జిల్లా విద్యాశాఖలో రెగ్యులర్ అధికారుల కొరతతో ఇంచార్జిల పాలన కొనసాగుతోంది. రెండేళ్లకు పైగా జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) పోస్టు ఖాళీగా ఉండటంతో ఫైళ్ల పరిష్కారం, అభివృద్ధి పనుల్లో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని 21 మండలాలకు గాను ఖమ్మం రూరల్, రఘునాథపాలెం మండలాల్లో మాత్రమే రెగ్యులర్ మండల విద్యాశాఖ అధికారులు ఉన్నారు. మిగిలిన 19 మండలాల్లో హెచ్‌ఎంలే ఎఫ్‌ఏసీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అదనపు బాధ్యతలతో హెచ్‌ఎంలపై పనిభారం పెరుగుతోంది. దీంతో పాఠశాలల పర్యవేక్షణ, ఉపాధ్యాయుల సమన్వయం, బోధనాపరమైన అంశాలపై దృష్టి సారించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేసి, పరిపాలనను గాడిలో పెట్టాలని వారు కోరుతున్నారు.



