Saturday, 26 September 2026

Tag: ఎలమంచిలి

అనకాపల్లి

వర్షం పడితే రహదారి కష్టాలు.. పాల మీద, రెల్లి కాలనీ ప్రజల గోడు!

ఎలమంచిలి (అనకాపల్లి జిల్లా బ్యూరో): కొక్కిరపల్లి గ్రామం నుంచి పాల మీద, రెల్లి కాలనీలకు వెళ్లే ప్రధాన రహదారి వర్షం పడితే బురదమయంగా మారి చెరువును తలపిస్తోంది. ఏళ్లుగా సమస్య ఉన్నా ప్రభుత్వాలు మారుతున్నా రహదారి మాత్రం మారడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు కాలనీల్లో సుమారు 150 కుటుంబాలు నివసిస్తున్నాయి. ప్రతి ఇంటి నుంచి ఇంటి పన్నులు వసూలు చేస్తున్నప్పటికీ కనీస రహదారి సౌకర్యం కల్పించకపోవడంపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వర్షాకాలంలో బురదలో నడవాలంటేనే గ్రామస్థులు భయపడుతున్న పరిస్థితి నెలకొంది. పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, పనులకు వెళ్లే కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర సమయంలో అంబులెన్స్‌ లేదా ఇతర వాహనం గ్రామానికి చేరుకోవడం కూడా కష్టంగా మారుతోందని స్థానికులు చెబుతున్నారు. వర్షం పడిన ప్రతిసారీ రహదారి మరింత దారుణంగా మారడంతో ఎక్కడికి వెళ్లాలన్నా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రహదారికి శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్థులు కోరుతున్నారు.

అనకాపల్లి

ఎలమంచిలి అభివృద్ధికి భారీ నిధులు.. రూ.24 కోట్ల పనులకు శంకుస్థాపన.!

పున్నమి ప్రతినిధి ఆనంద్ (అనకాపల్లి బ్యూరో) ఎలమంచిలి నియోజకవర్గ అభివృద్ధికి భారీ నిధులు మంజూరయ్యాయి. రాష్ట్రంలోని 123 అర్బన్ స్థానిక సంస్థల సమగ్ర అభివృద్ధిలో భాగంగా ఎలమంచిలి పట్టణంలో రూ.24 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. వీఎంఆర్‌డీఏ నిధుల భాగస్వామ్యంతో చేపట్టనున్న ఈ పనులతో పట్టణంలో మౌలిక వసతులు మరింత మెరుగుపడనున్నాయి. కార్యక్రమానికి ఏపీఆర్‌డీసీ చైర్మన్, ఎలమంచిలి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ ప్రగడ నాగేశ్వరరావు, ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ హాజరయ్యారు. డ్రైనేజీ, అంతర్గత రహదారులు, తాగునీటి వసతులు, పట్టణ సుందరీకరణకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు నాయకులు తెలిపారు. పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో టౌన్ టీడీపీ అధ్యక్షుడు నానాజీ, జనసేన అధ్యక్షుడు శ్రీనివాసరావు, బీజేపీ టౌన్ అధ్యక్షుడు శివ, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.

అనకాపల్లి

పింఛన్ పంపిణీలో కీలక మార్పులు.. బ్యాంకులో కొంత, చేతికి కొంత!

పున్నమి ప్రతినిధి ఆనంద్ (అనకాపల్లి బ్యూరో) ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ల పంపిణీ విధానంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ తాజా ఉత్తర్వుల ప్రకారం కేంద్ర ప్రభుత్వ వాటా (NSAP)ను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా (ఎన్‌టీఆర్ భరోసా)ను గతంలో మాదిరిగానే ఇంటివద్ద నగదు రూపంలో అందించనున్నారు. 60–79 ఏళ్ల వృద్ధులకు రూ.200 బ్యాంకులో, రూ.3,800 చేతికి కలిపి రూ.4,000 అందుతుంది. 80 ఏళ్లు పైబడిన వృద్ధులకు రూ.500 బ్యాంకులో, రూ.3,500 చేతికి వస్తుంది. 40–79 ఏళ్ల వితంతువులకు రూ.300 బ్యాంకులో, రూ.3,700 చేతికి అందుతుంది. 80 ఏళ్లు పైబడిన వితంతువులకు రూ.500 బ్యాంకులో, రూ.3,500 చేతికి అందుతుంది. వికలాంగులకు మొత్తం రూ.6,000లో రూ.300 లేదా రూ.500 బ్యాంకులో, మిగిలిన మొత్తం నగదుగా అందుతుంది. పింఛన్ మొత్తం తగ్గదని, పంపిణీ విధానంలో మాత్రమే మార్పు జరిగిందని అధికారులు స్పష్టం చేశారు. బ్యాంకు ఖాతాను పరిశీలించుకోవాలని, నగదు జమ కాకపోతే సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు.

అనకాపల్లి

భారీ వర్షాల నేపథ్యంలో.. పాఠశాలలకు సెలవు..!

విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి: అధికారులు పున్నమి ప్రతినిధి ఆనంద్ (అనకాపల్లి బ్యూరో) అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో సెప్టెంబర్ 23, 2026 (బుధవారం) అన్ని పాఠశాలలకు పరిహార సెలవు (Compensatory Holiday) ప్రకటించారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్, జిల్లా మేజిస్ట్రేట్ హోదాలో మంగళవారం ప్రకటన విడుదల చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖాధికారి (DEO) ఈ సెలవును అమలు చేయాలని సంబంధిత పాఠశాలల యాజమాన్యాలకు సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు స్పష్టం చేశారు. అవసరం లేకుండా విద్యార్థులు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వర్షాలు, నీటి ప్రవాహాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పాఠశాలలకు బుధవారం పరిహార సెలవు ప్రకటించిన విషయాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించాలని అధికారులు కోరారు.

అనకాపల్లి

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

పురుషోత్తపురంలో రూ.24 లక్షలతో రైతు భరోసా సేవా కేంద్రం ప్రారంభం పున్నమి ప్రతినిధి (అనకాపల్లి బ్యూరో) రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్, ఏపీ ఆర్‌డీసీ చైర్మన్, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు అన్నారు. ఎలమంచిలి మండలం పురుషోత్తపురం గ్రామంలో ఉపాధి హామీ పథకం నిధులు రూ.24 లక్షలతో నిర్మించిన రైతు భరోసా సేవా కేంద్రం భవనాన్ని మంగళవారం వారు ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి భవనాన్ని పరిశీలించిన అనంతరం రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రగడ నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, వ్యవసాయ సలహాలు ఒకే చోట అందించేందుకు రైతు భరోసా సేవా కేంద్రాలు ఉపయోగపడతాయన్నారు. ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ మాట్లాడుతూ గ్రామస్థాయిలోనే వ్యవసాయ సేవలు అందుబాటులోకి రావడంతో రైతులకు సమయం, ఖర్చు ఆదా అవుతుందని తెలిపారు. నియోజకవర్గంలో చేపట్టిన మిగిలిన అభివృద్ధి పనులను కూడా త్వరలో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎలమంచిలి రూరల్ మండల టీడీపీ అధ్యక్షుడు ఇత్తంశెట్టి సన్యాసి నాయుడు, యలమంచిలి టౌన్ జనసేన అధ్యక్షుడు శ్రీనివాసరావు, ఎంపీపీ, టీడీపీ-జనసేన-బీజేపీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

అనకాపల్లి

ప్రజాసేవే లక్ష్యంగా పాస్టర్ కరణం రమణరావు సేవలు..!

పున్నమి – కే. ఆనంద్ (అనకాపల్లి బ్యూరో ) : గ్రేస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అధినేత, పాస్టర్ కరణం రమణరావు జన్మదినం సందర్భంగా గోకివాడ గ్రామానికి చెందిన బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ద్వారపురెడ్డి నాగేశ్వరరావు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో స్టేట్ బ్యాంక్ మేనేజర్ ఉద్యోగానికి రాజీనామా చేసి, కొత్తూరు–గోకివాడ మధ్యలో గతంలో నిర్లక్ష్యానికి గురైన ప్రాంతంలో చర్చి, గ్రేస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏర్పాటు చేసి విద్యా, ఆధ్యాత్మిక సేవలకు విశేష కృషి చేస్తున్నారని నాగేశ్వరరావు పేర్కొన్నారు. అక్కడ విద్యార్థులకు విద్యాబోధనతో పాటు ప్రజలకు సేవా కార్యక్రమాలు అందిస్తూ ఆ ప్రాంతానికి వెలుగును తీసుకొచ్చారని తెలిపారు. భవిష్యత్తులో మరింత విస్తృతంగా సేవలు అందించేందుకు హాస్పిటల్ నిర్మాణానికి కూడా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. సమాజ సేవకు అంకితమైన పాస్టర్ కరణం రమణరావు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు ఆదర్శంగా నిలవాలని ద్వారపురెడ్డి నాగేశ్వరరావు ఆకాంక్షించారు.

అనకాపల్లి

యలమంచిలి కాపు సంక్షేమ భరోసా కేంద్రం కన్వీనర్‌గా టి.వి.ఎస్. ప్రకాష్..!!

పున్నమి – కే. ఆనంద్ (అనకాపల్లి బ్యూరో ) యలమంచిలి కాపు జాతి సంక్షేమం, అభివృద్ధి, ఐక్యత, భద్రత కోసం పనిచేస్తున్న కాపు సంక్షేమ భరోసా కేంద్రాల యలమంచిలి పట్టణ కన్వీనర్‌గా టి.వి.ఎస్. ప్రకాష్ నియమితులయ్యారు. అనకాపల్లి జిల్లా వెంకటాపురంలోని భరోసా కేంద్రం వద్ద జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో వ్యవస్థాపకులు కర్రి వెంకటరమణ ఆయనను సాదరంగా ఆహ్వానించి బాధ్యతలు అప్పగించారు. కాపు జాతి సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని ప్రకాష్ తెలిపారు. భరోసా కేంద్రాల సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లి, అవసరమైన వారికి అండగా నిలవాలని కర్రి వెంకటరమణ సూచించారు. నూతన బాధ్యతలు స్వీకరించిన ప్రకాష్‌కు పలువురు అభినందనలు తెలిపారు.

అనకాపల్లి

పీఆర్‌సీ కమిటీ ఏర్పాటు చేసి వెంటనే ఐఆర్ ప్రకటించాలి

– ఏపిటీఎఫ్ రాష్ట్ర పూర్వ కార్యదర్శి బి. వెంకటపతి రాజు పున్నమి ప్రతినిధి ఆనంద్: యలమంచిలి యలమంచిలి, సెప్టెంబర్ 21: పీఆర్‌సీ కమిటీని వెంటనే నియమించి మధ్యంతర ఉపశమనంగా ఐఆర్‌ ప్రకటించాలని ఏపిటీఎఫ్ రాష్ట్ర పూర్వ కార్యదర్శి బి. వెంకటపతి రాజు ప్రభుత్వాన్ని కోరారు. యలమంచిలి మండలంలో ఏపిటీఎఫ్ సభ్యత్వ క్యాంపెయిన్‌లో భాగంగా సోమలింగపాలెం, జంపపాలెం, పెద్దపల్లి, హైస్కూల్ ప్లస్ బాలికల ఉన్నత పాఠశాల, రైల్వే స్టేషన్ రోడ్డు ప్రభుత్వ పాఠశాల, కొత్తపేట పాఠశాలలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో మాట్లాడి సంఘం సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీనియర్ ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి మినహాయింపు కల్పించాలని, ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుంచి విముక్తి కల్పించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా ఏపిటీఎఫ్ అధ్యక్షులు కర్రి ధర్మారావు, మండల అధ్యక్షులు ఏ. చంద్రశేఖర్, కార్యదర్శి ఎన్. భూషణం, కర్రి వీరభద్రరావు, మల్లిపాటి సత్యనారాయణ, బి. సత్యనారాయణ, వై. సత్యారావు, జి. సర్వేశ్వరరావు, బి. సింహాచలం తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

అనకాపల్లి

జంపపాలెం కల నెరవేరింది.. శారదా నదిపై స్నాన ఘాట్‌కు శ్రీకారం

రూ.4.50 లక్షలతో నిర్మాణ పనులు ప్రారంభం: ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పున్నమి ప్రతినిధి ఆనంద్ :యలమంచిలి యలమంచిలి, సెప్టెంబర్ 21: జంపపాలెం గ్రామ ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. శారదా నదిపై రూ.4.50 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న స్నాన ఘాట్ మెట్లకు ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. జంపపాలెంలో శారదా నది గట్ల అభివృద్ధితో పాటు వారం రోజుల్లో రహదారి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. నియోజకవర్గంలో డ్రైనేజీలు, కాలువలు, చెరువుల పూడికతీత, రహదారులు, తాగునీటి వసతుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కార్యక్రమంలో అధికారులు, గ్రామ ప్రజలు, యువకులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

అనకాపల్లి

మద్యం దుకాణాల రెన్యువల్‌కు మరో రెండు రోజులు.. 23 వరకు గడువు

పున్నమి ప్రతినిధి ఆనంద్ అమరావతి, సెప్టెంబర్ 21: ఏ4 మద్యం దుకాణాల యజమానుల విజ్ఞప్తి మేరకు 2026–27 సంవత్సరానికి దుకాణాల రెన్యువల్ గడువును ప్రభుత్వం మరో రెండు రోజులు పొడిగించింది. దీంతో రెన్యువల్ ప్రక్రియను పూర్తి చేసుకునేందుకు సెప్టెంబర్ 23 వరకు అవకాశం కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా 3,650 ఏ4 మద్యం దుకాణాలను నోటిఫై చేశారు. రెన్యువల్ ఆర్‌ఈటీ, దరఖాస్తు ఫీజు కింద రూ.933.44 కోట్ల డిమాండ్‌కు గాను సెప్టెంబర్ 21 రాత్రి 7.15 గంటల వరకు రూ.676 కోట్లు వసూలయ్యాయి. వార్షిక ఆర్‌ఈటీ కింద రూ.2,454.76 కోట్ల డిమాండ్ ఉండగా రూ.441 కోట్లు, పర్మిట్ రూమ్ ఆర్‌ఈటీ కింద రూ.249.15 కోట్లకు గాను రూ.62 కోట్లు వసూలయ్యాయి. మూడు విభాగాల కింద మొత్తం రూ.3,637.35 కోట్ల వార్షిక డిమాండ్ ఉండగా ఇప్పటివరకు రూ.1,179.63 కోట్లు వసూలైనట్లు అధికారులు వెల్లడించారు. మద్యం దుకాణాల యజమానుల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని రెన్యువల్ గడువును ఈ నెల 23 వరకు పొడిగించినట్లు ప్రభుత్వం తెలిపింది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.