అనకాపల్లి జిల్లా: ఆగస్టు 30 ( పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ )
యలమంచిలి : మాదకద్రవ్యాల మహమ్మారిని రూపుమాపేందుకు పట్టణ ఎస్ఐ సావిత్రి కఠిన చర్యలకు శ్రీకారం చుట్టారు. గంజాయి, డ్రగ్స్ సేవించే వారిని తక్షణమే గుర్తించేందుకు అత్యాధునిక ‘డ్రగ్ టెస్టింగ్ కిట్ల’ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు టౌన్ ఎస్సై సావిత్రి తెలిపారు. ఇటీవల పట్టణ పరిధిలో గంజాయి సేవిస్తున్నారనే అనుమానంతో కొంతమందికి పరీక్షలు నిర్వహించగా, వారిలో పలువురు మాదకద్రవ్యాలు వాడినట్లు రిపోర్టుల్లో నిర్ధారణ అయిందని ఆమె పేర్కొన్నారు. వారిని వ్యసనం నుంచి బయటపడేసి, పునరావాసం కల్పించేందుకు అనకాపల్లిలోని డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలించి ఉచిత వైద్యం, మానసిక కౌన్సెలింగ్ అందిస్తున్నట్లు వెల్లడించారు. పట్టణంలో ఎవరైనా గంజాయి సేవించినా లేదా విక్రయిస్తున్నట్లు అనుమానం వచ్చినా తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించిన వారి వివరాలను రహస్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. యలమంచిలిని ‘డ్రగ్ ఫ్రీ టౌన్’గా మార్చేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ రామకృష్ణ, పోలీస్ సిబ్బంది, ఐసిడిఎస్ డిఆర్‌పి రమ్య, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


