బాధిత కుటుంబాలకు రూ. 50,000 తక్షణ ఆర్థిక సాయం, ఉచిత నిత్యావసరాలు అందించాలి – సిపిఎం డిమాండ్
ఓడలరేవు,పున్నమి దినపత్రిక,ఆగస్టు 19: అల్లవరం మండలం ఓడలరేవు గ్రామం నుండి సముద్రంలో వేటకు వెళ్లి 17 రోజులు గడిచినా ఇప్పటికీ ఆచూకీ లభించకపోవడం అత్యంత విచారకరమని, గాలింపు చర్యలను అత్యంత వేగవంతం చేసి బాధితులను త్వరితగతిన సురక్షితంగా ఒడ్డుకు తీసుకురావాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. సిపిఎం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కమిటీ బృందం ఓడలరేవు గ్రామంలో పర్యటించి, తప్పిపోయిన మత్స్యకారుల కుటుంబ సభ్యులను పరామర్శించింది. వారిని ఓదార్చి, పార్టీ అన్ని వేళలా అండగా ఉంటుందని ధైర్యం చెప్పింది. ఈ పర్యటనలో సిపిఎం జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వరరావు,జిల్లా కమిటీ సభ్యులు ఎన్. బలరాం,జిల్లా నాయకులు కారుపల్లి గోపాలన్ తదితరులు పాల్గొన్నారు.
అనంతరం ఓడలరేవులో శోధనా చర్యలను పర్యవేక్షిస్తున్న అమలాపురం ఆర్డీవోని కలసి పలు వినతులు సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 17 రోజులుగా ఆచూకీ లేకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి నావికాదళం ( నావి), కోస్ట్ గార్డ్, హెలికాప్టర్లతో ముమ్మరంగా శోధించి మత్స్యకారులను సురక్షితంగా రక్షించాలని ప్రభుత్యాన్ని డిమాండ్ చేశారు.ఉపాధి కోల్పోయి అల్లాడుతున్న బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ సహాయంగా రూ. 50,000 ఆర్థిక సాయంతో పాటు నెలకు సరిపడా నిత్యావసర వస్తువులను ఉచితంగా పంపిణీ చేయాలని RDO ఆర్‌డిఓని కోరడమైనది. అధికారుల నిర్లక్ష్యంపై చర్యలు: సముద్రంలో వేటకు వెళ్లే ప్రతి బోటుకు శాటిలైట్ నావిగేషన్ ట్రాన్స్‌మిటర్లు అమర్చడంలో మత్స్యశాఖ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహించారు. ఈ నిర్లక్ష్యమే నేడు మత్స్యకారుల ప్రాణాలకు ముప్పుగా మారింది. దీనికి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తప్పిపోయిన మత్స్యకారులు సురక్షితంగా తిరిగి వచ్చేవరకు మరియు బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు సిపిఎం పార్టీ వారి తరఫున పోరాడుతుందని స్పష్టం చేశారు.




