Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: Peddapalli

పెద్దపల్లి

రోడ్లపై పశువులతో ఇబ్బందులు..

అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్రీయ హిందూ పరిషత్ విజ్ఞప్తి పెద్దపల్లి, ఆగస్టు 31: పెద్దపల్లి పట్టణంలోని ప్రధాన రహదారులు, చౌరస్తాలు, వ్యాపార ప్రాంతాల్లో గోవులు విచ్చలవిడిగా సంచరిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాష్ట్రీయ హిందూ పరిషత్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు జాపతి రాజేష్ పటేల్ తెలిపారు. కొంతమంది పశువుల యజమానులు గోవులను కట్టడి చేయకుండా రోడ్లపైకి వదిలేస్తుండటంతో అవి రహదారులపై గుంపులుగా తిరగడం, రోడ్డు మధ్యలో పడుకోవడం జరుగుతోందన్నారు. దీంతో ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు, బస్సుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని పేర్కొన్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో రోడ్డుపై పడుకున్న గోవులు వాహనదారులకు సరిగా కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. పశువులను తప్పించే క్రమంలో వాహనాలు అదుపుతప్పి ప్రజలు, మూగజీవాలు గాయపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్లపై తిరుగుతున్న పశువుల సమస్యపై అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని, పశువుల యజమానులను గుర్తించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. పట్టుబడిన పశువులను సురక్షితంగా పశు సంరక్షణ కేంద్రాలకు తరలించాలని సూచించారు. ప్రధాన రహదారులు, చౌరస్తాలు, ప్రమాదకర ప్రాంతాల్లో రాత్రి వేళల్లో ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు చేయడంతో పాటు, గతంలో పశువుల కారణంగా జరిగిన ప్రమాదాలను పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలని జాపతి రాజేష్ పటేల్ కోరారు. ఈ సమస్యపై జిల్లా కలెక్టర్‌, మున్సిపల్ కమిషనర్‌, ట్రాఫిక్ సీఐలు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని రాష్ట్రీయ హిందూ పరిషత్ తరఫున విజ్ఞప్తి చేశారు.

పెద్దపల్లి

22ఏ జాబితాలో చేర్చే ప్రతి భూమికి స్పష్టమైన ఆధారాలు ఉండాలి

_రెవెన్యూ అధికారులతో సమీక్షించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష_ పెద్దపల్లి, ఆగస్టు 31: 22ఏ నిషేధిత భూములకు సంబంధించిన వ్యవహారాల్లో పూర్తి ఆధారాలు,రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో అదనపు కలెక్టర్ బి. శ్రీరాములుతో కలిసి 22ఏ నిషేధిత భూముల జాబితాపై రెవెన్యూ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 22ఏ భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వస్తున్న ఫిర్యాదులు, భూముల రికార్డుల పరిశీలన, జాబితాలో చేర్చడం, తొలగింపు ప్రక్రియ తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ఏదైనా ప్రైవేట్ భూమి పొరపాటున 22ఏ నిషేధిత జాబితాలో నమోదైనట్లు నిర్ధారణ అయితే, సర్వే నంబర్ వారీగా డిలీటెడ్ లిస్ట్ రూపొందించి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని కలెక్టర్ తెలిపారు. 22ఏ జాబితాలో భూములను చేర్చే సమయంలో అనుసరించే విధానాన్నే తొలగింపు ప్రక్రియలోనూ పాటించాలని సూచించారు. తొలగించే ప్రతి సర్వే నంబర్ కు నిర్దిష్ట కారణాలు, స్పష్టమైన రిమార్క్స్ తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 22ఏ సమస్యలను పారదర్శకంగా, వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ తెలిపారు. 22ఏ భూములకు సంబంధించిన ఫిర్యాదులపై అధికారులు సమన్వయంతో పని చేసి, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ గంగయ్య, తహశీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

పెద్దపల్లి

నీట్-పీజీ పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించిన సీపీ అంబర్ కిషోర్ ఝా

పెద్దపల్లి, ఆగస్టు 30: పెద్దపల్లి పట్టణంలో ఆదివారం నిర్వహించిన నీట్-పీజీ 2026 పరీక్షల సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, పెద్దపల్లి డీసీపీ రాం రెడ్డి తో కలిసి ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తు, భద్రతా ఏర్పాట్లను సీపీ పరిశీలించారు. పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంఖ్య, భద్రతా ఏర్పాట్ల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే, పరీక్షలు ముగిసిన అనంతరం ప్రశ్నపత్రాలు, ఇతర పరీక్షా సామగ్రిని సురక్షితంగా తరలించే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పెద్దపల్లి జోన్ పరిధిలోని మూడు పరీక్షా కేంద్రాల్లో నీట్-పీజీ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పెద్దపల్లి మండలం పెద్దకల్వలలోని మదర్ థెరిస్సా ఇంజనీరింగ్ కళాశాల, పెద్దపల్లిలోని ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల, రామగిరి మండలం సెంటినరీ కాలనీలోని జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ట్రాఫిక్ నిర్వహణతో పాటు పటిష్ఠమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షలు ముగిసిన అనంతరం ప్రశ్నపత్రాలు, ఇతర పరీక్షా సామగ్రిని సురక్షితంగా గమ్యస్థానాలకు తరలించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం అన్ని పరీక్షా కేంద్రాల్లో ప్రశాంత వాతావరణం నెలకొని ఉందని, అభ్యర్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని పోలీస్ కమిషనర్ కోరారు.

పెద్దపల్లి

నీట్‌-పీజీ 2026 పరీక్ష నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు

పెద్దపల్లి, ఆగస్టు 29: ఆగస్టు 30న జిల్లాలో నిర్వహించనున్న నీట్‌-పీజీ 2026 పరీక్షను ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. శనివారం డీసీపీ రామ్ రెడ్డితో కలిసి పెద్దపల్లి మండలం పెద్దకల్వలలోని మదర్ థెరిస్సా ఇంజనీరింగ్ కళాశాల, పెద్దపల్లిలోని బండారికుంట సమీపంలోని ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల, రామగిరి మండలం సెంటినరీ కాలనీలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్షా ఏర్పాట్లను పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ నీట్‌-పీజీ 2026 పరీక్ష ఆగస్టు 30న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. అభ్యర్థులను ఉదయం 7:30 గంటల నుంచి 8:45 గంటల వరకు మాత్రమే పరీక్షా హాల్లోకి అనుమతిస్తామని చెప్పారు. అభ్యర్థులు తప్పనిసరిగా ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డుతో పాటు ఒరిజినల్ పర్మినెంట్/ప్రొవిజనల్ ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్, దాని స్వీయ ధ్రువీకరించిన జిరాక్స్ కాపీని వెంట తెచ్చుకోవాలని సూచించారు. అడ్మిట్ కార్డును నిర్దేశిత విధంగా ఒకే ఏ4 పేపర్‌ పై కలర్‌లో బ్యాక్‌-టు-బ్యాక్ ప్రింట్ చేసుకోవాలని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని టీజీఎన్‌సీడీసీఎల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో హెల్త్ అసిస్టెంట్లను ఏర్పాటు చేసి అవసరమైన వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచాలని డీఎంహెచ్‌ఓ కు సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా చూడాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీ నిఘా, మొబైల్ జామర్లు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి అభ్యర్థికి హెచ్.హెచ్.ఎం.డీ, మాన్యువల్ బాడీ ఫ్రిస్కింగ్ నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. రిజిస్ట్రేషన్ సమయంలో ఆధార్ ధృవీకరణ, ఫోటో, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, ఫేస్ కంపారిజన్, బార్‌కోడ్ స్కానింగ్ వంటి నిర్దేశిత ప్రక్రియలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. ఎలక్ట్రానిక్ వస్తువులు, గడియారాలు, ఆభరణాలు, షూస్ పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరాదని స్పష్టం చేశారు. పరీక్షా పర్యవేక్షణ కోసం జిల్లాలో రెండు ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రశ్నపత్రం ఐదు టైమ్‌-బౌండ్ సెక్షన్లుగా ఉండి, ఒక్కో సెక్షన్‌కు 42 నిమిషాల సమయం ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్థులకు వాటర్ బాటిల్ అందిస్తామని, రఫ్ షీట్, పెన్ అందించబడవని తెలిపారు. పరీక్ష ప్రారంభానికి ముందు రిజిస్ట్రేషన్ పూర్తైన అనంతరం అభ్యర్థులకు బయో బ్రేక్‌లకు అనుమతి ఉండదని తెలిపారు. సంబంధిత అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ పరీక్షను విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లో అమలు చేయాల్సిన అన్ని నిబంధనలను అధికారులు, పరీక్షా సిబ్బంది కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన మౌలిక సదుపాయాలను సిద్ధంగా ఉంచాలని, పరీక్షా నిర్వహణలో ఎలాంటి లోపాలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య, తహశీల్దార్ రాజయ్య, సుల్తానాబాద్ తహశీల్దార్ బషీరుద్దీన్, రామగిరి తహశీల్దార్ సుమన్, పరీక్షా కేంద్రాల నిర్వాహకులు, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Blog E-పేపర్ Featured Others ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ తెలంగాణ పశ్చిమ గోదావరి పిల్లలకు విద్య విజ్ఞానం

APSET–2025 నోటిఫికేషన్ విడుదల

APSET–2025 నోటిఫికేషన్ విడుదల యూనివర్సిటీలలో & డిగ్రీ కాలేజీలలో లెక్చరర్ / అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకాలు, పదోన్నతుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్హత పరీక్ష APSET 2025 ను ప్రభుత్వం తరఫున ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహించనుంది. పరీక్ష తేదీలు (ఆన్‌లైన్):➡️ 28 & 29 మార్చి 2026 ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ:➡️ 09 జనవరి 2026 దరఖాస్తు ఫీజు:🔹 జనరల్: ₹1600/-🔹 BC / EWS: ₹1300/-🔹 SC / ST / PwD / థర్డ్ జెండర్: ₹900/- అర్హత, సిలబస్, పరీక్ష కేంద్రాలు, లేట్ ఫీజు వివరాలు తదితర సమాచారం కోసం: www.andhrauniversity.edu.inwww.apset.net.in

పెద్దపల్లి

గంగాపురి: మల్లెపూల హనుమాన్ ఆలయం నూతన కార్యవర్గం ఎన్నిక

మంథని, ఆగస్టు 16: పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలోని గంగాపురిలోని మల్లెపూల హనుమాన్ దేవాలయ నూతన అధ్యక్షుడిగా శనివారం బత్తుల సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా గోరంట్ల సుధాకర్, ప్రధాన కార్యదర్శిగా పుల్లే రవీందర్, కోశాధికారిగా పుల్లె రాధాకృష్ణ, సంయుక్త కార్యదర్శిగా బండి రవి లను ఎన్నుకున్నారు. ఈ కమిటీ రెండు సంవత్సరాల కాలపరిమితి 14 ఆగస్టు 2025 నుండి 14 ఆగస్టు 2027 వరకు కొనసాగుతుందని, ఈ కమిటీకి పద్మశాలి కులస్తులందరూ సహకరించినందుకు పద్మశాలి సంఘంకు నూతన కార్యవర్గం కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గంగాపురి మల్లెపూల హనుమాన్ దేవాలయ నూతన కమిటీ అధ్యక్షులు బత్తుల సత్యనారాయణ మాట్లాడుతూ.. తమకు ఈ ఆలయ బాధ్యతలు నమ్మకంతో అప్పగించినందుకు, తమ బాధ్యతను శిరసా వహిస్తూ, అందరి నమ్మకాన్ని వమ్ము చేయమని, తమ కార్యవర్గం దేవాలయ అభివృద్ధి కోసం పాటు పడతామని నూతన దేవాలయ కార్యవర్గం తెలియజేశారు.

పెద్దపల్లి

తెలంగాణ రాష్ట్ర స్థాయిలో బంగారు పతకం సాధించిన పోలీస్ డాగ్

రామగుండం పోలీస్ కమీషనరేట్ నార్కోటిక్ డాగ్ “సింబా” ఎంపిక రామగుండం, ఆగస్టు 04, పున్నమి ప్రతినిధి: వరంగల్ జిల్లా మమునూరు పిటిసిలో జరిగిన తెలంగాణ రాష్ట్ర రెండవ పోలీస్ డ్యూటీ మీట్ లో కాళేశ్వరం జోన్ నుండి నార్కోటిక్ డాగ్ విభాగం పోటీలో పాల్గొనీ గంజాయి, మత్తు పదార్థాలను గుర్తించడం లో పోలీసు జాగిలం సింబా, డాగ్ హ్యాండ్లర్ ఏ ఆర్ హెడ్ కానిస్టేబుల్ ఎం. వేణుగోపాల్ కృష్ణ గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. అదేవిదంగా రాష్ట్ర స్థాయిలో ఉత్తమ పోలీస్ డాగ్ గా “సింబా” ఎంపిక కావడం జరిగింది. సోమవారం రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా తమ కార్యాలయంలో నార్కోటిక్ డాగ్ సింబా, డాగ్ హాండ్లర్ ను అభినందించడం జరిగింది. 2026 సంవత్సరం ఫిబ్రవరిలో పూణేలో జరిగే నేషనల్ పోలీసు డ్యూటీ మీట్ లో పాల్గొని మరిన్ని పతకాలు సాధించాలని తెలంగాణ రాష్ట్రానికి, రామగుండం పోలీస్ కమీషనరేట్ కి మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్, పెద్దపల్లి డీసీపీ పి. కరుణాకర్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఆర్ఐ లు దామోదర్, శ్రీనివాస్, వామన మూర్తి, సంపత్, మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.

పెద్దపల్లి

ఉచిత చేప పిల్లల పంపిణీకి బదులుగా నగదు పంపిణీ చేయాలి

*ఈ ఏడాదైనా నాణ్యమైన చేప పిల్లలను సరైన సమయంలో అందించాలి* *రాష్ట్ర ఫిషరీస్ ఛైర్మన్ కు పెద్దపల్లి జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ల వినతి పత్రం* *_మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పెద్దపల్లి జిల్లా డైరెక్టర్ పోతరవేని క్రాంతి కుమార్_* మంథని/ హైదరాబాద్, ఆగస్టు 01, పున్నమి ప్రతినిధి: ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంలో నాసిరకం చేప పిల్లలను ఆలస్యంగా అందడం వలన, చేపలు పెరగక మత్స్య కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పెద్దపల్లి జిల్లా డైరెక్టర్ పోతరవేని క్రాంతి కుమార్ అన్నారు. హైదరాబాద్ లోని రాష్ట్ర ఫిషరీస్ కార్యాలయంలో ఛైర్మన్ మెట్టు సాయి కుమార్ ను శుక్రవారం మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పెద్దపల్లి జిల్లా డైరెక్టర్లు కలిశారు. ఈ క్రమంలో ఆయనకు మత్స్య కార్మికుల పలు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంలో గత ఏడాది నాసిరకం చేప పిల్లలను చాలా ఆలస్యంగా ఇవ్వడంతో, రాష్ట్ర వ్యాప్తంగా వాటిని తిరిగి వెనక్కి పంపడం జరిగిందనీ గుర్తు చేశారు. ఈ ఏడాదైనా నాణ్యమైన పెద్ద చేప పిల్లలను, సరైన సమయంలో అందించాలని వినతి పత్రంలో కోరినట్లు తెలిపారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మత్స్య కార్మికులకు ఉచిత చేప పిల్లల పంపిణీకి బదులుగా, నగదు పంపిణీ కార్యక్రమం చేపడతామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పథకాలు పెట్టీ మత్స్యకారులకు తోడుగా ఉండాలని వారు కోరారు. సమస్యల పైన రాష్ట్ర ఫిషరీస్ ఛైర్మన్ సానుకూలంగా స్పందిస్తూ గత యేడాది జరిగిన తప్పులు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకొని మత్స్య కార్మికులకు కొత్త పథకాలు పెట్టీ ప్రోత్స్యహిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా డైరెక్టర్స్ పోతరవేని క్రాంతి కుమార్, అయిలావేని వీరాస్వామి, పెద్దపల్లి సుజాత పోచయ్య, చిట్ల శ్రీనివాస్, తాళ్ళ తిరుపతి, రేళ్ళ కోటయ్య, బోయిరి శ్రీకాంత్, పొలవేని మొండయ్య, మాజీ వైస్ ఎంపీపీ పిట్టల రవి కుమార్, పాల్గొన్నారు.

పెద్దపల్లి

ప్రతి స్కూల్ బస్సులోను తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలను అమర్చాలి.

*డ్రైవర్స్ ఏ చిన్న తప్పు చేసినా.. స్కూల్ యాజమాన్యందే బాధ్యత.* *ప్రతి స్కూల్ బస్సులోను తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలను అమర్చాలి.* *_పెద్దపల్లి డీసీపీ కరుణాకర్_* రామగుండం, జులై 30, పున్నమి ప్రతినిధి:  పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని అడ్డగుంటపల్లి లోని ఆద్య బ్యాంకెట్ హాల్ లో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనా రెడ్డి ఆధ్వర్యంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్, గోదావరిఖని సబ్ డివిజన్ పరిధిలోని స్కూల్, కళాశాల యజమానులు, బస్ డ్రైవర్లకు బుధవారం అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ లు ముఖ్య అతిథులుగా హాజరై, పలు ఆదేశాలు, సూచనలు చేశారు. స్కూల్, కళాశాలల యాజమాన్యాలు నైపుణ్యం గల డ్రైవర్లను నియమించుకోవాలని, పిల్లలను బస్సు ఎక్కించేటప్పుడు, దించేటప్పుడు నిర్దేశించిన ప్రదేశాల్లో మాత్రమే బస్సులను నిలుపుదల చేయాలన్నారు. డ్రైవర్లు ఓవర్ టేకింగ్ చేయవద్దని సూచించారు. బస్సు డ్రైవర్లు మద్యం సేవించి, సెల్ఫోన్లు ఉపయోగించినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బస్ లలో ఫస్ట్ ఎయిడ్ కిట్, ఫైర్ సిలిండర్ తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలన్నారు. బస్సులో సీట్లకు సరిపడా విద్యార్థులను మాత్రమే తీసుకెళ్లాలని డీసీపీ పేర్కొన్నారు. స్కూల్ బస్సు డ్రైవర్ లకు పోలీస్ వారి తరుపున ముఖ్యమైన సూచనలు చేశారు. పిల్లల భద్రత కోసం డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలను పాటించాలని, విద్యార్థులను ఎక్కించేటప్పుడు, బస్సు దించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, బస్సును క్రమం తప్పకుండా ప్రతి రోజూ తనిఖీ చేయాలని తెలిపారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద, మూల మలుపుల వద్ద, ప్రధాన కూడల్ల వద్ద వేగాన్ని నియంత్రించాలని, విద్యార్థుల భద్రత కోసం బస్  పూర్తిగా ఆగిన తరువాత పిల్లలను ఎక్కించడం, దించడం కోసం ఒక వ్యక్తిని విద్యార్థులకు సహాయంగా ఏర్పాటు చేయాలని, టైర్లు, బ్రేక్లు, ఇతర ముఖ్యమైన భాగాలను పరిశీలించాలని, ఏవైనా సమస్యలు ఉంటే, వాటిని యాజమాన్యం కు చెప్పి వెంటనే పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులను అప్రమత్తంగా ఉంచడం కోసం విద్యార్థులకు బస్సు భద్రతా నియమాల గురించి అవగాహన కల్పించాలని, బస్సులో ప్రవర్తన ఎలా ఉండాలో వారికి చెప్పాలని కోరారు. విద్యార్థులు బస్సులో సురక్షితంగా ప్రయాణించేందుకు బాధ్యత వహించాలనే విషయం గుర్తుంచుకోవాలని, మొదటగా ప్రథమ చికిత్స కిట్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలని,  బస్సులో అగ్నిమాపక యంత్రం అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. డ్రైవింగ్ చేసేటప్పుడు ఎటువంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉండాలని, సమయపాలన పాటిస్తూ సమయానికి బస్సును నడపడానికి ప్రయత్నించాలని, విద్యార్థులతో ఓపిక, సహనంగా ఉంటూ మంచి ప్రవర్తనతో ఉండాలని, పిల్లలకు ఏదైనా సమస్య తలెత్తితే, దానిని పరిష్కరించడానికి, యాజమాన్యం, తల్లితండ్రుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోసం ప్రయత్నించాలని, అవసరమైనప్పుడు తగినంత విశ్రాంతి తీసుకోవాలని, బస్సులో భద్రత ప్రాముఖ్యతను విద్యార్థులకు అవగాహన కల్పించాలని పలు కీలక సూచనలు చేశారు. డ్రైవర్లు మద్యం మత్తులో స్కూల్ బస్సులు నడిపినట్లు గుర్తిస్తే అలాంటి వారిపై ఎట్టి పరిస్థితుల ఉపేక్షించేది లేదని కఠిన చర్యలు తీసుకుంటామని, ఏదైనా ప్రమాదం జరిగితే స్కూల్ యాజమాన్యం పైన కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదానికి కారణమైన వ్యక్తులపై నమోదు చేయు కేసులు, శిక్షల గురించి వివరించారు. అతివేగంగా అజాగ్రత్తగా వాహనాన్ని నడిపి ప్రమాదానికి గురి చేయడం వలన మరణం సంభవిస్తే – 106(1) BNS [304-A IPC], సిగ్నల్ జంప్ చేసిన సందర్భం, రాంగ్ రూట్ లో వెళ్ళిన సందర్భంలో మరణం సంభవిస్తే, బలమైన సందర్భంలో – 105 BNS [304(ii) IPC], అతివేగంగా అజాగ్రత్తగా వాహనాలు నడిపి ఒక వ్యక్తికి – సాధారణ గాయాలు అయిన సందర్భంలో – 125(a) BNS [337 IPC], బలమైన గాయాలు అయిన సందర్భంలో –  125(b) BNS [338 IPC], పట్టణ ప్రాంతంలో, రద్దీ ప్రదేశాలలో, సాధారణ సమయంలో అతివేగంగా అజాగ్రత్తగా వాహనాలు  నడిపినచో సాధారణ గాయాలు అయిన సందర్భంలో – 125 BNS [336 IPC], బలమైన గాయాలు అయిన సందర్భంలో – 281 BNS [279 IPC], మైనర్ కి వాహనం ఇచ్చి ప్రమాదానికి గురి చేసినట్లయితే – 180 MV Act, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపినట్లయితే – 3 r/w 181 MV Act, మద్యం తాగి వాహనం నడినట్లయితే – 185 MV Act, ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపినట్లు అయితే – 196 MV Act, సెక్షన్ల ప్రకారం చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని వివరించారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసిపి ఎం. రమేష్, గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, గోదావరిఖని టూ టౌన్ ఇన్స్పెక్టర్ ప్రసాదరావు, మంథని సీఐ రాజు, రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మధు, గోదావరిఖని వన్ టౌన్ ఎస్ఐలు రమేష్, భూమేష్ అనూష, ఎన్టిపిసి ఎస్ఐ ఉదయ్ కిరణ్, రామగుండం ఎస్ఐ సంధ్యారాణి, అంతర్గాం ఎస్సై వెంకటేష్, కమాన్పూర్ ఎస్సై ప్రసాద్, రామగిరి ఎస్సై శ్రీనివాస్, మంథని ఎస్ఐ రమేష్, ముత్తారం ఎస్సై నరేష్, స్కూల్స్ కళాశాల ప్రిన్సిపల్స్, డ్రైవర్స్, తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ పెద్దపల్లి

*కార్మికుల హక్కుల కోసం రాజీ లేని పోరాటాలు నిర్వహించాలి*

*ఘనంగా మంథని మున్సిపాలిటీ నాలుగవ మహాసభలు* *కార్మికుల హక్కుల కోసం రాజిలేని పోరాటాలు నిర్వహించాలి* మంథని, జులై 29, పున్నమి ప్రతినిధి: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని ఫ్రెండ్స్ క్లబ్ లో మంథని మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ యూనియన్ నాలుగవ మహాసభ మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో సీనియర్ మున్సిపల్ కార్మికుడు వడ్లకొండ రాజయ్య జండా ఆవిష్కరణ చేశారు. ఈ మహాసభలకు ముఖ్యఅతిథిగా హాజరైన సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు మాట్లాడుతూ మంథని మున్సిపాలిటీ కార్మికులు స్థానికంగా ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై పోరాటాలు నిర్వహించి సమస్యలను పరిష్కరించుకున్నారని ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై రాజీ లేని పోరాటాలు నిర్వహించారని గుర్తు చేశారు. అదే పోరాట స్ఫూర్తితో రానున్న కాలంలో మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికై రాజీ లేని పోరాటాలు నిర్వహించాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యదర్శి శ్రావణపల్లి వెంకటస్వామి, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్ పాల్గొనగా, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఆర్ల సందీప్, కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు మంథని లింగయ్య సహార్థ సందేశం ఇవ్వగా, మున్సిపల్ కార్మికులు గడిపెళ్లి మల్లేష్, చిప్పకుర్తి చందు, సింగారపు గట్టయ్య, భాగ్య, పోచమ్మ, తదితరులు పాల్గొన్నారు.