ప్రజావాణి ఫిర్యాదుతో రైతు కుటుంబానికి న్యాయం
————————————————————
జనగామ, సెప్టెంబర్ 3,పున్నమి జిల్లా ప్రతినిధి :
భూ భారతి నమోదు ద్వారా వ్యవసాయ భూమికి దారి కల్పింపు
జిల్లా కలెక్టర్ జోక్యంతో ఐదేళ్ల దారి సమస్యకు పరిష్కారం-
జనగామ మండలం శామీరపేట గ్రామానికి చెందిన ఓ రైతు కుటుంబం గత ఐదేళ్లుగా ఎదుర్కొంటున్న వ్యవసాయ భూమి దారి సమస్యకు *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* జోక్యంతో పరిష్కారం లభించింది. ప్రజావాణిలో అందిన ఫిర్యాదుపై అధికారులు వేగంగా స్పందించి, భూ రికార్డులను పరిశీలించి, చట్టబద్ధంగా దారిని పునరుద్ధరించడంతో బాధిత కుటుంబం హర్షం వ్యక్తం చేసింది.
జనగామ మండలం, శామీర్పేట గ్రామంలోని సర్వే నంబర్ 21/A/2/ఆ పరిధిలో ఉన్న తమ వ్యవసాయ భూమికి సుమారు 60 సంవత్సరాలుగా వినియోగంలో ఉన్న దారిని పక్క భూమి యజమానులు ఉద్దేశపూర్వకంగా మూసివేశారని బాధితురాలు తాళ్ల దివ్య (భర్త: నర్సిరెడ్డి) తెలిపారు. దారికి అడ్డంగా కంప వేసి రాకపోకలను అడ్డుకోవడంతో గత ఐదేళ్లుగా వ్యవసాయ పనులు నిర్వహించడం, పంటలను తరలించడం, భూమికి వెళ్లి రావడం తీవ్ర ఇబ్బందిగా మారిందన్నారు.
ఈ సమస్య కారణంగా తమ కుటుంబం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, ఎక్కడా న్యాయం జరగకపోవడంతో చివరకు ప్రజావాణి ద్వారా *జిల్లా కలెక్టర్‌కు* ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
ఫిర్యాదును *జిల్లా కలెక్టర్* తీవ్రంగా పరిగణించి, రెవెన్యూ, సర్వే శాఖ అధికారులను వెంటనే చర్యలకు ఆదేశించారు. అధికారులు భూమి రికార్డులు, పాత పహానీలు, సర్వే వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, ఐదు గుంటల భూమిని భూ భారతి పహానీలో నమోదు చేసి, వ్యవసాయ భూమికి దారి కల్పించేలా చర్యలు చేపట్టారు. దీంతో ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న వివాదానికి ముగింపు పలికినట్లైంది.
అలాగే తమను ఇబ్బందులకు గురిచేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేసి న్యాయం చేసిన పోలీసు శాఖకు బాధిత కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.
సమస్య పరిష్కారానికి సహకరించిన ఎంఆర్ఓ, సర్వే ఏడీ, డీఐ, రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులకు తాళ్ల దివ్య ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా ప్రజావాణిలో తమ వినతిని స్వీకరించి, సమస్యను శాశ్వతంగా పరిష్కరించి న్యాయం చేసిన *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* కు కుటుంబ సభ్యుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజావాణి ద్వారా ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించాలనే జిల్లా పరిపాలన సంకల్పానికి ఈ ఘటన మరో ఉదాహరణగా నిలిచింది.


