పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధికి పెద్దపీట.. గోదావరి జలాలతో చెరువులు, రిజర్వాయర్లకు జలకళ
పున్నమి న్యూస్ – రిపోర్టర్ ఆనంద్
అనకాపల్లి, ఆగస్టు 22: అనకాపల్లి జిల్లాను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక జిల్లాగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పరిశ్రమలు, భారీ పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
సెప్టెంబర్ తొలి వారంలో అనకాపల్లి, విశాఖ ప్రాంతాలకు గోదావరి జలాలను తీసుకురానున్నట్లు సీఎం వెల్లడించారు. జిల్లాలోని చెరువులు, రిజర్వాయర్లను నీటితో నింపి వ్యవసాయానికి మరింత ఊతమిస్తామని చెప్పారు.
అనకాపల్లి ఇక బెల్లం మార్కెట్‌కే పరిమితం కాకుండా స్టీల్, ఫార్మా, అల్యూమినియం, డేటా సెంటర్లతో పారిశ్రామిక హబ్‌గా రూపుదిద్దుకోనుందని పేర్కొన్నారు. డేటా సెంటర్లపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని, భవిష్యత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారీగా ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు.
పారిశ్రామిక అభివృద్ధితో పాటు పారిశుధ్యం, పర్యావరణ పరిరక్షణకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం సూచించారు. ప్రతి గ్రామాన్ని జీరో వేస్ట్ పంచాయతీగా తీర్చిదిద్దడంతో పాటు ప్రతి ఇంటిపై రూఫ్‌టాప్ సోలార్‌ను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. నీరు, పరిశ్రమలు, పెట్టుబడులు, సాంకేతికత, స్వచ్ఛతను సమన్వయం చేస్తూ అనకాపల్లిని దేశంలోనే అగ్రగామి జిల్లాగా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.


