కలిగిరి, సెప్టెంబర్ 26, పున్నమి నెల్లూరు జిల్లా ప్రతినిధి
ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం రామాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఈ నెల 29వ తేదీన నిర్వహించనున్న పల్లె పండుగ–3.0 కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయడమే లక్ష్యంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు సమన్వయంతో పనిచేయాలని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ సూచించారు.కలిగిరి ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం పల్లె పండుగ–3.0 ఏర్పాట్లపై అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తో పాటు పల్లె పండుగ–3.0 నియోజకవర్గ పరిశీలకులు, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర హాజరయ్యారు. వివిధ శాఖల అధికారులు, మండల స్థాయి కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా రూ.10 వేల కోట్ల భారీ వ్యయంతో పల్లె పండుగ–3.0 కార్యక్రమాన్ని చేపడుతోందన్నారు. ఉదయగిరి నియోజకవర్గానికి ఈ కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకమైనదని, రామాపురంలో జరిగే సభకు రాష్ట్ర స్థాయి నాయకులు, వేలాది మంది ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.సభా వేదిక, పార్కింగ్, హెలిప్యాడ్, తాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయం, మరుగుదొడ్లు, ప్రజల రాకపోకలు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమానికి వచ్చే ప్రజలకు, ముఖ్యంగా మహిళలు, వృద్ధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రతి శాఖకు అప్పగించిన బాధ్యతలను సకాలంలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు.అనంతరం పరిశీలకులు, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ.. పల్లె పండుగ కార్యక్రమం గ్రామీణాభివృద్ధికి నిదర్శనమని, అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పరస్పర సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందుగానే ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలన్నారు.ఎమ్మెల్సీ, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు బీద రవిచంద్ర మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పల్లె పండుగ–3.0ను విజయవంతంగా నిర్వహించేందుకు కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు కలసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నాయకులు కోరారు. సమావేశం అనంతరం ఏర్పాట్ల పురోగతిపై అధికారుల నుంచి వివరాలు సేకరించారు.



