Saturday, 26 September 2026

Tag: ఎలమంచిలి

అనకాపల్లి

మహిళలపై ఆన్‌లైన్ వేధింపులపై అవగాహన.. అప్రమత్తతే రక్షణ!

మహిళలపై ఆన్‌లైన్ వేధింపులపై అవగాహన.. అప్రమత్తతే రక్షణ! ఎలమంచిలి, ఆగస్టు 19 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): ఎలమంచిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళలపై జరుగుతున్న ఆన్‌లైన్ వేధింపులపై బుధవారం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఉమెన్ ఎంపవర్‌మెంట్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సోషల్ మీడియా ద్వారా మహిళలు, యువతులు ఎదుర్కొంటున్న సైబర్ వేధింపులు, అశ్లీల సందేశాలు, బెదిరింపులపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. ఉమెన్ ఎంపవర్‌మెంట్ సెల్ కన్వీనర్ డా. కె. సుజాత, ఇంగ్లీష్ అధ్యాపకురాలు డా. పద్మప్రియ మాట్లాడుతూ సాంకేతికత పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయని తెలిపారు. వ్యక్తిగత వివరాలను సోషల్ మీడియాలో పంచుకునే విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వేధింపులు ఎదురైతే భయపడకుండా సైబర్ క్రైమ్ పోలీసులకు లేదా దిశ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. కంప్యూటర్ అధ్యాపకులు దేవి, సంధ్య డిజిటల్ భద్రత, ప్రైవసీ సెట్టింగులపై వివరించారు. కార్యక్రమంలో రాజేశ్వరి, మహిళా అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

అనకాపల్లి

ఎస్సీ యువతకు ఉచిత డొమైన్ శిక్షణ.. శిక్షణ అనంతరం ఉద్యోగావకాశాలు!

విశాఖపట్నం: ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు చెందిన ఎస్సీ యువతీ, యువకులకు 6 డొమైన్లలో ఉచిత శిక్షణ అందించనున్నట్లు అధికారులు తెలిపారు. 10వ తరగతి పాస్ లేదా ఫెయిల్, ఇంటర్మీడియట్, డిగ్రీ చదివిన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. శిక్షణ పొందే వారికి ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పించడంతో పాటు, శిక్షణ పూర్తయిన అనంతరం ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న యువత వెంటనే ఎస్సీ కార్పొరేషన్‌ను సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: 6303204314, 8317559817, 9866306567

అనకాపల్లి

తేరువుపల్లిలో ‘ఇంటింటా తెలుగుదేశం’.. కూటమి ప్రభుత్వ అభివృద్ధిపై విస్తృత ప్రచారం

ఎలమంచిలి, ఆగస్టు 19 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): ఎలమంచిలి మున్సిపాలిటీ 3వ వార్డు పరిధిలోని తేరువుపల్లి గ్రామంలో ‘ఇంటింటా తెలుగుదేశం’ కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు, కార్యకర్తలు విజయవంతంగా నిర్వహించారు. బూత్ నంబర్లు 66, 67 పరిధిలో ప్రతి ఇంటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. రోడ్లు, డ్రైనేజీ పనులు, భోగాపురం ఎయిర్‌పోర్టు, పోలవరం ప్రాజెక్టు వంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు తల్లికి వందనం, ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్‌, అన్నదాత సుఖీభవ, శ్రీశక్తి, అన్న క్యాంటీన్లు, దీపం-2 వంటి సంక్షేమ పథకాల వివరాలతో కూడిన కరపత్రాలను ఇంటింటికీ అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు గొర్లె శివన్నారాయణ మూర్తి (నానాజీ), క్లస్టర్‌ ఇన్‌చార్జి కరణం రవికుమార్‌, ఏవీఎస్‌ నాయుడు, వార్డు అధ్యక్షుడు పిల్ల గంగాధర్‌, సెక్రటరీ తుంపాల గంగాధర్‌, తుంపాల కోటిపల్లి నాయుడు, గేదెల అప్పలనాయుడు, పిల్ల సత్యనారాయణ, గళ్ళ నూకినాయుడు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన కల్పించడమే కార్యక్రమం లక్ష్యమని నాయకులు తెలిపారు.

అనకాపల్లి

548 మందికి ఉచిత వస్తి కర్మ చికిత్స.. ఆయుర్వేద రంగంలో ప్రపంచ రికార్డు

అనకాపల్లి, ఆగస్టు 19 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): అనకాపల్లి జిల్లా కొడూరు గ్రామంలోని ఆరోగ్యధాత్రి ఆయుర్వేద రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో నిర్వహించిన మెగా ఆయుర్వేద వైద్య శిబిరం చారిత్రాత్మకంగా నిలిచింది. చరక జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆగస్టు 16 నుంచి 18 వరకు నిర్వహించిన శిబిరంలో 548 మంది రోగులకు ఉచితంగా వస్తి కర్మ చికిత్స అందించారు. వస్తి కర్మతో పాటు విద్ధ కర్మ, అగ్ని కర్మ వంటి ప్రత్యేక ఆయుర్వేద చికిత్సలను కూడా ఉచితంగా అందించారు. 548 మందికి ఉచితంగా వస్తి కర్మ నిర్వహించినందుకు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ ఈ కార్యక్రమాన్ని గుర్తించింది. సంస్థ భారతదేశ ముఖ్య అడ్జుడికేటర్ యతీష్ శుక్లా కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించి రికార్డు సర్టిఫికెట్, ట్రోఫీ, మెడల్‌ను ఆరోగ్యధాత్రి ఆయుర్వేద రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్, వరము చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. టి. సుందర రాజ్ పెరుమాల్‌కు అందజేశారు. ఈ మెగా శిబిరానికి “సౌత్ ఇండియన్ చరక”గా పేరొందిన డా. ఎన్. ఆంజనేయ మూర్తి మార్గదర్శకత్వం వహించారు. కార్యక్రమ విజయానికి పలువురు ఆయుర్వేద వైద్యులు, వైద్య సిబ్బంది, వాలంటీర్లు, నిర్వాహకులు కృషి చేశారు. ఈ రికార్డు కేవలం అవార్డు మాత్రమే కాదని, ఆచార్య చరకుని వారసత్వానికి, ఆయుర్వేద వైద్యుల సేవాభావానికి దక్కిన గౌరవమని డా. సుందర రాజ్ పెరుమాల్ పేర్కొన్నారు.

అనకాపల్లి

శారదా నది ఘాట్ల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

అనకాపల్లి, ఆగస్టు 19 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): వినాయక చవితి సందర్భంగా శారదా నది పరివాహక ప్రాంతాల్లో నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని పలువురు కోరారు. ఘాట్ల వద్ద తాగునీరు, పారిశుద్ధ్యం, లైటింగ్‌, భద్రత, ట్రాఫిక్‌ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించారు. నిమజ్జనం సందర్భంగా నదిలో కాలుష్యం పెరగకుండా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ముందస్తు ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి భక్తులకు సౌకర్యవంతమైన నిమజ్జనాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

అనకాపల్లి

చదువుకున్న పాఠశాలకు సేవ.. రూ.4 వేల విలువైన వంట సామగ్రి విరాళం!

యలమంచిలి, ఆగస్టు 18 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): పేట బయ్యవరం ఎంపీపీ పాఠశాలలో ఎండీఎం నిర్వాహకులకు మిక్సీ, కుక్కర్‌ వంట పనిముట్లను ఉచితంగా అందజేశారు. ఇదే పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసిన పెదపూడి డానియల్‌ డీఎస్సీ-2025లో ఏపీ రెసిడెన్షియల్‌ స్కూల్‌ పీజీటీగా ఉద్యోగం సాధించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు సుమారు రూ.4 వేల విలువైన మిక్సీ, కుక్కర్‌ను పాఠశాల ఎండీఎం ఏజెన్సీకి విరాళంగా అందించారు. డానియల్‌ తల్లి కొండమ్మ విద్యార్థుల పేరిట పనిముట్లను అందజేశారు. సేవాభావంతో విరాళం అందించిన కుటుంబ సభ్యులకు ప్రధానోపాధ్యాయురాలు బి.వి.ధనలక్ష్మి, ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు.

అనకాపల్లి

పోలీసులకు టెక్నాలజీ అండ.. 25 బాడీ వార్న్ కెమెరాల విరాళం!

అనకాపల్లి, ఆగస్టు 18 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా పరవాడలోని Eisai ఫార్మాస్యూటికల్స్ సంస్థ CSR నిధులతో అనకాపల్లి జిల్లా పోలీసులకు 25 బాడీ వార్న్ కెమెరాలను విరాళంగా అందజేసింది. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ కెమెరాలను ప్రారంభించారు. పోలీసుల విధి నిర్వహణలో పారదర్శకత, భద్రతతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు ఈ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఎస్పీ తెలిపారు. సామాజిక బాధ్యతతో పోలీసు శాఖకు సహకరించిన సంస్థ ప్రతినిధులు గిరీష్ దీక్షిత్, ఆనంద్ గాల్ఫాడే, మదన్ మోహన్‌లను ఎస్పీ అభినందించారు.

అనకాపల్లి

125 రోజుల ఉపాధి.. ప్రతి కుటుంబానికి అండ!

వీబీజీ రాంజీ పథకంతో గ్రామాల అభివృద్ధికి కొత్త ఊపు యలమంచిలి, ఆగస్టు 18 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): గ్రామీణ కుటుంబాలకు ఉపాధి కల్పించడంతో పాటు గ్రామాల్లో మౌలిక వసతులు మెరుగుపరిచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వీబీజీ రాంజీ పథకంపై యలమంచిలిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ మణికుమార్ మాట్లాడుతూ పథకం ద్వారా 125 రోజుల పనులు కల్పించడంతో పాటు వ్యక్తిగత ఆస్తుల సృష్టికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. భూగర్భ జలాల పెంపు, పండ్ల తోటల అభివృద్ధి, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. జాబ్‌కార్డు ఉన్న ప్రతి కుటుంబం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని యలమంచిలి మండల అధ్యక్షుడు రాజాన సూర్యచంద్ర శేషగిరిరావు కోరారు. వేతనదారులు ఎక్కువగా పనుల్లో పాల్గొంటే గ్రామ మౌలిక వసతుల కోసం 40 శాతం నిధులు కేటాయించే అవకాశం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో వి.దీపిక, ఏపీవో వరలక్ష్మి, అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆరు మండలాల ఎంపీటీసీలు, వీబీజీ రాంజీ సిబ్బంది పాల్గొన్నారు.

అనకాపల్లి

విద్యా హక్కు చట్టంపై విద్యార్థులకు అవగాహన

తిమ్మరాజుపేట (ఎస్.రాయవరం), ఆగస్టు 18 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): తిమ్మరాజుపేట KGBV పాఠశాలలో జిల్లా బాలల సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో విద్యా హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథి జిల్లా మహిళా, శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారి ఎన్.సూర్యలక్ష్మి మాట్లాడుతూ 6 నుంచి 14 ఏళ్ల పిల్లలకు ఉచిత, తప్పనిసరి విద్య అందించాల్సిన బాధ్యత ఉందన్నారు. లింగ వివక్షకు తావులేకుండా నాణ్యమైన విద్య, మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. పిల్లల హక్కులకు భంగం కలిగితే చైల్డ్‌లైన్ 1098, మహిళలు, బాలికల సమస్యలకు 181 ఉచిత నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.

అనకాపల్లి

వరి నారు చివర్లు తొలగించండి.. పంట బీమా చేసుకోండి!

యలమంచిలి, ఆగస్టు 18 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): ఏటికొప్పాక, పద్మరాజుపేట గ్రామాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో “పొలం పిలుస్తుంది” కార్యక్రమం నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి మోహన్‌రావు రైతులకు పలు సూచనలు చేశారు. వరి నాట్ల సమయంలో నారు చివర్లు చిదిమేయడం ద్వారా కాండం తొలిచే పురుగు, తెల్లకంకి ఉధృతిని తగ్గించవచ్చని తెలిపారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులు తప్పనిసరిగా పంట బీమా చేయించుకోవాలని, గడువు ఈ నెలాఖరు వరకు ఉన్నందున వెంటనే నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రతి రైతు ఫార్మర్‌ రిజిస్ట్రీ చేసుకోవాలని, క్యూఆర్‌ కోడ్‌ ద్వారా సులభంగా నమోదు చేసుకోవచ్చని వివరించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.