కృష్ణ, సెప్టెంబర్ 2: కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజులు పూర్తి చేసుకున్నా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని బీజేపీ కృష్ణ మండల అధ్యక్షుడు నల్లె నర్సప్ప ఆరోపించారు. మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతు భరోసా, ఆసరా పెన్షన్లు, రుణమాఫీ, భూమిలేని రైతులకు సాయం, బోనస్, ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని విమర్శించారు.
బీజేవైఎం మండల అధ్యక్షుడు ఒట్టేవోళ్ల సురేష్ మాట్లాడుతూ విద్యార్థులు, యువత పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉద్యోగ భృతి వంటి హామీలు అమలు కాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి, భవిష్యత్తులో బీజేపీ చేపట్టే నిరసనల్లో యువత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
హైదరాబాద్ నాంపల్లి బీజేపీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నాయకుల దాడిని నల్లె నర్సప్ప, ఒట్టేవోళ్ల సురేష్ తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి దండు రాఘవేంద్ర, సచిన్ భట్, సీనియర్ నాయకులు నారాయణ్ భట్, డీకే కిష్టప్ప, అజిత్ దీక్షిత్, బీజేవైఎం సభ్యులు సి. ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


