మహిళలపై ఆన్‌లైన్ వేధింపులపై అవగాహన.. అప్రమత్తతే రక్షణ!
ఎలమంచిలి, ఆగస్టు 19 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
ఎలమంచిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళలపై జరుగుతున్న ఆన్‌లైన్ వేధింపులపై బుధవారం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఉమెన్ ఎంపవర్‌మెంట్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సోషల్ మీడియా ద్వారా మహిళలు, యువతులు ఎదుర్కొంటున్న సైబర్ వేధింపులు, అశ్లీల సందేశాలు, బెదిరింపులపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు.
ఉమెన్ ఎంపవర్‌మెంట్ సెల్ కన్వీనర్ డా. కె. సుజాత, ఇంగ్లీష్ అధ్యాపకురాలు డా. పద్మప్రియ మాట్లాడుతూ సాంకేతికత పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయని తెలిపారు. వ్యక్తిగత వివరాలను సోషల్ మీడియాలో పంచుకునే విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వేధింపులు ఎదురైతే భయపడకుండా సైబర్ క్రైమ్ పోలీసులకు లేదా దిశ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. కంప్యూటర్ అధ్యాపకులు దేవి, సంధ్య డిజిటల్ భద్రత, ప్రైవసీ సెట్టింగులపై వివరించారు. కార్యక్రమంలో రాజేశ్వరి, మహిళా అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.


