నిరుద్యోగ రహిత రాజమహేంద్రవరం సాధించాలన్న లక్ష్యంతో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ తెలిపారు. ఇది నిరంతర ప్రక్రియగా ఆయన పేర్కొన్నారు. ప్రతిరెండు నెలలకొకసారి జాబ్ మేళా, ఏడాది కొకసారి మెగా జాబ్ మేళా నిర్వహిస్తామని తెలిపారు శనివారం స్థానిక వి.ఎల్.పురం మార్గాని ఎస్టేట్లో జాబ్ మేళా నిర్వహించారు.
ఈసందర్బంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ నిరుద్యోగరహిత రాజమహేంద్రవరం లక్ష్యంగా, రాజమహేంద్రవరం పార్లమెంట్ నిరుద్యోగ యువతకోసం జనవరి నెలలో సుమారు 75 కంపెనీలతో మంజీరా కన్వెన్షన్ లో నిర్వహించిన మెగా జాబ్ మేళా విజయవంతం అయిందని గుర్తుచేసారు. ఈ జాబ్ మేళాలు నిరంతరం జరిగే ప్రక్రియ గా ఆరోజునే ప్రకటించామన్నారు. అందుకు అనుగుణంగానే పనిచేస్తున్నామని తెలిపారు. అందుకే ఇది మార్గాని భరత్ రామ్ జాబ్ సెంటర్ గా నడుస్తుందని ఆయన తెలిపారు.
అదేవిధంగా మార్గాని భరత్ పేరుతొ ఒక వెబ్ సైట్ కూడా ప్రారంభిస్తున్నామని భరత్ తెలిపారు. ఇందులో నిరుద్యోగ యువత, విద్యార్థులు తమ విద్యార్హతలను బట్టి ఈ వెబ్ సైట్ లో నమోదు కావచ్చని ఆయన సూచించారు. ప్రతిరెండు నెలలకొకసారి జరిగే జాబ్ మేళాకు ఇది దోహద పడుతుందని ఆయన తెలిపారు. అలాగే ఏ ఐ, మాన్యుఫాక్చరింగ్, బీపీఓ, బ్యాంకింగ్, ఫార్మా, ఈ-కామర్స్ లాంటి కంపెనీల నుంచి ట్రైనర్స్ కూడా రప్పించి నిరుద్యోగులకు ఓరియెంటేషన్ శిక్షణ కూడా అందించేలా చూస్తామని ఆయన ప్రకటించారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తమవంతు బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామని వచ్చే మూడేళ్ళలో కనీసం 15వేల నుంచి 20వేల మందికి రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలన్నదే లక్ష్యమని మాజీ ఎంపీ భరత్ చెప్పారు. గత జనవరిలో జరిగిన మెగా జాబ్ మేళాలో ఉద్యోగం పొందిన యువతి ఇప్పుడు సదరు కంపెనీ నుంచి ఇంటర్యూలు నిర్వహించడానికి ఇంఛార్జిగా రావడం ఆనందంగా ఉందన్నారు. ఎంతమందికి వీలయితే అంతమందికి ఉపాధి కల్పించడానికి కృషి కొనసాగుతుందని తెలిపారు.
ఈసందర్బంగా హెచ్ ఆర్ కో డాట్ కంపెనీ హెచ్ ఆర్ సుష్మిత మాట్లాడుతూ గతంలో మార్గాని భరత్ రామ్ నిర్వహించిన మెగా జాబ్ మేళాలో ఉద్యోగం పొంది, ఇప్పుడు ఆయన నిర్వహించే జాబ్ మేళాకు నేను పనిచేసే కంపెనీ నుంచి ఇంటర్యూ నిర్వహించడానికి రావడం ఆనందంగా ఉందన్నారు. ఇలాంటి జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
కాగా ఈ జాబ్ మేళాలో సుమారు 500మందికి మాజీ ఎంపీ మార్గాని భరత్, మార్గాని నాగేశ్వరరావు తో పాటు ముఖ్య అతిధులు మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, డా గూడూరి శ్రీనివాసరావు, డిసిసిబి మాజీ అధ్యక్షుడు ఆకుల వీర్రాజు చేతులమీదుగా అపాయింట్ మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు.

