ఏన్కూర్, జూలై
(పున్నమి ప్రతి నిధి )
ఖమ్మం జిల్లా ఏన్కూర్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం జరిగిన సంచలన ఘటనలో ఓ మహిళపై ఆమె భర్త కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఘటనలో గాయపడిన మహిళను వెంటనే ఆసుపత్రికి తరలించగా, నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం, ఏన్కూర్ మండలం ఎర్రబోడు తండాకు చెందిన భూక్యా రజని కుటుంబ కలహాల కారణంగా గత కొంతకాలంగా తన భర్త భూక్యా రాంబాబుకు దూరంగా నివసిస్తోంది. సోమవారం రజని ఏన్కూర్ ఎస్‌బీఐ బ్యాంకుకు వెళ్లగా, అక్కడికి వచ్చిన రాంబాబు ఆమెతో గొడవపడి బెదిరింపులకు పాల్పడ్డాడు.
దీంతో రజని ఫిర్యాదు చేసేందుకు ఏన్కూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. మధ్యాహ్నం సుమారు 1:40 గంటల సమయంలో రాంబాబు కత్తితో పోలీస్ స్టేషన్‌లోకి వచ్చి రజనిపై దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె ఎడమ భుజం, ఎడమ మణికట్టు వద్ద గాయాలయ్యాయి.
అప్రమత్తమైన పోలీసు సిబ్బంది వెంటనే స్పందించి నిందితుడిని అదుపులోకి తీసుకుని, అతని వద్ద ఉన్న కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గాయపడిన రజనిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై ఏన్కూర్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నెం. 152/2026గా BNS సెక్షన్లు 109, 85తో పాటు డి.పీ. చట్టం సెక్షన్లు 3, 4 కింద కేసు నమోదు చేశారు. నిందితుడు భూక్యా రాంబాబును అరెస్ట్ చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు.



