అనకాపల్లి జిల్లా | పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్
యలమంచిలి, మోసయ్యపేట, ఆగస్టు 20: టాటా ఏస్ వాహనం ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళా కార్మికులను సీఐటీయూ నాయకులు పరామర్శించి భరోసా కల్పించారు. గత నెలలో యలమంచిలి, మోసయ్యపేట, కొత్త మోసయ్యపేట, చోడపల్లి గ్రామాలకు చెందిన మహిళా కార్మికులు ప్రయాణిస్తున్న టాటా ఏస్ వాహనం చెట్టును ఢీకొని ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.
ప్రమాదంలో గాయపడిన కొందరు మహిళలు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇళ్లకు చేరుకోగా, మరికొందరు నెలరోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ముచ్చు నాగమణి కాలు విరగడంతో నడవలేని పరిస్థితిలో ఉన్నారని, ముచ్చు రామలక్ష్మి, కొండపల్లి చౌడమ్మ, శెట్టి లక్ష్మి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని నేతలు తెలిపారు.
వైద్య ఖర్చులతో పాటు కుటుంబాలను పోషించుకోవడం కూడా బాధితులకు భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా కార్మికులు పూర్తిగా కోలుకునే వరకు వేతనంతో కూడిన సెలవులు, పౌష్టికాహారం, తగిన పరిహారం అందించి పరిశ్రమ యాజమాన్యం ఆదుకోవాలని సీఐటీయూ నేతలు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు తక్షణమే భరోసా కల్పించాలని కోరారు.
కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్. రాము, మోసయ్యపేట ఉపసర్పంచ్ పుర్రె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


