( పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ ):
దేశంలోని పలు రాష్ట్రాల్లో స్వైన్ ఫ్లూ (H1N1), ఇన్‌ఫ్లుయెంజా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది. తీవ్రమైన జ్వరం, పొడి దగ్గు, గొంతునొప్పి, ముక్కు కారడం, తలనొప్పి, కండరాలు–కీళ్ల నొప్పులు, తీవ్ర అలసట వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దని సూచించింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని పేర్కొంది. దగ్గు, తుమ్ముల సమయంలో జాగ్రత్తలు పాటించడం, చేతులను తరచూ శుభ్రం చేసుకోవడం, రద్దీ ప్రాంతాల్లో మాస్క్ ధరించడం వంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. చిన్నపిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.


