వీబీజీ రాంజీ పథకంతో గ్రామాల అభివృద్ధికి కొత్త ఊపు
యలమంచిలి, ఆగస్టు 18 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
గ్రామీణ కుటుంబాలకు ఉపాధి కల్పించడంతో పాటు గ్రామాల్లో మౌలిక వసతులు మెరుగుపరిచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వీబీజీ రాంజీ పథకంపై యలమంచిలిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ మణికుమార్ మాట్లాడుతూ పథకం ద్వారా 125 రోజుల పనులు కల్పించడంతో పాటు వ్యక్తిగత ఆస్తుల సృష్టికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. భూగర్భ జలాల పెంపు, పండ్ల తోటల అభివృద్ధి, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.
జాబ్‌కార్డు ఉన్న ప్రతి కుటుంబం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని యలమంచిలి మండల అధ్యక్షుడు రాజాన సూర్యచంద్ర శేషగిరిరావు కోరారు. వేతనదారులు ఎక్కువగా పనుల్లో పాల్గొంటే గ్రామ మౌలిక వసతుల కోసం 40 శాతం నిధులు కేటాయించే అవకాశం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో వి.దీపిక, ఏపీవో వరలక్ష్మి, అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆరు మండలాల ఎంపీటీసీలు, వీబీజీ రాంజీ సిబ్బంది పాల్గొన్నారు.


