యలమంచిలి | పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్
యలమంచిలిలో సద్భావన దివస్ను పురస్కరించుకుని అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె. రమేష్ ఆధ్వర్యంలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వమే భారతీయ సంస్కృతికి మూలమని, కుల, మత, ప్రాంతీయ, భాషా భేదాలకు అతీతంగా మత సామరస్యం, జాతీయ సమగ్రతను పెంపొందించుకోవాలని సూచించారు. హింసకు తావులేకుండా పరస్పరం గౌరవించుకుంటూ శాంతియుతంగా జీవించాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో తలెత్తే పగలు, ప్రతీకారాలు, చిన్నచిన్న విభేదాలను న్యాయస్థానాల వెలుపల సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుని విభేదరహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


