పున్నమి ప్రతినిధి ఆనంద్ ( జిల్లా బ్యూరో )
యలమంచిలి : ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న 29వ వార్డు పరిధిలోని రెల్లి కాలనీ వాసులకు బాసటగా నిలిచేందుకు జనసేన నాయకుడు పల్లా సత్యనారాయణ తన సొంత నిధులతో కూటమి నాయకులతో కలిసి ప్రత్యేక సహాయక చర్యలు చేపట్టారు. వర్షాల వల్ల కాలనీలోని రోడ్లు దెబ్బతిని, మురుగునీరు చేరడంతో స్థానికులు బయటకు రాలేక, నిత్యావసరాలు దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితులను గమనించి, బాధితులకు తక్షణ సహాయం అందించాలనే ఉద్దేశంతో స్వంత నిధులతో కూరగాయలు, నిత్యావసరాలను సమకూర్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాలనీలోని కుటుంబాలకు అవసరమైన తాజా కూరగాయలతో పాటు, వర్షాకాలంలో దోమల వల్ల విష జ్వరాలు, వ్యాధులు ప్రబలకుండా రక్షణగా ఉండేందుకు దోమతెరలను కూడా పంపిణీ చేశారు. ఈ సహాయక కార్యక్రమంలో 29వ వార్డు కూటమి నాయకులు నమ్మి రమేష్, ఒమ్మి దేవుడు,సారిపల్లి లవరాజు,యెర్రంశెట్టి చిలుకు,యెర్రంశెట్టి నర్సింగరావు,ఒమ్మి రాము, చల్లా చిరంజీవి,వెంకటరావు,లక్ష్మణ్ తదితరులు పాల్గొని స్వయంగా బాధితులకు ఈ సహాయాన్ని అందజేశారు. కష్టకాలంలో తమ ఇబ్బందులను గుర్తించి సకాలంలో స్పందించి కూరగాయలు, దోమతెరలు అందించడం పట్ల స్థానిక కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా కూటమి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా నాయకులు స్పష్టం చేశారు.


