అనకాపల్లి
బాల్య వివాహాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, బాల్యవివాహాలు జరక్కుండా చూడాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు ఉండవల్లి గాంధీ బాబు మరియు మందాల గంగా సూర్యనారాయణ సూచించారు.బాలల హక్కుల పరిరక్షణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. అనకాపల్లి జిల్లా రెవిన్యూ డివిజనల్ కార్యాలయం సమావేశ మందిరంలో బాలల హక్కుల పరిరక్షణపై మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ, బాలల సంరక్షణ విభాగం, కార్మిక శాఖ, విద్యా శాఖ, పోలీసు శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, సాంఘిక సంక్షేమ శాఖల అధికారులు, ట్రాన్స్ పోర్ట్ శాఖ, పంచాయతీ రాజ్ శాఖ మరియు డి ఆర్ డి ఏ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ ఇ.శ్రీనివాసరావు, బాలల సంక్షేమ సమితి, ఛైర్పర్సన్ ఎమ్.ఆర్.ఎల్.రాధ,జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారిని ఎన్.సూర్య లక్ష్మీ, జిల్లా బాలల సంరక్షణ అధికారి ఎమ్.రమేష్ , తదితరులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణలో ప్రతి శాఖ అధికారి పూర్తి బాధ్యతతో పనిచేయాలని సూచించారు. బాల కార్మికుల నిర్మూలన, బాల్య వివాహాల నిరోధం, పోక్సో కేసుల దర్యాప్తు, బాధితుల పునరావాసం, బాలల అక్రమ రవాణా నివారణ, కౌమార దశలో గర్భాలు, గంజాయి కేసులు, పాఠశాల మానేసిన పిల్లలను తిరిగి విద్యలో చేర్చడం వంటి అంశాలపై శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. పోక్సో కేసుల్లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లు, బాధిత పిల్లలకు అందించిన పరిహారం, పునరావాస చర్యలు, జనన ధ్రువీకరణ పత్రాల జారీ, వివిధ శాఖల సమన్వయంపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. కార్పొరేట్ మరియు ప్రైవేటు విద్యాసంస్థల్లో బాలల హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు పరిశుభ్రమైన వసతి, సురక్షితమైన తాగునీరు, పారిశుధ్యం, నాణ్యమైన ఆహారం, ఆరోగ్య సేవలు అందేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కాలానుగుణ వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. బాలల హక్కుల పరిరక్షణలో ఏ శాఖ నిర్లక్ష్యం వహించినా ఉపేక్షించబోమని, జిల్లా స్థాయిలో గుర్తించిన సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదికతో పాటు తగిన సిఫారసులు సమర్పిస్తామని తెలిపారు.కమిషన్ సభ్యుడు ఉండవల్లి గాంధీ బాబు మరియు మందాల గంగ సూర్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో జిల్లా స్థాయి అన్ని శాఖలతో సమీక్ష నిర్వహించి బాలల రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి బాలుడి సంక్షేమం, భద్రత రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత అని పేర్కొన్నారు. జిల్లాలో గల స్వచ్ఛంద సంస్థల పరిధిలో గల బాలల సంరక్షణ కేంద్రాల అధికారులతో మధ్యాహ్నం 3గంటలకు సమావేశం అయి పిల్లల బాగోగులు తెలుసుకున్నారు. ఈ క్రమంలో కశింకోటలో గల బాలసధనాన్ని మరియు సుందరయ్య పేటలో గల దయ చైల్డ్ కేర్ హోమ్ అనే స్వచ్ఛంద సంస్థ ను కూడా కమిషన్ సభ్యులు సందర్శించారు . సమావేశానంతరం బాల్య వివాహాల చట్టవిరుద్ధం పోస్టర్, దత్తత,24 గంటల ఉచిత నెంబర్, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, టీనేజ్ ప్రెగ్నెన్సీ గోడపత్రికలను ఆవిష్కరించారు.