బద్రాద్రి కొత్తగూడెం చుంచుపల్లి మండలం సెప్టెంబర్,2(పున్నమి ప్రతినిధి)
కొత్తగూడెం: సింగరేణి సంస్థలో ప్రతి నెల క్రమం తప్పకుండా మెడికల్ బోర్డులు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) ఆధ్వర్యంలో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కొత్తగూడెం ఏరియాలో గనులు, విభాగాల వద్ద నిర్వహించిన ఈ ఆందోళనలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న అర్హులైన కార్మికులను మెడికల్ అన్‌ఫిట్‌గా ప్రకటించి, వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు కల్పించాలని నాయకులు డిమాండ్ చేశారు. గతంలో నెలకు రెండు లేదా మూడు మెడికల్ బోర్డులు నిర్వహించేవారని, ప్రస్తుతం జాప్యం కారణంగా వేలాది కార్మిక కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.



