రూ.8.50 కోట్ల వ్యయంతో నిర్మాణం.. అధికారులతో పనుల పురోగతిపై సమీక్ష
ఆత్మకూరు, ఆగస్టు 30 (పున్నమి ప్రతినిధి): ఆత్మకూరు పట్టణ ప్రజల సౌకర్యార్థం సుమారు రూ.8.50 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న బైపాస్ రోడ్డు పనులను రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి సోమవారం పరిశీలించనున్నారు.
ఆగస్టు 31, 2026 సోమవారం సాయంత్రం 4 గంటలకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి బైపాస్ రోడ్డు నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించి, ప్రస్తుతం కొనసాగుతున్న పనుల పురోగతిని పరిశీలించనున్నారు.
ఈ సందర్భంగా సంబంధిత శాఖల అధికారులతో నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించి, పనులను వేగవంతం చేయడం, నాణ్యతా ప్రమాణాలను పాటించడం వంటి అంశాలపై అధికారులకు సూచనలు చేయనున్నట్లు సమాచారం.
ఆత్మకూరు పట్టణంలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు ప్రజల రాకపోకలకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా ఈ బైపాస్ రహదారి నిర్మాణ పనులు చేపడుతున్నారు.
మంత్రి పర్యటనకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించినట్లు నెల్లూరు మంత్రి కార్యాలయం ఒక ప్రకటన ద్వారా తెలిపింది.

