Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

ప్రజల తీర్పును గౌరవించాలి.. అభివృద్ధికి సహకరించాలి!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ప్రజల తీర్పును గౌరవించాలి.. అభివృద్ధికి సహకరించాలి!

వార్త ముఖ్యాంశాలు

  • ఆత్మకూరు, నవంబర్ 9 (పున్నమి ప్రతినిధి): ఆత్మకూరు నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ప్రజలు అందించిన ఘన విజయం తమపై మరింత బాధ్యతను పెంచిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు.
  • ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఆత్మకూరు పట్టణంతో పాటు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు.
  • సోమవారం నెల్లూరులోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.2024 ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి ప్రజల మద్దతు గణనీయంగా పెరిగిందన్నారు.
  • ఆత్మకూరులో కూటమి విజయంతో పెరిగిన బాధ్యత.. అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
  • ‘మర్డర్ ఆఫ్ డెమోక్రసీ’ వ్యాఖ్యలపై మంత్రి ఆనం తీవ్ర ఆగ్రహం
  • మేకపాటి విక్రమ్‌రెడ్డి విమర్శలకు మంత్రి ఘాటు సమాధానం

ఆత్మకూరు, నవంబర్ 9 (పున్నమి ప్రతినిధి): ఆత్మకూరు నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ప్రజలు అందించిన ఘన విజయం తమపై మరింత బాధ్యతను పెంచిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఆత్మకూరు పట్టణంతో పాటు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. సోమవారం నెల్లూరులోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.2024 ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి ప్రజల మద్దతు గణనీయంగా పెరిగిందన్నారు. ఆరు మండలాలు, ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో కలిపి సుమారు 18,174 ఓట్ల ఆధిక్యాన్ని ప్రజలు అందించారని తెలిపారు. ఆరు మండలాల్లోని 67 ఎంపీటీసీ స్థానాలకు గాను టీడీపీ 58, వైసీపీ 9 స్థానాలను గెలుచుకున్నాయని వివరించారు. ఆత్మకూరు మున్సిపాలిటీలో కూటమి 17, వైసీపీ 10, సీపీఎం ఒక వార్డును గెలుచుకున్నాయని పేర్కొన్నారు. సూపర్ సిక్స్ పథకాల అమలు, సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనే కూటమి విజయానికి పునాదులని అన్నారు.

ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని, ఓటమిని హుందాగా అంగీకరించి ప్రజల తీర్పును గౌరవించాలని వైసీపీ నాయకులకు హితవు పలికారు. తాను పదిసార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఏడుసార్లు గెలిచి, మూడుసార్లు ఓటమి పాలయ్యానని, ఎప్పుడూ ప్రజల నిర్ణయాన్ని గౌరవించానని గుర్తుచేశారు. ఎన్నికల ప్రక్రియపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదన్నారు.మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి చేసిన ‘మర్డర్ ఆఫ్ డెమోక్రసీ’ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ప్రజలు ఓటు ద్వారా ఇచ్చిన తీర్పును ప్రజాస్వామ్య హత్యగా అభివర్ణించడం రాజ్యాంగ వ్యవస్థను అవమానించడమేనన్నారు. ఈ వ్యాఖ్యలపై న్యాయ నిపుణులతో సంప్రదించి చట్టపరమైన చర్యలపై పరిశీలిస్తామని వెల్లడించారు. మేకపాటి కుటుంబ రాజకీయ చరిత్ర, గతంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలను ప్రస్తావిస్తూ ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడే ముందు ఆత్మపరిశీలన చేసుకోవాలని విమర్శించారు. కేరళ రహదారి కాంట్రాక్టులు, ఆస్తుల జప్తు, పొదలకూరు పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఫోర్జరీ ఆరోపణలను కూడా ప్రస్తావిస్తూ సంబంధిత నాయకులు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

రాజకీయ విమర్శలకు అభివృద్ధి, ప్రజాసేవే సమాధానమని మంత్రి పేర్కొన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్, ప్రజాప్రతినిధుల సహకారంతో ఆత్మకూరులో మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేస్తామని తెలిపారు. ప్రస్తుతం సాధించిన 18 వేల ఓట్ల ఆధిక్యాన్ని భవిష్యత్తులో 40 నుంచి 50 వేల స్థాయికి తీసుకెళ్లేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి ఐక్యతతో ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సీనియర్ టిడిపి నాయకులు తాళ్లూరి గిరి నాయుడు ,మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా,యువనాయకులు . చల్లా రవికుమార్ రెడ్డి, ఆనం తనయ లీలాకైవల్యరెడ్డి తదితరులున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *