మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేయాలి జిల్లాలో 244 పంచాయతీలు, 2,446 పోలింగ్ కేంద్రాలు.
పాడేరు, నవంబర్ 12: రాష్ట్రంలో రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలు–2026 నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ సమావేశంలో అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ టి. నిశాంతి, ఐఏఎస్ పాల్గొని జిల్లాలో ఎన్నికల సన్నద్ధతను వివరించారు. జిల్లాలోని 11 మండలాల్లో 244 గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వీటిలో 239 షెడ్యూల్డ్, ఐదు నాన్ షెడ్యూల్డ్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మొత్తం 244 సర్పంచ్, 2,446 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, 4,98,467 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొదటి విడతలో కోయ్యూరు, జి.కె.వీధి, చింతపల్లి మండలాల్లోని 66 పంచాయతీలకు నవంబర్ 26న, రెండో విడతలో అనంతగిరి, జి.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లోని 87 పంచాయతీలకు నవంబర్ 29న, మూడో విడతలో అరకు, డుంబ్రిగూడ, హుకుంపేట, పాడేరు మండలాల్లోని 91 పంచాయతీలకు డిసెంబర్ 2న పోలింగ్ నిర్వహించనున్నట్లు వివరించారు. ఇందుకోసం మొత్తం 2,446 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల సిబ్బంది నియామకం, శిక్షణ, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఎన్నికల సామగ్రి పంపిణీ, రవాణా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కలెక్టర్ తెలిపారు. మారుమూల గిరిజన ప్రాంతాల భౌగోళిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సిబ్బంది, ఎన్నికల సామగ్రి తరలింపునకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి భద్రతా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కఠినంగా అమలు చేసేందుకు మండలాల వారీగా పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నగదు, బహుమతులు, మద్యం పంపిణీ, ఓటర్లను బెదిరించడం వంటి చర్యలను అడ్డుకుంటామని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.









