సికింద్రాబాద్ / ఖమ్మం
సికింద్రాబాద్ రైల్వే నిలయంలో గురువారం జరిగిన దక్షిణ మధ్య రైల్వే (S.C.R) జోనల్ సమావేశంలో బీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీరామచంద్రమూర్తి కొలువైన భద్రాచలం వరకు రైలు మార్గాన్ని నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. భద్రాచలం నుంచి రైలు మార్గాన్ని ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అనుసంధానించే కూడలిగా అభివృద్ధి చేయాలని కోరారు. ఈ ప్రాంతాల మధ్య రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు భద్రాచలం, ఉమ్మడి ఖమ్మం ప్రాంతాల అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. అలాగే రైల్వేకు సంబంధించిన మరికొన్ని డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌కు వద్దిరాజు రవిచంద్ర అందజేశారు.



