పున్నమి ప్రతినిధి, తిరుచానూరు జూలై 20
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి అనుబంధ ఆలయంలో కొలువైన శ్రీ సూర్యనారాయణ స్వామి బుధవారం సాయంత్రం బంగారు తిరుచ్చి పై మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయమిచ్చారు. స్వామివారి జన్మ నక్షత్రం అయిన హస్త నక్షత్రం సందర్భంగా శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందులో భాగంగా స్వామివారిని వేకువజామున సుప్రభాతంతో మేలుకొలిపి వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. సాయంత్రం స్వామివారిని శోభాయమానంగా అలంకరించి బంగారు తిరుచ్చిపై కొలువుదీర్చి తిరువీధుల్లో ఊరేగించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని కర్పూర నీరాజనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ హరేంద్రనాథ్, ఏఈఓ దేవరాజులు, ఏవీఎస్ఓ రాధాకృష్ణమూర్తి, సూపరింటెండెంట్లు రమేష్, సురేష్, ముని చంగల్రాయులు, ఇన్స్పెక్టర్లు ప్రసాద్, చలపతి ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.


