Sunday, 27 September 2026

Tag: B V APPALANAIDU

అల్లూరి సీతారామరాజు

బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం : అరకు ఎస్ఐ

బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, వాటివల్ల యువత శారీరక, మానసిక సమస్యలకు లోనవుతారని అరకులోయ ఎస్‌ఐ టి. మల్లేశ్వరరావు అన్నారు. మంగళవారం స్ధానిక కేజీబీవీ పాఠశాల విద్యార్థినులకు మహిళల భద్రత, బాల్యవివాహాలు, సైబర్ క్రైమ్‌ లపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఎస్ఐ మాట్లాడారు. సైబర్ నేరగాళ్లు పంపే వాట్సాప్ లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సోషల్ మీడియా సీఐ రమణ సూచించారు. విద్యార్థినులు చదువుపై శ్రద్ధ పెట్టాలని కోరారు.

అల్లూరి సీతారామరాజు

అరకు: చొంపి కొత్తవలసలో ప్రమాదకరంగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్

అరకులోయ మండలం చొంపి పంచాయతీ కొత్తవలస గ్రామంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రమాదకరంగా మారిందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫ్యూజ్ బాక్స్ వైర్లు పిల్లలకు అందేలా ఉండటంతో ప్రమాదం పొంచి ఉందన్నారు. రక్షణ కంచ లేకపోవడంతో వాహనదారులు, విద్యార్థులు, రైతులు భయాందోళన చెందుతున్నారు. తరచూ షార్ట్‌సర్క్యూట్‌తో నిప్పురవ్వలు వస్తున్నాయని తెలిపారు. వాలిపోయిన విద్యుత్ స్తంభాన్ని సరిచేసి, ట్రాన్స్‌ఫార్మర్‌కు రక్షణ కంచ ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ అధికారులను కోరారు.

అల్లూరి సీతారామరాజు

100 శాతం ఉద్యోగ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలి : ఆదివాసీ గిరిజన సంఘం

ఏజెన్సీ ప్రాంతాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ నియామకాలకు 100 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర, జిల్లా ప్రధాన కార్యదర్శులు కిల్లో సురేంద్ర, పొద్దు బాలదేవ్ లు డిమాండ్ చేశారు. మంగళవారం వారు అరకులోయ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. చట్టం అమల్లోకి వచ్చే వరకు ఉద్యోగ నోటిఫికేషన్లు నిలిపివేయాలని, 1/70 చట్టం పరిరక్షణకు సుప్రీంకోర్టులో వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అరకు మండల కార్యదర్శి జి.బుజ్జిబాబు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

అరకు: విద్యార్ధినిలతో నషా ముక్త్ భారత్ ప్రతిజ్ఞ

అరకులోయ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డా. ఆర్. కుసుమ కుమారి అధ్యక్షతన, ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం నషా ముక్త్ భారత్ ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. మాదకద్రవ్యాల వినియోగం ఆరోగ్యం, కుటుంబం, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ప్రిన్సిపాల్ తెలిపారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. అనంతరం ప్రిన్సిపాల్, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థినులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి సమాజాన్ని నషా రహితంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ పీఓ సిహెచ్. మురళీకృష్ణ, సభ్యులు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

అరకు: మాడగడ లో మొక్కలు పంపిణీ

అరకులోయ మండలం, మాడగడ పంచాయితీ గ్రామాలలో వీబీ జీ రాం జీ పథకంలో సిల్వర్ ఓక్, నేరేడు, వెదురు, సీతాఫలం మొక్కలు పంపిణీ చేశారు. సోమవారం మాడగడ పంచాయితీలో 174 మంది రైతులకు మొక్కలు పంపిణీ చేసినట్లు ఏపీఓ జగదీశ్వరరావు తెలిపారు. చాలా గ్రామాలలో ఇప్పటికే మొక్కలు అందుకున్న రైతులు వాటిని నాటుకుంటున్నారని ఏపీఓ చెప్పారు.

అల్లూరి సీతారామరాజు

భార్య మృతి కేసులో భర్త అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు

డుంబ్రిగూడ మండలం, కొర్ర పంచాయతీ, సెట్టిబంద గ్రామంలో కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యపై భర్త కర్రతో దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలై మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను అరకు సీఐ కోటేశ్వరరావు సోమవారం వెల్లడించారు. ఘటనపై డుంబ్రిగూడ పోలీస్‌స్టేషన్‌లో క్రైం నం.40/2026 కింద BNS సెక్షన్లు 103(1), 351(2) ప్రకారం కేసు నమోదైంది. నిందితుడు గెమ్మెలి కామయ్య అలియాస్ కామేశ్వరరావు (40)ను పోలీసులు ఆగస్టు 17న అరెస్ట్ చేసి, వైద్య పరీక్షల అనంతరం న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.

అల్లూరి సీతారామరాజు

అరకు: బట్టివలస గ్రామ సమస్యలపై పీజీఆర్‌ఎస్‌లో వినతి

అరకులోయ మండలం, మాదల పంచాయతీ బట్టివలస గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీడీపీ నేత సివేరి ప్రశాంత్‌కుమార్ అరకు ఎంపీడీఓ వీసం ప్రసాద్ కు పీజీఆర్‌ఎస్‌లో వినతిపత్రం అందజేశారు. హెల్త్ సబ్‌సెంటర్ భవనం మరమ్మతులు, డ్రైనేజీ సమస్య పరిష్కారం, పాఠశాల భవనం మరమ్మతులు చేపట్టాలని కోరారు. స్పందించిన ఎంపీడీఓ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ అభిమాన్, గ్రామస్థులు సివేరి అప్పలరాజు, సివేరి అప్పలనాయుడు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

ప్రతి ఇంటికీ మంచి చేశాం : డా దొన్నుదొర

కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాల ద్వారా మేలు చేసిందని టీడీపీ అరకు ఇన్‌చార్జి, ఆర్టీసీ విజయనగరం జోన్‌ చైర్మన్‌ డా. సియ్యారి దొన్నుదొర అన్నారు. సోమవారం అరకులోయ మండలం, బస్కీ, అనంతగిరి మండలం, ఎగువశోభ గ్రామాల్లో చేపట్టిన ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేసి, ప్రభుత్వ పథకాల ద్వారా అందుతున్న ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. గిరిజన ప్రాంతాల్లో రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.

అల్లూరి సీతారామరాజు

పాడేరులో నెలాఖరున భారీ జాబ్ మేళా : అరకు ఎస్ఐ

ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన నిరుద్యోగ యువతకు ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెలాఖరులో పాడేరులో భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు అరకులోయ ఎస్‌ఐ టి. మల్లేశ్వరరావు తెలిపారు. జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. 35 ఏళ్లలోపు వయసు కలిగి, అర్హత ఉన్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని ఎస్‌ఐ కోరారు.

అల్లూరి సీతారామరాజు

అరకు: మాదల పీజీఆర్ఎస్‌కు 30 వినతులు

అరకులోయ మండలం మాదల గ్రామపంచాయతీలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహించారు. జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ నిశాంతి టి., ఐఏఎస్ ఆదేశాల మేరకు జరిగిన కార్యక్రమంలో ఎంపీడీఓ వీసం ప్రసాద్, తహసీల్దార్ జి. రాజా శ్రీధర్, ఎంఈఓ భారతిరత్నం, డీటీడబ్ల్యూ వెంకట్రావు, ఐసీడీఎస్ సూపర్వైజర్ స్వర్ణలత, పీడీఓ కే. శైలజ పాల్గొన్నారు. ప్రజల నుంచి మొత్తం 30 వినతులు అందాయి. వీటిలో ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్–5, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్–5, ఆర్‌డబ్ల్యుఎస్‌ఎస్–4, స్పెషల్ మైనర్ ఇరిగేషన్–3, స్కూల్ ఎడ్యుకేషన్–2, సివిల్ సప్లైస్–2, విద్యుత్ శాఖ–3, వ్యవసాయ శాఖ–3, రెవెన్యూ–2, పంచాయతీరాజ్–3 ఉన్నాయి. వినతులను సంబంధిత శాఖలకు పంపించి సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులు ఆదేశించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.