మూడు రోజుల వర్షాలతో రోడ్డుపైకి చేరుతున్న నీరు.. చిన్నారులతో అంగన్‌వాడీ కేంద్రాలకు వెళ్లేందుకు అవస్థలు
పున్నమి ప్రతినిధి ఆనంద్ ( జిల్లా బ్యూరో)
యలమంచిలి: మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో యలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామంలో పులపర్తి కాలువ పొంగి ప్రవహిస్తోంది. కాలువ రహదారి కంటే దిగువన ఉండటంతో కాలువ నుంచి వచ్చే నీరు రోడ్డుపైకి చేరి స్థానికుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. ముఖ్యంగా కాలనీ వాసులు, ఈ మార్గంలో నడిచి వెళ్లే ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇదే ప్రాంతంలో రెండు అంగన్‌వాడీ కేంద్రాలు ఉండటంతో చిన్నారులను కేంద్రాలకు తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు మరింతగా కురిస్తే పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. రోడ్డుపై నీరు నిలిచిపోకుండా తక్షణమే కాలువ నీటి ప్రవాహాన్ని నియంత్రించే చర్యలు చేపట్టి, ప్రజలకు రాకపోకల ఇబ్బందులు లేకుండా చూడాలని గ్రామస్థులు అధికారులు, ప్రజాప్రతినిధులను కోరుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు.


