Wednesday, 30 September 2026

Tag: Peddapalli

తెలంగాణ పెద్దపల్లి విద్య విజ్ఞానం

మంథని గురుకుల బాలుర కళాశాలలో స్పాట్ అడ్మిషన్ కు దరఖాస్తుల ఆహ్వానం

*మంథని గురుకుల బాలుర కళాశాలలో స్పాట్ అడ్మిషన్ కు దరఖాస్తుల ఆహ్వానం* మంథని, జులై 29, పున్నమి ప్రతినిధి: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర కళాశాలలో ఇంటర్ మీడియట్ 2025 – 2026 మొదటి విద్యా సంవత్సరానికి ఎంపీసీ, బైపీసీ గ్రూపులలో మిగిలిన ఖాళీలను భర్తీ చేయడం కోసం ఈ నెల 31 తేదీన స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఉటూరి శ్రీనాథ్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మంథని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇదివరకే దరఖాస్తు సమర్పించిన విద్యార్థులు కూడా ఈ స్పాట్ కౌన్సిలింగ్ కు హాజరు కావచ్చునని ప్రిన్సిపల్ స్పష్టం చేశారు. విద్యార్థులు తమ అన్ని అర్హతలను తెలియజేసే సర్టిఫికెట్లతో ఈ నెల 31 తేదీన ఉదయం 9 గంటలకు తమకు అడ్మిషన్ కావాల్సిన గురుకుల జూనియర్ కళాశాలలో హాజరుకావాలని ఆయన వివరించారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యార్థుల దరఖాస్తులను రిజిస్ట్రేషన్ చేస్తారని, మధ్యాహ్నం 2 గంటల తర్వాత, మెరిట్ లిస్టు ప్రకటించి, వెంటనే కౌన్సిలింగ్ నిర్వహించి, సీట్లు కేటాయిస్తారని తెలిపారు. అడ్మిషన్లన్నీ రిజర్వేషన్ ప్రకారం, పదవ తరగతిలో వచ్చిన మార్కుల ప్రాతిపదికన కేటాయించబడతాయన్నారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం స్పాట్ అడ్మిషన్ కొరకు దరఖాస్తు చేసుకునే విద్యార్థుల అర్హతలను వివరించారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మార్చి 2025 సంవత్సరంలో నిర్వహించిన పదవ తరగతి పరీక్షలలో ఒకే ప్రయత్నంలో ఉత్తీర్ణులై ఉండాలనీ, విద్యార్థులు తమ స్వంత జిల్లా/ఉమ్మడి జిల్లాలో దరఖాస్తు చేసుకోవాలనీ, పదవ తరగతి తెలుగు మీడియంలో చదివిన విద్యార్థులు కూడా ఇంగ్లీష్ మీడియం కళాశాలల్లో దరఖాస్తు చేసుకోవచ్చునని, పదవ తరగతి మార్కుల మెమో, అవసరమైన సర్టిఫికెట్ లన్ని కౌన్సెలింగ్ సమయంలో సమర్పించాలని తెలిపారు. దరఖాస్తు చేసుకొనే విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతంలో సంవత్సరానికి రూ. 2,00,000, గ్రామీణ ప్రాంతంలో రూ. 1,50,000 మించకూడదనీ, ఇందుకు సంబంధించిన ఆదాయ ధృవీకరణ పత్రాన్ని 2025 జనవరి 1 వ తేదీన లేదా అంతకుముందు తేదీలో తహశీల్దార్ జారీ చేయాలనీ, విద్యార్థుల వయస్సు 2025 ఆగస్టు 31 తేదీ నాటికి 17 సంవత్సరాలు మించకూడదనీ, ఈ విషయంలో ఎస్సీ విద్యార్థులందరికీ ఒక సంవత్సరం సడలింపు ఇవ్వబడుతుందని ఆయన తెలిపారు.

తెలంగాణ పెద్దపల్లి

మంథని మండలంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

*మంథని మండలంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* మంథని, జులై 29, పున్నమి ప్రతినిధి: బయోమెట్రిక్ విధానం ద్వారా వైద్య సిబ్బంది హాజరు నమోదు చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. మంథని మండలంలో మంగళవారం జిల్లా కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు మంథని పట్టణ కేంద్రంలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్, మాత శిశు ఆసుపత్రి, గోపాల్పూర్ గ్రామంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, గద్దలపల్లి గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఆస్పత్రిలో వార్డులను క్షుణ్ణంగా కలెక్టర్ తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగుల కొరకు నూతనంగా నిర్మించిన షెడ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రిలో సిబ్బంది, వైద్యులు సకాలంలో విధులకు హాజరు కావాలని, ప్రతిరోజు తప్పనిసరిగా వివరాలను బయోమెట్రిక్ విధానం ద్వారా నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. మాత శిశు ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్య సేవలను గర్భిణీ మహిళలకు అందించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. గోపాల్పూర్ గ్రామంలో ప్రాథమిక పాఠశాల నిర్మాణ పనులు వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని అన్నారు. గద్దెలపల్లి ప్రాథమిక ఆసుపత్రిని పరిశీలించి ఏఎంసీ ప్రొఫైల్ సక్రమంగా నిర్వహించాలని, ఎన్సీడీ స్క్రీనింగ్, ఎక్స్రే, టీబీ, ముక్తు భారత్, ఆరోగ్య మహిళా తదితర వాటిపై ఆరా తీశారు. ఓ పీ సేవలు పెంచాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట ఎంపీడీవో శశికళ, మంథని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజశేఖర్, ఏఈపిఆర్ అనుదీప్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ పెద్దపల్లి

లంచం డిమాండ్ చేసిన పారిశుద్ధ్య కార్మికులను విధుల నుంచి తోలగింపు

*లంచం డిమాండ్ చేసిన పారిశుద్ధ్య కార్మికులను విధుల నుంచి తోలగింపు* *_పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష_* రామగుండం, జులై 25, పున్నమి ప్రతినిధి: లంచం డిమాండ్ చేసిన ఔట్ సోర్సింగ్ పారిశుధ్య కార్మికులను విధుల నుంచి తొలగిస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జనరల్ ఆసుపత్రి లో శుక్రవారం ఆకస్మిక తనిఖీ సమయంలో ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ఏజేన్సీ ద్వారా పారిశుధ్య కార్మికులుగా విధులు నిర్వహిస్తున్న హనుమంతు, లావణ్య రోగుల నుంచి లంచం డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, డబ్బులు ఇవ్వని పేషెంట్ బెడ్ల వద్ద క్లీనింగ్ చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు రోగుల ఫిర్యాదు ద్వారా తెలుసుకున్న కలెక్టర్ వెంటనే సంబంధిత ఔట్ సోర్సింగ్ సిబ్బంది సర్వీసులను టెర్మినెట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఔట్ సోర్సింగ్ పారిశుద్ధ్య సిబ్బంది హనుమంతు, లావణ్య లను ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో అనుమతించడానికి వీలులేదని కలెక్టర్ గోదావరిఖని జనరల్ ఆసుపత్రి వైద్య సూపరింటెండెంట్ ను ఆదేశించారు. పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య వసతులను పూర్తి ఉచితంగా అందించాలని లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుంటే ఇటువంటి ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఆ లక్ష్యానికి తూట్లు పొడుస్తూ, పేద రోగులను ఇబ్బందులకు గురి చేస్తూ, జిల్లా యంత్రాంగానికి అవమానకర పరిస్థితులు తీసుకువచ్చారని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగుల దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేసే సిబ్బంది ఇంకా ఎవరైనా ఉంటే గుర్తించి విధుల నుంచి తొలగించాలని, లేనిపక్షంలో ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ లైసెన్సు రద్దు చేయడం జరుగుతుందని కలెక్టర్ సంబంధిత ఏజెన్సీ వర్గాలను హెచ్చరించారు.

తెలంగాణ పెద్దపల్లి

వంద పడకల ఆసుపత్రి పనులను పర్యవేక్షించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

*జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్* *వ్యాధి లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలి* *_పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష_* పెద్దపల్లి, జులై 24, పున్నమి ప్రతినిధి: సీజనల్ వ్యాధి లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. గురువారం పెద్దపల్లి పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆయుష్ ఆసుపత్రిని పరిశీలించి, నూతనంగా నిర్మాణం జరుగుతున్న 100 పడకల ఆసుపత్రి పనులు, నిర్మాణం పూర్తి చేసుకున్న తాత్కాలిక క్యాజువాలిటిని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ఆసుపత్రి వెనుక ఉన్న చిన్న సందు విస్తరించి, అక్కడి నుంచి పేషెంట్ తరలింపు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచనలు జారీ చేశారు. సీజనల్ వ్యాధుల వ్యాప్తి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వ్యాధి లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా నిర్దారణ పరీక్షలు నిర్వహించాలని, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా కేసులు తప్పనిసరిగా రిపోర్ట్ అయ్యేలా చూడాలని అన్నారు. ఈ తనీఖీలలో కలెక్టర్ వెంట జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, ఆర్.ఎం.ఓ డాక్టర్ విజయ్, నర్సింగ్ సూపరిండెంట్ జమున, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ పెద్దపల్లి

భాద్యతగా పని చేసే వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుంది: సీపీ అంబర్ కిషోర్ ఝా

*భాద్యతగా పని చేసే వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుంది* *_రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా_* రామగుండం, జులై 22, పున్నమి ప్రతినిధి: వార్షిక తనిఖీల్లో భాగంగా పెద్దపల్లి జోన్ పోత్కపల్లి పోలీస్ స్టేషన్ ను మంగళవారం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ చేరుకున్న సీపీ కి స్టేషన్ పోలీస్ అధికారులు పుష్ప గుచ్చాలను అందజేసి స్వాగతం పలికారు. ఈ తనిఖీల్లో భాగంగా సీపీ పోలీస్ స్టేషన్ పరిసరాలను, వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను పరిశీలించి కేసుల వివరాలను తెలుసుకొని పోలీస్ స్టేషన్ లోని రిసెప్షన్ సెంటర్ సందర్శించి రికార్డులను పరిశీలించారు. స్టేషన్ లోని పోలీస్ అధికారులు సిబ్బంది వివరాలు, నిర్వహిస్తున్న పని తీరు, వారికీ ఏదైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిధి భౌగోళిక పరిస్థితులు, ముఖ్యమైన ప్రదేశాలు, ఈ ప్రాంతంలోని మావోయిస్టులు, వారి కుటుంబ వివరాలు, పోలీస్ స్టేషన్ పరిధి గ్రామాల్లో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయని, వాటిని ఏవిదంగా నియంత్రణ చేయాలనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ స్టేషన్ రికార్డ్స్, హిస్టరీ షీట్స్, మండల భౌగోళిక స్థితి, నేరాల నమోదు, కేసుల స్థితిగతులు, కోర్టు క్యాలెండర్, సాంకేతికత మొదలగు వాటిని పరిశీలించారు. అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలను నిరోధించాలని సిబ్బందిని ఆదేశించారు. పారదర్శకంగా పోలీసింగ్ ఉండాలని ప్రజలకు పోలీసు సేవలను వేగంగా అందించాలని సిబ్బందికి తెలిపినారు. గంజాయి రవాణా, వినియోగం నిరోధించేలా బాధ్యతగా పని చేయాలని అన్నారు. పెట్రోలింగ్ పెంచాలని, డయల్ 100 కాల్స్ పై సిబ్బంది వేగంగా స్పందించాలని అన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా అవగాహన కల్పించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు పని చేయాలని అన్నారు. సైబర్ నేరాలు జరగకుండా ప్రజలు సైబర్ మోసాలకు గురి కాకుండా అవగాహన కల్పించాలని కోరారు. భాద్యతగా పని చేసే సిబ్బందికి రీవార్డ్స్, ప్రోత్సాహకాలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రజల సమస్యలకు తక్షణ స్పందనతో పాటు, మర్యాదపూర్వకంగా వారి ఫిర్యాదులకు స్పందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో విజిబుల్ పోలీసింగ్, బిట్లు, పెట్రోలింగ్ పగడ్బందీగా నిర్వహిస్తూ నేరాల నియంత్రణకు కృషి చేయాలని సీపీ తెలిపారు. ఇదే క్రమంలో పోలీస్ కమిషనర్ అధికారులతో కలిసి స్టేషన్ ఆవరణలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఇంచార్జ్ ఏసీపీ శ్రీనివాస్, సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, పోత్కపల్లి ఎస్ఐ డి. రమేష్, కాల్వ శ్రీరాంపూర్ ఎస్ ఐ వెంకటేష్, సిసి హరీష్ ఉన్నారు.

తెలంగాణ పెద్దపల్లి

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి 5 రూపాయల 50 పైసలకు ఇటుక సరఫరా

*ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి 5 రూపాయల 50 పైసలకు ఇటుక సరఫరా* *_ధర నిర్ణయంపై ప్రకటన విడుదల చేసిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష_* పెద్దపల్లి, జులై 22, పున్నమి ప్రతినిధి: పెద్దపల్లి జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన ఇటుకలను ఒక్కో ఇటుక 5 రూపాయల 50 పైసలకు సరఫరా చేసేందుకు ఇటుక బట్టీల యాజమానులు నిర్ణయించారని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇటుక బట్టీల యాజమానులతో కలెక్టర్ ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకానికి పెద్దపల్లి జిల్లాలో ఉన్న 102 ఇటుక బట్టీల నుంచి తక్కువ ధరకు ఇటుక సరఫరా చేయాలని వారిని ఒప్పించడం జరిగింది. మొదటి విడత కింద పెద్దపల్లి జిల్లాకు ప్రభుత్వం 9 వేల 421 ఇందిరమ్మ ఇండ్లు కేటాయింపు చేయగా ఇప్పటివరకు 6 వేల 18 ఇండ్లను లబ్ధిదారులకు మంజూరు చేసామని, 3 వేల 847 గృహాలకు మార్కింగ్ చేసి బేస్మెంట్ పనులు జరుగుతున్నాయని అన్నారు. ప్రతి ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి 12, 000 ఇటుకల అవసరం అవుతాయని, ఒక్కో ఇటుక 5 రూపాయల 50 పైసలకు సరఫరా చేసేందుకు జిల్లాలో ఉన్న 102 ఇటుక బట్టీల యాజమాన్యుల సమావేశంలో నిర్ణయించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. పెద్దపల్లి, శ్రీరాంపూర్, పాలకుర్తి, కమాన్ పూర్ మండలాల్లోని లబ్ధిదారులకు పెద్దపల్లి మండలంలో తయారు చేసిన ఇటుక బట్టీల నుంచి, సుల్తానాబాద్, ఓదెల, ఎలిగేడు, జూలపల్లి మండలాల్లోని లబ్ధిదారులకు సుల్తానాబాద్ మండలంలో తయారుచేసిన ఇటుక బట్టీల నుంచి సరఫరా అవుతుందని అన్నారు. ధర్మారం మండలంలోని ఇటుక బట్టీలు ధర్మారం మండలానికి, రామగిరి, రామగుండం మండలాల్లో తయారు అయ్యే ఇటుక బట్టీల నుంచి రామగిరి, మంథని ముత్తారం, మంథని మండలాలకు ఇటుకల సరఫరా అవుతాయని కలెక్టర్ తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం అవసరమైన ఇటుకలను ప్రతి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుడు ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శి ద్వారా ఒకేసారి లిఫ్ట్ చేయుటకు వాహన సంఖ్యతో పర్మిట్ లెటర్ ఎంపీడీవో ద్వారా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వం మంజూరు చేసిన గృహాలను పూర్తి స్థాయిలో త్వరగా నిర్మించుకోవాలని, ఈ ప్రక్రియను పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి, పిడి హౌసింగ్ అధికారులు నిరంతరం పర్యవేక్షించడం జరుగుతుందని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

తెలంగాణ పెద్దపల్లి

రేపటి రాష్ట్ర వ్యాప్త బంద్ ను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ పిలుపు

రేపటి రాష్ట్ర వ్యాప్త బంద్ ను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ పిలుపు మంథని, జులై 22, పున్నమి ప్రతినిధి: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం ఎస్ఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆర్ల సందీప్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని జూలై 23న నిర్వహించే రాష్ట్ర బంద్ ను విజయవంతం చేయడానికి విద్యార్థి లోకమంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి ఎంఈఓ, డీఈవో పోస్టులను భర్తీ చేయాలని,బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని,అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకుల పాఠశాలలకు పక్కా భవనాలు నిర్మించాలి.ఇంటర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయాలని, విద్యార్థులకు ఉచిత బస్సు పాసులు ఇవ్వాలని, ఖాళీగా ఉన్నటువంటి లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలనే డిమాండ్ లతో ఎస్ఎఫ్ఐ, వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త బంద్ కు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విద్యా రంగంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు బందెల రాజకుమార్, నాయకులు రజినీకాంత్, గణేష్, రోహిత్, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు..

తెలంగాణ పెద్దపల్లి

జూలై 24 జాబ్ మేళా నిర్వహణ…. పెద్దపల్లి జిల్లా ఉపాధి అధికారి వై. తిరుపతిరావు

జూలై 24 జాబ్ మేళా నిర్వహణ…. పెద్దపల్లి జిల్లా ఉపాధి అధికారి వై. తిరుపతిరావు పెద్దపల్లి, జులై 19, పున్నమి ప్రతినిధి: నిరుద్యోగ యువతీ, యువకులకు పెద్దపల్లి జిల్లా నందు కృషి విజ్ఞాన్ ఫెర్టిలైజర్ లో ఉద్యోగాలు కల్పించుటకు ఈనెల 24న గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో రూమ్ నెం.225 పైన నందు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వై. తిరుపతి రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కృషి విజ్ఞాన్ ఫెర్టిలైజర్ సంస్థలో (67) పోస్టులకు ఇంటర్యులు నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి పోస్టుల పేరు సేల్స్ ఎక్సిక్యూటివ్ (60) ఫీల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ (04), హెచ్ ఆర్ మేనేజర్స్ (02) ఆఫీస్ బాయ్ (01) లు ఖాళీలు ఉన్నాయని ఇట్టి పోస్టులకు విద్యా అర్హత ఎస్ఎస్సి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ లేదా ఎంబీఏ, ఆపై చదివిన వారు అర్హులని, వీరి వయస్సు 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలు ఉండాలని తెలిపారు. ఇట్టి పోస్టులకు యువతీ, యువకులు అర్హతలని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు జూలై 24న ఉదయం 11 గంటలకు సర్టిఫికేట్స్ జిరాక్స్ లతో సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయం రూమ్ నెం.225 పైన గల జిల్లా ఉపాధి కార్యాలయం, వచ్చి తమ పేరు నమోదు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 9391420932, 8985336947, 8121262441 నందు సంప్రదించాలని జిల్లా ఉపాధి అధికారి వై. తిరుపతిరావు ఆ ప్రకటనలో తెలిపారు.

తెలంగాణ పెద్దపల్లి

ఆగస్టు 5 నుంచి 8 వరకు పెద్దపల్లి కలెక్టరేట్ లో ఆధార్ అప్డేట్ కోసం ప్రత్యేక క్యాంపు ఏర్పాటు…

ఆగస్టు 5 నుంచి 8 వరకు పెద్దపల్లి కలెక్టరేట్ లో ఆధార్ అప్డేట్ కోసం ప్రత్యేక క్యాంపు ఏర్పాటు… పెద్దపల్లి, జులై 18, పున్నమి ప్రతినిధి: ఆగస్టు 5 నుంచి 8 వరకు కలెక్టరేట్ లో ఆధార్ అప్డేట్ కోసం ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నూతనంగా ఆధార్ కార్డు పొందేందుకు మీసేవ ద్వారా అడ్రస్ తో జారీ చేసిన బర్త్ సర్టిఫికెట్, తల్లి లేదా తండ్రి అప్ డేట్ చేసిన ఆధార్ కార్డు ఉండాలని అన్నారు. ఆధార్ కార్డులో అడ్రస్ మార్పు కోసం ఓటర్ ఐడి లేదా పాస్ పోర్ట్ లేదా నివాస సర్టిఫికెట్, బ్యాంకు పుస్తకం/ పోస్టల్ బుక్ తో సహా అటెస్టడ్ దరఖాస్తు ఫారం ఉండాలని కలెక్టర్ తెలిపారు. ఆధార్ కార్డులు పేరు స్పెల్లింగ్ పొరపాట్ల సవరణకు ఓటర్ ఐడి లేదా పాస్ పోర్ట్ లేదా ప్యాన్ కార్డు లేదా ఎస్.ఎస్.సి మార్కుల మెమో లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా మైనర్ ఐతే బర్త్ సర్టిఫికెట్ ఉండాలని, పెళ్లి తర్వాత పేరు మార్పు కోసం సబ్ రిజిస్ట్రార్ జారీ చేసిన మ్యారేజ్ సర్టిఫికెట్, పెళ్లి ఫోటో, ఇతర గుర్తింపు కార్డులు ఉండాలని, పూర్తిగా పేరు మార్పు కోసం గెజిటెడ్ చేసి ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఆధార్ కార్డు లో డేట్ అఫ్ బర్త్ కరెక్షన్ కోసం బర్త్ సర్టిఫికెట్, 21 సంవత్సరాల పైబడిన వారికి ఫోటో తో కూడిన మార్కుల మెమో లేదా ఇండియన్ పాస్పోర్ట్ ఉండాలని అన్నారు. ఆధార్ కార్డు బయోమెట్రిక్ అప్డేట్ కోసం బయట 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని, ఈ క్యాంపులో అవసరం లేదని ఉచితం అన్నారు. ఆధార్ అప్డేషన్ అవసరం ఉన్నవాళ్లు ఈ 15 రోజుల వ్యవధిలో కావలసిన డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవాలని తెలిపారు. కలెక్టరేట్లో ఏర్పాటుచేసే ఆధార్ అప్డేట్ క్యాంపును అవసరమైన ప్రజలు, ఉద్యోగులు వినియోగించుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

తెలంగాణ పెద్దపల్లి

బెస్ట్ అవైలబుల్ స్కూల్ లో ప్రవేశం కొరకు దరఖాస్తుల ఆహ్వానం

బెస్ట్ అవైలబుల్ స్కూల్ లో ప్రవేశం కొరకు దరఖాస్తుల ఆహ్వానం *_పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష_* పెద్దపల్లి, జులై 17, పున్నమి ప్రతినిధి: 2025-26 సంవత్సరానికి గాను బెస్ట్ అవైలబుల్ స్కూల్ లో 3వ, 5వ, తరగతుల్లో ప్రవేశం కొరకు పెద్దపల్లి జిల్లాలోని గిరిజన విద్యార్థినీ, విద్యార్థులు జూలై 26 లోగా దరఖాస్తులు సమర్పించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ నందు జిల్లాకు చెందిన గిరిజన విద్యార్థినీ, విద్యార్థులకు మొత్తము (5) సీట్లు కేటాయించడం జరిగిందని , వీటిలో 3 సీట్లు లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేయబడ్డాయని తెలిపారు. మూడవ తరగతిలో ఎరుకుల బాలురకు ఒకటి, ఐదవ తరగతిలో గోండు నాయక్ బాలురకు ఒక సీట్ పెండింగ్ ఉందని వీటికోసం ప్రస్తుతం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం అర్బన్ ప్రాంతంలో రెండు లక్షలు, రూరల్ ప్రాంతంలో ఒక లక్షా 50 వేలు ఉండాలని, ధ్రువీకరణ పత్రాలు ఆదాయం, కులం, బర్త్, స్టడీ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, పాస్ పోర్ట్ 2 సైజ్ ఫోటోలను జత చేసి పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 26 లోగా కరీంనగర్ జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయంలో సమర్పించాలని, ఇతర వివరాలకు ఫోన్ నెంబరు 9652118867 నందు సంప్రదించాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.