ఉపాధ్యాయులను సన్మానించిన కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి, సెప్టెంబర్ 05:
ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను శనివారం పెద్దపల్లి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొని ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులను శాలువాలు, పుష్పగుచ్ఛాలతో సన్మానించి, అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ 40 సంవత్సరాల క్రితం ఉన్న విద్యా వ్యవస్థకు, నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన యుగంలోని విద్యా వ్యవస్థకు ఎంతో తేడా ఉందని అన్నారు. వ్యవస్థ చాలా వేగంగా మారుతున్న నేపథ్యంలో మనం కూడా అందుకు అనుగుణంగా మారాల్సిన అవసరం ఉందని తెలిపారు. గత రెండున్నర సంవత్సరాలుగా జిల్లాలో వ్యక్తులపై ఆధారపడకుండా, వ్యవస్థ ఆధారంగా పనిచేసేలా విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే తమ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఎవరు ఉన్నా, లేకపోయినా వ్యవస్థ బలంగా, సమర్థవంతంగా పనిచేసేలా విధానాలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తాము ఎప్పుడూ కేవలం నంబర్లు, ర్యాంకుల కోసం ప్రయత్నించలేదని, ప్రక్రియను బలోపేతం చేయడంపైనే ప్రధానంగా దృష్టి సారించామని తెలిపారు. ప్రక్రియ సక్రమంగా ఉంటే ఫలితాలు, ర్యాంకులు సహజంగానే వస్తాయని పేర్కొన్నారు.
గత రెండున్నర సంవత్సరాలుగా జిల్లాలోని పలువురు ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులు, ఉపాధ్యాయులతో నిరంతరం చర్చిస్తూ విద్యా వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. అందరి సమష్టి కృషి, సహకారంతో వ్యక్తులతో సంబంధం లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేసి మంచి ఫలితాలు సాధించగలిగామని అన్నారు. గత రెండున్నర సంవత్సరాలుగా విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు సహకరించిన ఉపాధ్యాయులందరికీ ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అవార్డులు అందుకున్న ప్రతి ఒక్కరినీ ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థుల్లో మంచి విలువలు, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన ప్రవర్తన పెంపొందించడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఉపాధ్యాయులు తమ బోధనా విధానాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని సూచించారు.
అనంతరం ఉత్తమ సేవలు అందించిన 58 ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్ శాలువాలు, పుష్పగుచ్ఛాలతో సన్మానించి, అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి జి. శారద, అకాడమిక్ మానిటరింగ్ అధికారి పిఎం. షేక్, సెక్టోరియల్ అధికారి, మల్లేశం మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

