సమర్థంగా సమన్వయం చేస్తూ లా అండ్ ఆర్డర్, రాజకీయ, సామాజిక పరిణామాలపై వేగవంతమైన సమాచారాన్ని ఉన్నతాధికారులకు అందించారని ప్రశంసించారు. సర్వీసు చివరి రోజుల్లోనూ ముఖ్యమంత్రి పర్యటన బందోబస్తు ఏర్పాట్లను సమర్థంగా పర్యవేక్షించారని పేర్కొన్నారు.
రిటైర్మెంట్ అనంతరం కుటుంబంతో సంతోషంగా గడుపుతూ ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై శ్రద్ధ వహించాలని ఎస్పీ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మోహన్ భావోద్వేగంతో మాట్లాడుతూ తన 35 ఏళ్ల సేవా ప్రయాణంలో సహకరించిన ఉన్నతాధికారులు, సహచరులు, సిబ్బంది, కుటుంబసభ్యులు, స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహనరావు, పలువురు డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది, కుటుంబసభ్యులు పాల్గొన్నారు.


