లక్నో, ఉత్తరప్రదేశ్: భారతదేశంలోని అతిపెద్ద యువజన భాగస్వామ్య కార్యక్రమాలలో ఒకటైన నేషన్ ఫస్ట్ ఛాలెంజ్ 2026 మే 18 నుండి జూన్ 30 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించబడింది. ఈ సవాల్‌లో 10 లక్షలకు పైగా యువత పాల్గొని తమ జ్ఞానం, నాయకత్వం మరియు దేశ నిర్మాణం పట్ల ఉన్న నిబద్ధతను చాటుకున్నారు.
ఈ పోటీలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన రిత్విక్ రెడ్డి దేశవ్యాప్తంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఆల్ ఇండియా 3వ ర్యాంక్ సాధించారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో 2వ ర్యాంక్ సాధించి రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారు.
లక్నోలోని ఇందిరా గాంధీ ప్రతిష్ఠాన్లో నిర్వహించిన జాతీయ సన్మాన కార్యక్రమంలో కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ మంత్రి డా. మన్సుఖ్ మాండవీయ చేతుల మీదుగా రిత్విక్ రెడ్డికి అవార్డు, ప్రశంసా పత్రం మరియు జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో MY Bharat ఉన్నతాధికారులు, దేశవ్యాప్తంగా ఎంపికైన విజేతలు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
వికసిత భారత్ – 2047 లక్ష్య సాధనలో యువత పాత్రను ప్రోత్సహించే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దేశంలోని టాప్ విజేతలను ఘనంగా సత్కరించారు. రిత్విక్ రెడ్డి సాధించిన ఈ విజయం తెలంగాణ యువతకు స్ఫూర్తిదాయకంగా నిలవడమే కాకుండా, దేశ నిర్మాణ కార్యక్రమాల్లో యువత మరింత చురుకుగా పాల్గొనాలనే సందేశాన్ని అందించింది.
ఈ సందర్భంగా పలువురు అధికారులు, విద్యావేత్తలు మరియు శ్రేయోభిలాషులు రిత్విక్ రెడ్డిని అభినందిస్తూ, భవిష్యత్తులో కూడా ఇలాంటి జాతీయ స్థాయి విజయాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.




