నిరాధార ఆరోపణలు తీవ్రంగా ఖండించిన లోడీ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు
మంథని, ఆగస్టు 29:
మదర్ థెరిసా పొదుపు సమితిపై నామని హరికృష్ణ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామని సమితి లోడీ సంస్థ మంథని డివిజన్ కోఆర్డినేటర్ మేకల మల్లేశం అన్నారు. శనివారం మంథని డివిజన్ మీడియా ప్రెస్‌క్లబ్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
మహిళలకు ఆర్థికంగా చేయూత అందించాలనే ఉద్దేశంతో 2001 నవంబర్ 1న మదర్ థెరిస్సా పొదుపు సమితిని ప్రారంభించామని తెలిపారు. అప్పటి నుంచి సమితి క్రమంగా అభివృద్ధి చెందుతూ ముందుకు సాగుతోందన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా సమితిపై ఆరోపణలు చేస్తూ పత్రికల ద్వారా ప్రచారం చేయడం తమను తీవ్రంగా ఆవేదనకు గురిచేస్తోందని పేర్కొన్నారు. సమితికి సంబంధించిన లెక్కలు, వాస్తవాలను మీడియా ముందు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
సమితి అధ్యక్షురాలు మాదేశి పద్మ మాట్లాడుతూ.. 2001లో ప్రారంభమైన సమితి 26 సంవత్సరాలుగా కొనసాగుతోందని తెలిపారు. సంస్థకు సంబంధించిన అన్ని లెక్కలు, వివరాలు తమ వద్ద ఉన్నాయని, వాటిని మీడియా ముందు ప్రవేశపెట్టామని చెప్పారు. నిరాధార ఆరోపణలతో సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీయడం సరికాదన్నారు.
సమితి కోశాధికారి నామని సుగుణ మాట్లాడుతూ.. సమితి అభివృద్ధి చెందుతుండటాన్ని ఓర్వలేకనే నామని హరికృష్ణ తమపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. రూపాయి నుంచి ప్రారంభమైన సమితి నేడు ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. నోబెల్ బహుమతి గ్రహీత మదర్ థెరిసా ఆశయాలకు, మహిళల మనోభావాలకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు.
సమితిపై తప్పుడు ఆరోపణలు చేసిన అంశాన్ని సంబంధిత శాఖల అధికారులు సమగ్రంగా పరిశీలించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని సమితి సభ్యులు కోరారు. సంస్థకు సంబంధించిన వాస్తవాలను ప్రజలకు తెలియజేయడానికే విలేకరుల సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో సమితి డైరెక్టర్లు ఎలగందుల సరిత, పుల్లె లక్ష్మి, పుల్లె రాజేశ్వరి, తాత యాదమ్మ, ముప్పిడి మల్లేశ్వరి, ఎర్ర రాజేశ్వరి, మైదం శారద తదితరులు పాల్గొన్నారు.


