Wednesday, 30 September 2026

Tag: Peddapalli

పెద్దపల్లి

ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల అభివృద్ధికి తల్లిదండ్రుల సహకారం కీలకం

పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ శ్రీరాములు పెద్దపల్లి, సెప్టెంబర్ 10: ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల సమగ్ర అభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర అత్యంత కీలకమని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి. శ్రీరాములు అన్నారు. జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో గురువారం పెద్దపల్లిలోని శ్రీనివాస గార్డెన్స్‌లో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల తల్లిదండ్రుల కోసం జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పిల్లల విద్య, ఆరోగ్యం, భవిష్యత్ అవకాశాల కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. పిల్లలను పరిమితులతో చూడకుండా, వారిలోని ప్రతిభ, నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సహించాలని సూచించారు. తల్లిదండ్రులు ప్రేమ, ఆత్మవిశ్వాసం, ప్రోత్సాహంతో పిల్లలను ముందుకు నడిపించాలని కోరారు. ఈ సందర్భంగా అంజారెడ్డి తన జీవిత అనుభవాలను పంచుకున్నారు. ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయినప్పటికీ ఆత్మవిశ్వాసం, పట్టుదలతో జీవితంలో ముందుకు సాగిన తన ప్రయాణాన్ని వివరించారు. ఆయన మాటలు తల్లిదండ్రులకు స్ఫూర్తినిచ్చాయి. రిటైర్డ్ ప్రిన్సిపల్ డా. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ సరైన అవకాశాలు, ప్రోత్సాహం లభిస్తే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు కూడా ఉన్నత విజయాలు సాధించగలరన్నారు. స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి హరిబాబు పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు తల్లిదండ్రుల ప్రేమ, సంరక్షణ, ప్రోత్సాహం అవసరమని తెలిపారు. అపోలో ఆసుపత్రుల బాల వైద్య నిపుణులు డా. ఏ. జగదీష్ పిల్లల శారీరక, మానసిక, నాడీ వ్యవస్థ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించారు. అభివృద్ధి సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి అవసరమైన చికిత్స, శిక్షణ అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఐఈ సమన్వయకర్త జి. కవిత, ప్రణాళిక సమన్వయకర్త చేపూరి మల్లేష్ గౌడ్, మండల విద్యాధికారులు, అధికారులు, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు. పిల్లలకు సమాన అవకాశాలు కల్పించి విద్య, ఆరోగ్యం, సామాజిక రంగాల్లో అభివృద్ధి సాధించేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

పెద్దపల్లి

పెద్దపల్లి కలెక్టరేట్ లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

ఉపాధ్యాయులను సన్మానించిన కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి, సెప్టెంబర్ 05: ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను శనివారం పెద్దపల్లి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొని ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులను శాలువాలు, పుష్పగుచ్ఛాలతో సన్మానించి, అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ 40 సంవత్సరాల క్రితం ఉన్న విద్యా వ్యవస్థకు, నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన యుగంలోని విద్యా వ్యవస్థకు ఎంతో తేడా ఉందని అన్నారు. వ్యవస్థ చాలా వేగంగా మారుతున్న నేపథ్యంలో మనం కూడా అందుకు అనుగుణంగా మారాల్సిన అవసరం ఉందని తెలిపారు. గత రెండున్నర సంవత్సరాలుగా జిల్లాలో వ్యక్తులపై ఆధారపడకుండా, వ్యవస్థ ఆధారంగా పనిచేసేలా విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే తమ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఎవరు ఉన్నా, లేకపోయినా వ్యవస్థ బలంగా, సమర్థవంతంగా పనిచేసేలా విధానాలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తాము ఎప్పుడూ కేవలం నంబర్లు, ర్యాంకుల కోసం ప్రయత్నించలేదని, ప్రక్రియను బలోపేతం చేయడంపైనే ప్రధానంగా దృష్టి సారించామని తెలిపారు. ప్రక్రియ సక్రమంగా ఉంటే ఫలితాలు, ర్యాంకులు సహజంగానే వస్తాయని పేర్కొన్నారు. గత రెండున్నర సంవత్సరాలుగా జిల్లాలోని పలువురు ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులు, ఉపాధ్యాయులతో నిరంతరం చర్చిస్తూ విద్యా వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. అందరి సమష్టి కృషి, సహకారంతో వ్యక్తులతో సంబంధం లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేసి మంచి ఫలితాలు సాధించగలిగామని అన్నారు. గత రెండున్నర సంవత్సరాలుగా విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు సహకరించిన ఉపాధ్యాయులందరికీ ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అవార్డులు అందుకున్న ప్రతి ఒక్కరినీ ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థుల్లో మంచి విలువలు, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన ప్రవర్తన పెంపొందించడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఉపాధ్యాయులు తమ బోధనా విధానాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని సూచించారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన 58 ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్ శాలువాలు, పుష్పగుచ్ఛాలతో సన్మానించి, అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి జి. శారద, అకాడమిక్ మానిటరింగ్ అధికారి పిఎం. షేక్, సెక్టోరియల్ అధికారి, మల్లేశం మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

పెద్దపల్లి

టీపీసీసీ అనుమతితో మండల అధ్యక్షుల నియామకాలు

కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యం: పెద్దపల్లి డీసీసీ అధ్యక్షుడు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ పెద్దపల్లి, సెప్టెంబర్ 03: పెద్దపల్లి జిల్లా పరిధిలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుల నియామకాలను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ గురువారం ప్రకటించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అనుమతితో జిల్లా పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన మండల అధ్యక్షుల పేర్లను వెల్లడించినట్లు తెలిపారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నూతనంగా నియమితులైన మండల అధ్యక్షులు కీలకపాత్ర పోషించాలని ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ఆకాంక్షించారు. గ్రామస్థాయి నుంచి పార్టీ కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. నూతన మండల అధ్యక్షుల నియామకాలు తక్షణం అమల్లోకి వస్తాయని జిల్లా కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. మంథని మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఐలి ప్రసాద్, మంథని–ముత్తారం మండలానికి దొడ్డ బాలాజీ, రామగిరి మండలానికి తులసీరాం గౌడ్, కమాన్పూర్ మండలానికి సయ్యద్ అన్వర్ లను నియమించారు. పెద్దపల్లి మండలానికి కట్కూరి సుధాకర్ రెడ్డి, ఓదెల మండలానికి మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, కాల్వ శ్రీరాంపూర్ మండలానికి గజవేన సదయ్య, సుల్తానాబాద్ మండలానికి చిలుక సతీష్, ఎలిగేడు మండలానికి సామ రాజేశ్వర్ రెడ్డి, జూలపల్లి మండలానికి బొజ్జ శ్రీనివాస్ లను మండల అధ్యక్షులుగా ప్రకటించారు. రామగుండం నియోజకవర్గం పరిధిలోని అంతర్గాం మండల అధ్యక్షుడిగా సింగం కిరణ్, పాలకుర్తి మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా ముక్కెర శ్రీనివాస్ లను నియమించారు. ధర్మపురి నియోజకవర్గం పరిధిలోని ధర్మారం మండల అధ్యక్షుడిగా రూపేష్ నాయక్ ను నియమించినట్లు కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ తెలిపారు. నూతనంగా నియమితులైన మండల అధ్యక్షులు స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ పార్టీ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని పార్టీ నాయకత్వం సూచించింది. గ్రామస్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని మరింత పటిష్టం చేయడం, ప్రజలకు పార్టీ అందిస్తున్న సేవలు, కార్యక్రమాలను విస్తృతంగా తీసుకెళ్లడం ద్వారా సంస్థాగతంగా పార్టీకి మరింత బలం చేకూరుతుందని నాయకులు పేర్కొన్నారు. Uploaded Video:

పెద్దపల్లి

సెప్టెంబర్‌ 9న పెద్దపల్లిలో ఉద్యోగ మేళా

పెద్దపల్లి, సెప్టెంబర్‌ 03: నిరుద్యోగ యువతకు ప్రైవేట్‌ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో పెద్దపల్లి జిల్లాలో జిల్లా స్థాయి ఉద్యోగ మేళాను నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎం. రాజశేఖర్‌ తెలిపారు. ఈ నెల సెప్టెంబర్‌ 9వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు సమీకృత జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న శుభగృహ ప్రాజెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో ఖాళీగా ఉన్న మొత్తం 30 పోస్టులను నేరుగా ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అర్హత కలిగిన యువతకు ఇది మంచి అవకాశమని పేర్కొన్నారు. మార్కెటింగ్‌ విభాగంలో మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్స్‌, మార్కెటింగ్‌ మేనేజర్స్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులని తెలిపారు. ఎంపికైన వారికి నెలకు రూ.15 వేల నుంచి రూ.18 వేల వరకు వేతనం అందించనున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా టెలికాలర్‌ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు మహిళా అభ్యర్థులకు అవకాశం కల్పించారు. ఎంపికైన వారికి నెలకు రూ.15 వేల వేతనం అందించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్‌, డిప్లొమా, ఐటీఐ, ఏదైనా డిగ్రీ, ఎంబీఏ, బీటెక్‌ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు అర్హులని తెలిపారు. ఉద్యోగం పొందిన వారు హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో విధులు నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఉద్యోగ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు తమ అప్‌డేటెడ్‌ రెజ్యూమ్‌/సీవీ, విద్యార్హతలకు సంబంధించిన జిరాక్స్‌ ప్రతులు, ఆధార్‌ కార్డు, అనుభవ పత్రాలు వెంట తీసుకురావాలని అధికారులు సూచించారు. నిర్ణీత సమయానికి వేదికకు చేరుకుని నేరుగా ఇంటర్వ్యూలో పాల్గొనాలని తెలిపారు. సెప్టెంబర్‌ 9న ఉదయం 10 గంటలకు, పెద్దకల్వలలోని సమీకృత జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో రూమ్‌ నంబర్‌ 233, మొదటి అంతస్తులో ఈ ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పనాధికారి కోరారు. వివరాలకు 9908674056, 8121262441 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

పెద్దపల్లి

డిఫాల్ట్ రైస్ మిల్లర్ల నుంచి బకాయిలను నెల రోజుల్లో పూర్తిగా వసూలు చేయాలి:

పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి, సెప్టెంబర్ 02: డిఫాల్ట్ రైస్ మిల్లర్ల నుంచి ప్రభుత్వం పొందాల్సిన బకాయిలను రెవెన్యూ రికవరీ యాక్ట్‌ ప్రకారం పూర్తిస్థాయిలో వసూలు చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు తో కలిసి డిఫాల్ట్ రైస్ మిల్లర్ల నుంచి బకాయిల వసూళ్లపై సంబంధిత అధికారులతో కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ డిఫాల్ట్ రైస్ మిల్లర్లకు సంబంధించిన ఆస్తులను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. సదరు రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ధాన్యం విలువను రెవెన్యూ రికవరీ యాక్ట్‌ ప్రకారం రికవరీ చేయాలని సూచించారు. డిఫాల్ట్ రైస్ మిల్లర్ల నుంచి బకాయిల వసూళ్లకు సంబంధించి తహసీల్దార్లు, సబ్‌ రిజిస్ట్రార్లు సమన్వయంతో పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. సంబంధిత రైస్ మిల్లర్ల ఆస్తుల వివరాలను పూర్తిస్థాయిలో గుర్తించి, బకాయిల రికవరీకి అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. రెవెన్యూ రికవరీ యాక్ట్‌ ప్రకారం చేపట్టాల్సిన ప్రక్రియను వెంటనే ప్రారంభించి, డిఫాల్ట్ రైస్ మిల్లర్ల నుంచి మొత్తం బకాయి మొత్తాన్ని నెల రోజుల్లోగా పూర్తిగా వసూలు చేయాలని స్పష్టం చేశారు. బకాయిల వసూళ్లలో ఎలాంటి జాప్యం లేకుండా నిర్దేశిత గడువులో చర్యలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. డిఫాల్ట్ రైస్ మిల్లర్ల ఆస్తుల గుర్తింపు, రికార్డుల పరిశీలన, బకాయిల నిర్ధారణ తదితర అంశాల్లో సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నిర్దేశించిన గడువులో బకాయిల వసూళ్లు పూర్తయ్యేలా క్షేత్రస్థాయిలో చర్యలను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీవోలు బి. గంగయ్య, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత తహశీల్దార్లు, సబ్‌ రిజిస్ట్రార్లు, సంబంధిత అధికారులు, పాల్గొన్నారు.

పెద్దపల్లి

100 రోజుల ఉచిత కోచింగ్‌కు దరఖాస్తుల ఆహ్వానం

టీఆర్పీ రాష్ట్ర కార్యదర్శి మొహమ్మద్ అఖిల్ పాషా పెద్దపల్లి, సెప్టెంబర్ 01: ఎస్‌ఐ, పీసీ, ఎఫ్‌బీఓ, జీపీఓ ఉద్యోగాల పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో 100 రోజుల ఉచిత శిక్షణ అందించనున్నట్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శి మొహమ్మద్ అఖిల్ పాషా తెలిపారు. పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో ఉన్న యువతకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఉచిత శిక్షణకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి ఉన్న నిరుద్యోగ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అభ్యర్థులు వాట్సాప్ గ్రూప్‌లో చేరి తమ పూర్తి వివరాలను పంపాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9700577556 నంబర్‌ను, వాట్సాప్ గ్రూప్ లింక్: https://chat.whatsapp.com/HCGtGeeQynz2qpjU8bRY7S సంప్రదించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మెరుగు చందర్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు మేరుగు సతీష్ గౌడ్, జిల్లా సహాయ కార్యదర్శి కాంపెల్లి స్వామి, జిల్లా కార్యదర్శి కుమ్మరి పరమేష్, పెద్దపల్లి మండల అధ్యక్షులు వెంగల కృష్ణ, పెద్దపల్లి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్ల ప్రశాంత్, గోగు సురేష్ , తదితరులు పాల్గొన్నారు.

పెద్దపల్లి

సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరించాలి: టీజీఈజేఏసీ

పెద్దపల్లి, సెప్టెంబర్ 01: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికుల హక్కుల సాధన కోసం టీజీఈజేఏసీ పిలుపు మేరకు నిర్వహించిన ‘పెన్షన్ విద్రోహ దినం–చలో కలెక్టరేట్’ కార్యక్రమం పెద్దపల్లిలో విజయవంతమైంది. ఉద్యోగులు నల్ల దుస్తులు, నల్ల బ్యాడ్జీలు ధరించి కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీజీఈజేఏసీ జిల్లా ఛైర్మన్ బొంకూరి శంకర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని, వారి న్యాయమైన హక్కులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం బాధాకరమన్నారు. సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని, డీఏలు విడుదల చేసి పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. దశాబ్దాల పాటు సేవలందించిన ఉద్యోగులకు పెన్షన్ లేకపోవడం అన్యాయమన్నారు. ఇదే క్రమంలో జిల్లా కన్వీనర్ తూము రవీందర్ మాట్లాడుతూ జిల్లాలోని 206 ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్, కార్మిక సంఘాలు ఐక్యంగా నిరసనలో పాల్గొన్నాయని తెలిపారు. టీజీఓ జిల్లా కార్యదర్శి గండు సురేష్, టీఎన్జీఓ జిల్లా కార్యదర్శి అయిరెడ్డి సందీప్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే సెప్టెంబర్ 10న హైదరాబాద్‌లో నిర్వహించే మహాధర్నాను భారీ స్థాయిలో నిర్వహిస్తామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ, టీజీఓ, యూటీఎఫ్, ఇంజనీరింగ్, ట్రెజరీ, మెడికల్, వెటరినరీ, తదితర సంఘాల నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

పెద్దపల్లి

ఆరు గ్యారంటీలు అమలు చేయాలని ఏఐఎఫ్‌బీ పట్టణ కన్వీనర్‌ కుక్క శ్రావణ్‌ కుమార్‌ డిమాండ్‌

పెద్దపల్లి, సెప్టెంబర్ 01: కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు అన్ని హామీలను వెంటనే అమలు చేయాలని ఏఐఎఫ్‌బీ పట్టణ కన్వీనర్‌ కుక్క శ్రావణ్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. పెద్దపల్లి బస్టాండ్ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. హామీలు అమలు చేయలేకపోతే ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని నిరసన వ్యక్తం చేశారు. మహిళలకు రూ.2,500, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, పెన్షన్ల పెంపు, రైతు భరోసా, ఆటో డ్రైవర్లకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం తదితర హామీలను అమలు చేయాలని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్‌ రద్దు చేసి ఓపీఎస్‌ అమలు చేయడంతోపాటు పెండింగ్‌ డీఏలను విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కుక్క అశోక్‌, నూనె వెంకటేశ్‌, మహరాజ్‌, షఫీ, కుక్క చరణ్‌, ఒడ్డపల్లి తిరుమల్‌ తోపాటు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

పెద్దపల్లి

తహశీల్దార్ పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిరసన దీక్ష

పెద్దపల్లి, ఆగస్టు 31: పాలకుర్తి మండలం భీమ్లానాయక్‌ తండాకు చెందిన గిరిజన మహిళ ఇస్లావత్‌ సుజాతకు సంబంధించిన భూమి వివాదంలో రెవెన్యూ అధికారుల తీరుపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో సోమవారం పెద్దపల్లి కలెక్టరేట్‌ ఎదుట నిరసన దీక్ష నిర్వహించారు. పార్టీ నాయకుల ఆరోపణల ప్రకారం.. సుజాత బతికుండగానే 2006లోనే మరణించినట్లు చూపిస్తూ నకిలీ మరణ ధృవీకరణ పత్రం సృష్టించారని, సర్వే నంబర్‌ 111లోని 24 గుంటల భూమికి సంబంధించిన వ్యవహారంలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఈ వ్యవహారంపై పాలకుర్తి తహశీల్దార్ సునీతపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బాధితురాలికి ఆధార్‌, డిజిటల్‌ పాస్‌బుక్‌ వంటి అధికారిక పత్రాలు ఉన్నప్పటికీ భూమి పట్టా మార్పు ఎలా జరిగిందనే అంశంపై సమగ్ర విచారణ జరపాలని నాయకులు కోరారు. 37 ఏళ్ల మహిళకు 56 ఏళ్ల వ్యక్తిని మనవడిగా చూపించడం వంటి అంశాలపై కూడా అధికారులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. భూమి వ్యవహారంలో రెవెన్యూ అధికారుల పాత్రపై ఏసీబీ ద్వారా విచారణ జరిపించాలని, బాధితురాలికి న్యాయం చేయడంతో పాటు అక్రమ రిజిస్ట్రేషన్‌ జరిగినట్లయితే దానిని రద్దు చేయాలని కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. నిరసన దీక్షలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మెరుగు చందర్‌ యాదవ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి నంపుల్లి శివదాస్‌, ఉపాధ్యక్షుడు మెరుగు సతీష్‌ గౌడ్‌, జాయింట్‌ సెక్రటరీ కాంపెల్లి స్వామి, జిల్లా కార్యదర్శి కుమ్మరి పరమేశ్‌, మండల ఉపాధ్యక్షుడు నేరువట్ల నరేష్‌, బాబు, రంగు నాగరాజు, మెరుగు జయతో పాటు బాధిత కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

పెద్దపల్లి

31 మంది సర్వేయర్ల లైసెన్సులు రద్దు అన్యాయం: బీఆర్‌ఎస్ నాయకురాలు దాసరి ఉష మండిపాటు

పెద్దపల్లి, ఆగస్టు 31: పెద్దపల్లి జిల్లాలో 31 మంది లైసెన్స్డ్ సర్వేయర్ల లైసెన్సులను ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ లైసెన్స్డ్ సర్వేయర్ల సంఘం చేపట్టిన పోరాటానికి బీఆర్‌ఎస్ నాయకురాలు దాసరి ఉష సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు. పూర్తిస్థాయి విచారణ జరపకుండా, బాధితుల వాదన వినకుండా రాత్రికి రాత్రే లైసెన్సులు రద్దు చేస్తూ అధికారులు తీసుకున్న నిర్ణయం తీవ్ర అన్యాయమని ఆమె మండిపడ్డారు. తెలంగాణ లైసెన్స్డ్ సర్వేయర్ల సంఘం ఆధ్వర్యంలో సోమవారం పెద్దపల్లి కలెక్టరేట్ కార్యాలయం నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. సర్వేయర్ల సమస్యలపై నినాదాలు చేస్తూ సాగిన ఈ ర్యాలీ అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా దాసరి ఉష మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఎక్కడా లేని విధంగా కేవలం పెద్దపల్లి జిల్లాలోనే అత్యధిక సంఖ్యలో సర్వేయర్ల లైసెన్సులను రద్దు చేయడం వెనుక ఉన్న అంతరార్థమేమిటని ప్రశ్నించారు. ఈ నిర్ణయం వల్ల 31 కుటుంబాలు రోడ్డున పడి, ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, సర్వేయర్ల లైసెన్సుల రద్దు నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని, బాధిత సర్వేయర్లకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ లైసెన్స్డ్ సర్వేయర్ల సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు అరవింద్, రాష్ట్ర సలహాదారు గోవర్ధన్, జిల్లా నాయకులు తిరుపతి, సురేష్, గోపి, అభిలాష్‌తో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.