ఏటికొప్పాక వారపు సంత దుస్థితి.. వర్షం పడితే రైతులు, కొనుగోలుదారులకు నరకయాతనే!
యలమంచిలి , ఆగస్టు 11 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): ఏటికొప్పాక గ్రామంలో ప్రతి మంగళవారం నిర్వహించే వారపు సంత చుట్టుపక్కల గ్రామాల రైతులు, ప్రజలకు ఎంతో ముఖ్యమైనది. రైతులు పండించిన తాజా కూరగాయలు, నిత్యావసర సరుకులు ఇక్కడ విక్రయిస్తుండగా, కొనుగోలుదారులు కూడా పెద్ద సంఖ్యలో వస్తుంటారు. అయితే సంత ప్రాంగణంలో శాశ్వత షెడ్లు, షట్టర్లు, సరైన రహదారి, డ్రైనేజీ వంటి మౌలిక వసతులు లేకపోవడంతో వర్షం పడితే మొత్తం ప్రాంతం బురదమయంగా మారుతోంది. దీంతో రైతులు సరుకులు అమ్ముకునేందుకు, ప్రజలు కొనుగోళ్లకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండ, వర్షాల నుంచి రక్షణ లేక అవస్థలు తప్పడం లేదు. ఏటికొప్పాక గ్రామపంచాయతీ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి వారపు సంత ప్రాంగణాన్ని అభివృద్ధి చేసి, శాశ్వత షెడ్లు, షట్టర్లు, రహదారి, డ్రైనేజీ సౌకర్యాలు కల్పించాలని రైతులు, వ్యాపారులు, గ్రామ ప్రజలు కోరుతున్నారు.



