Sunday, 27 September 2026

Tag: రిపోర్టర్ ఆనంద్

అనకాపల్లి

పుట్టినరోజు వేడుకలకు పచ్చని పరిమళం.. అమ్మవారి సన్నిధిలో మొక్కలు నాటిన యువత!

పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో) యలమంచిలి: అనకాపల్లి జిల్లా యలమంచిలి మున్సిపాలిటీ 23వ వార్డు కొక్కిరాపల్లి గ్రామంలో గ్రామ జ్యోతి యువత ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న శ్రమదానం కార్యక్రమంలో భాగంగా గ్రామ దేవత శ్రీ మరిడిమాంబ అమ్మవారి సన్నిధిలో మొక్కలు నాటారు. దాసరి యువరాజ్–వెంకటలక్ష్మి దంపతుల పెద్ద కుమారుడు అక్షయ్ అశ్విన్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకుని మొక్కలు నాటాలని కోరడంతో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా యువత అక్షయ్ అశ్విన్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పుట్టినరోజు వేడుకలను వ్యక్తిగత ఆనందానికే పరిమితం చేయకుండా గ్రామాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడేలా నిర్వహించిన దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ శుభకార్యాలను పురస్కరించుకుని మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో దండు యస్వంత్, యువతేజ్, జయరాజ్, హర్ష, దాసరి వెంకటలక్ష్మి, అలవల నాగు, చిన్నారులు పాల్గొన్నారు.

అనకాపల్లి

అనకాపల్లి ఆర్టీసీ ప్రాంగణంలో నీటి నిల్వ సమస్య పరిష్కరించాలి..

పున్నమి ప్రతినిధి ఆనంద్ ( జిల్లా బ్యూరో) అనకాపల్లి ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ ప్రాంగణంలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా శాశ్వత డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసి, ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని కోరుతూ సీపీఎం నాయకులు శుక్రవారం జిల్లా రవాణా కార్యాలయంలో ఏఎంవై సూర్యారావుకు వినతిపత్రం అందజేశారు. సీపీఎం మండల కన్వీనర్ గంటా శ్రీరామ్, జిల్లా కమిటీ సభ్యులు వీవీ శ్రీనివాసరావు, మండల కమిటీ సభ్యులు కాళ్ల తేలయ్యబాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంటా శ్రీరామ్ మాట్లాడుతూ భారీ వర్షాలకు ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ ప్రాంగణం నీటితో నిండిపోవడంతో ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సుమారు రూ.80 లక్షలు ఖర్చు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.ఆర్టీసీ అధికారులు, జీవీఎంసీ అధికారులతో సమన్వయం చేసుకుని ప్రాంగణాన్ని ఎత్తు చేసి, వర్షపు నీరు సులభంగా బయటకు వెళ్లేలా శాశ్వత డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరారు.

అనకాపల్లి

29 వార్డ్ కాలనీ వాసులకు నిత్యావసరాలు, దోమతెరలు పంపిణీ చేసిన పల్లా సత్యనారాయణ

పున్నమి ప్రతినిధి ఆనంద్ ( జిల్లా బ్యూరో ) యలమంచిలి : ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న 29వ వార్డు పరిధిలోని రెల్లి కాలనీ వాసులకు బాసటగా నిలిచేందుకు జనసేన నాయకుడు పల్లా సత్యనారాయణ తన సొంత నిధులతో కూటమి నాయకులతో కలిసి ప్రత్యేక సహాయక చర్యలు చేపట్టారు. వర్షాల వల్ల కాలనీలోని రోడ్లు దెబ్బతిని, మురుగునీరు చేరడంతో స్థానికులు బయటకు రాలేక, నిత్యావసరాలు దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితులను గమనించి, బాధితులకు తక్షణ సహాయం అందించాలనే ఉద్దేశంతో స్వంత నిధులతో కూరగాయలు, నిత్యావసరాలను సమకూర్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాలనీలోని కుటుంబాలకు అవసరమైన తాజా కూరగాయలతో పాటు, వర్షాకాలంలో దోమల వల్ల విష జ్వరాలు, వ్యాధులు ప్రబలకుండా రక్షణగా ఉండేందుకు దోమతెరలను కూడా పంపిణీ చేశారు. ఈ సహాయక కార్యక్రమంలో 29వ వార్డు కూటమి నాయకులు నమ్మి రమేష్, ఒమ్మి దేవుడు,సారిపల్లి లవరాజు,యెర్రంశెట్టి చిలుకు,యెర్రంశెట్టి నర్సింగరావు,ఒమ్మి రాము, చల్లా చిరంజీవి,వెంకటరావు,లక్ష్మణ్ తదితరులు పాల్గొని స్వయంగా బాధితులకు ఈ సహాయాన్ని అందజేశారు. కష్టకాలంలో తమ ఇబ్బందులను గుర్తించి సకాలంలో స్పందించి కూరగాయలు, దోమతెరలు అందించడం పట్ల స్థానిక కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా కూటమి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా నాయకులు స్పష్టం చేశారు.

అనకాపల్లి

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీసుల పల్లెనిద్ర..

పున్నమి ప్రతినిధి ఆనంద్ ( జిల్లా బ్యూరో) అనకాపల్లి: రానున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముందస్తు చర్యల్లో భాగంగా అనకాపల్లి రూరల్ పోలీసులు సీతానగరం గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ ఆదేశాల మేరకు, అనకాపల్లి సబ్‌ డివిజన్ డీఎస్పీ ఈ. శ్రీనివాసులు సూచనలతో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, యువతతో పోలీసులు సమావేశమై ఎన్నికల సమయంలో సత్ప్రవర్తనతో మెలగాలని, గొడవలు, వర్గ విభేదాలకు దూరంగా ఉండాలని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఎన్నికల సమయంలో గొడవలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైన సందర్భాల్లో నిఘా కొనసాగించడంతో పాటు రౌడీషీట్లు తెరవడం, బైండ్‌ఓవర్‌ చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. అలాగే బాల్య వివాహాల దుష్పరిణామాలు, మహిళా భద్రతకు సంబంధించిన అభయ యాప్, శక్తి టీమ్, డయల్‌ 100, 112 సేవలపై అవగాహన కల్పించారు. సైబర్‌ నేరాలు, సోషల్‌ మీడియా మరియు ఆన్‌లైన్‌ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మోసం జరిగితే వెంటనే 1930కు సమాచారం అందించాలని సూచించారు. యువత మద్యం, గంజాయి, డ్రగ్స్‌ వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండి చదువుపై దృష్టి సారించాలని పోలీసులు సూచించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి రూరల్‌ సీఐ జి. అశోక్‌ కుమార్, ఎస్‌ఐ జి. రవి కుమార్, హెడ్‌ కానిస్టేబుల్‌ కేటీఎన్‌ శ్రీనివాస్, వి. సతీష్, కానిస్టేబుల్‌ నరేష్ తదితరులు పాల్గొన్నారు.

అనకాపల్లి

ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి..

పున్నమి ప్రతినిధి ఆనంద్ ( జిల్లా బ్యూరో ) అనకాపల్లి: ఆటో, అంబులెన్స్ డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వాహనాలు నడపాలని అనకాపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎం. వెంకట నారాయణ సూచించారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఎస్‌డీపీవో ఆదేశాల మేరకు జిల్లా ఆసుపత్రి వద్ద ఆటో, అంబులెన్స్ డ్రైవర్లకు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నెహ్రూ చౌక్ జంక్షన్‌లో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు ఆటోలను బాలకృష్ణ బస్టాప్, ఎన్‌టీఆర్ జంక్షన్, కాంప్లెక్స్ జంక్షన్, కసింకోట బస్‌స్టాప్ ప్రాంతాల్లో నడపాలని సూచించారు. విజయ మెడికల్ సెంటర్ వద్ద ఆటోలు పార్కింగ్ చేయరాదని, రహదారులపై ఎక్కడపడితే అక్కడ వాహనాలను నిలిపి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించవద్దన్నారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం చేయరాదని హెచ్చరించారు. అంబులెన్స్‌లను ఎన్‌టీఆర్ ఆసుపత్రి ఎదుట పార్కింగ్ చేయకుండా డీసీఎంఎస్ పార్కింగ్ స్థలంలో నిలిపివేయాలని సూచించారు. ఆసుపత్రి బయట అంబులెన్స్ సదుపాయానికి సంబంధించిన హెల్ప్‌డెస్క్ బోర్డును ఏర్పాటు చేశారు. అత్యవసర వైద్య సేవలకు ప్రాధాన్యం ఇస్తూ, ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి సహాయకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అంబులెన్స్ డ్రైవర్లు సహకరించాలని ఇన్‌స్పెక్టర్ కోరారు.

అనకాపల్లి

పులపర్తి కాలువ ఉగ్రరూపం.. ఏటికొప్పాకలో నీటి ముప్పు ముంగిట! రాకపోకలు బంద్‌ అయ్యే పరిస్థితి

మూడు రోజుల వర్షాలతో రోడ్డుపైకి చేరుతున్న నీరు.. చిన్నారులతో అంగన్‌వాడీ కేంద్రాలకు వెళ్లేందుకు అవస్థలు పున్నమి ప్రతినిధి ఆనంద్ ( జిల్లా బ్యూరో) యలమంచిలి: మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో యలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామంలో పులపర్తి కాలువ పొంగి ప్రవహిస్తోంది. కాలువ రహదారి కంటే దిగువన ఉండటంతో కాలువ నుంచి వచ్చే నీరు రోడ్డుపైకి చేరి స్థానికుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. ముఖ్యంగా కాలనీ వాసులు, ఈ మార్గంలో నడిచి వెళ్లే ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇదే ప్రాంతంలో రెండు అంగన్‌వాడీ కేంద్రాలు ఉండటంతో చిన్నారులను కేంద్రాలకు తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు మరింతగా కురిస్తే పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. రోడ్డుపై నీరు నిలిచిపోకుండా తక్షణమే కాలువ నీటి ప్రవాహాన్ని నియంత్రించే చర్యలు చేపట్టి, ప్రజలకు రాకపోకల ఇబ్బందులు లేకుండా చూడాలని గ్రామస్థులు అధికారులు, ప్రజాప్రతినిధులను కోరుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు.

అనకాపల్లి

ఎస్‌సీ యువతకు నైపుణ్య బాట.. ఉపాధి అవకాశాలపై అవగాహన!

పున్నమి ప్రతినిధి ఆనంద్ ( జిల్లా బ్యూరో) విశాఖపట్నం: ఉమ్మడి విశాఖపట్నం జిల్లా (విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలు) ఎస్‌సీ కార్పొరేషన్ కార్యాలయంలో శనివారం ఎస్‌సీ యువతకు వివిధ ఉపాధి, నైపుణ్యాభివృద్ధి అవకాశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు, నర్సింగ్ కోర్సులు, అమరాజా బ్యాటరీ కంపెనీలో ఉద్యోగ అవకాశాలతో పాటు డ్రోన్ శిక్షణ, ఉపాధి అవకాశాలపై యువతకు వివరించారు. ఈ కార్యక్రమానికి ఎస్‌సీ యువత ఉత్సాహంగా హాజరై వివిధ అవకాశాలపై అవగాహన పొందారు. యువత తమ విద్యార్హతలు, ఆసక్తులకు అనుగుణంగా శిక్షణా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని నిర్వాహకులు సూచించారు. సదస్సుకు హాజరైన ఎస్‌సీ యువతతో పాటు ఎస్‌సీ కార్పొరేషన్ డైరెక్టర్లు, డీవీఎంసీ సభ్యులు, ఇతర ప్రతినిధులకు ఎస్‌సీ కార్పొరేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

అనకాపల్లి

కొలువుల వేటకు పుస్తకాల అస్త్రం..! యలమంచిలి గ్రంథాలయంలో రూ.6 లక్షల విలువైన పోటీ పుస్తకాలు

పున్నమి ప్రతినిధి ఆనంద్ ( జిల్లా బ్యూరో) యలమంచిలి: పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు, నిరుద్యోగ యువతకు అండగా యలమంచిలి గ్రంథాలయంలో భారీగా స్టడీ మెటీరియల్ అందుబాటులోకి వచ్చింది. పుస్తక పఠనంతో సంపూర్ణ వికాసం సాధ్యమని ఉమ్మడి విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వన్నెంరెడ్డి సతీష్ కుమార్ అన్నారు. అనకాపల్లి జిల్లా పర్యటనలో భాగంగా శనివారం యలమంచిలి ప్రథమ శ్రేణి శాఖా గ్రంథాలయాన్ని ఆయన సందర్శించారు. పాఠకుల కోరిక మేరకు రూ.6 లక్షలతో కొనుగోలు చేసిన వివిధ పోటీ పరీక్షల పుస్తకాలను పాఠకుల సమక్షంలో విడుదల చేశారు. ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన నేపథ్యంలో నిరుద్యోగులకు అవసరమైన పుస్తకాలను ‘ఆన్ డిమాండ్’ విధానంలో అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. గ్రంథాలయ యాప్‌ను మరింత మంది వినియోగించేలా చూడాలని, పాఠకుల సౌకర్యార్థం వైఫై ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థులు, నిరుద్యోగులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బుర్రి కుమార్ రాజు, విశ్రాంత వైస్ ప్రిన్సిపల్ ఆడారి పూరి జగన్నాథ్, సోమయాజుల సన్యాసిరావు, పుల్లా వెంకటరావు, లైబ్రేరియన్ వి. ఆనంద్, విశ్రాంత ఉపాధ్యాయులు వై. అప్పారావు, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఉద్యోగుల సంఘం ప్రతినిధి ఎన్.వి. నరసింహం తదితరులు పాల్గొన్నారు.

అనకాపల్లి

శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు!

పల్లె నిద్రలో పోలీసుల హెచ్చరిక.. ఎన్నికలు ప్రశాంతంగా సాగేందుకు సహకరించాలి పున్నమి ప్రతినిధి ఆనంద్ (అనకాపల్లి జిల్లా బ్యూరో) యలమంచిలి: యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెదపల్లి మున్సిపాలిటీలో శుక్రవారం యలమంచిలి రూరల్ సీఐ ధనుంజయ రావు తో కలిసి పోలీస్ అధికారులు పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని పోలీసులకు సహకారం అందించారు. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని అధికారులు సూచించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించడం, అనవసర వివాదాలకు పాల్పడటం, చట్టవిరుద్ధ కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, ట్రాఫిక్ నిబంధనలు, రహదారి భద్రత, మహిళలు, చిన్నారుల రక్షణపై అవగాహన కల్పించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులకు, అధికారులకు పూర్తిగా సహకరించాలని గ్రామస్తులు, రాజకీయ నాయకులను కోరారు.

అనకాపల్లి

అనకాపల్లి జిల్లాకు సొంత జిల్లా పరిషత్ కార్యాలయం!

ప్రారంభోత్సవానికి హాజరైన ఎమ్మెల్యేలు, కలెక్టర్.. నూర్‌భాషా కార్పొరేషన్ డైరెక్టర్ ఇబ్రహీం భాషా పున్నమి ప్రతినిధి ఆనంద్ ( జిల్లా బ్యూరో) అనకాపల్లి: విశాఖపట్నం జిల్లా నుంచి విడిపోయి అనకాపల్లి జిల్లాగా ఏర్పడిన అనంతరం జిల్లా పరిషత్ కార్యాలయాన్ని అనకాపల్లిలో ప్రారంభించారు. శుక్రవారం జరిగిన కార్యక్రమానికి అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ఆహ్వానం మేరకు రాష్ట్ర నూర్‌భాషా కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ ఇబ్రహీం భాషా హాజరయ్యారు. కార్యక్రమానికి అనకాపల్లి జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అలాగే బీజేపీ నాయకుడు ఈర్ల శ్రీరామ్‌మూర్తి, జిల్లా పరిషత్ సీఈఓ, డిప్యూటీ సీఈఓ, పీడీతో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ కార్యాలయం ద్వారా జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, స్థానిక సంస్థల పరిపాలన మరింత సమన్వయంతో ముందుకు సాగాలని ప్రజాప్రతినిధులు, అధికారులు ఆకాంక్షించారు. నూతన జిల్లా పరిషత్ కార్యాలయం ప్రారంభంతో పరిపాలనా కార్యక్రమాలకు మరింత సౌలభ్యం కలగనుందని పేర్కొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.