స్పెషల్ టెట్‌తో ఒరిగేదేముంది?
40 శాతం అర్హత మార్కులతో ఆఫ్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహించాలి
యుటిఎఫ్ కడప జిల్లా శాఖ డిమాండ్
కడప, ఆగస్టు 26 (పున్నమి ప్రతినిధి): ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు ఎలాంటి రాయితీలు లేకుండా, ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్న స్పెషల్ టెట్‌తో ఎలాంటి ప్రయోజనం లేదని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి. లక్ష్మీరాజా, జిల్లా అధ్యక్షుడు మాదన విజయకుమార్, ప్రధాన కార్యదర్శి పాలెం మహేష్ బాబు అన్నారు. ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు 40 శాతం అర్హత మార్కులతో ఆఫ్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు.
యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం సాయంత్రం కడప జిల్లా కలెక్టరేట్ వద్ద స్పెషల్ టెట్ విధానాన్ని నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు చేసిన విజ్ఞప్తులను రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకుండా పాత విధానాన్నే కొనసాగిస్తూ స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం “కొత్త సీసాలో పాత సారా” చందంగా ఉందని విమర్శించారు.
2010 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం విద్యాహక్కు చట్టాన్ని తీసుకువచ్చి ఉపాధ్యాయ నియామకాలకు టెట్ ఉత్తీర్ణతను తప్పనిసరి చేసిందని తెలిపారు. అయితే 2010కు ముందు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉద్యోగాల్లో చేరిన ఉపాధ్యాయులు ఇప్పటికే నిర్దేశిత అర్హతలు సాధించి వృత్తిలోకి వచ్చారని పేర్కొన్నారు. ప్రస్తుతం వారిలో అనేక మంది 30 ఏళ్లకు పైగా సర్వీసు పూర్తి చేసుకున్నవారు, 50 ఏళ్లు పైబడినవారు ఉన్నారని తెలిపారు.
సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపి ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు కూడా టెట్ తప్పనిసరి చేయడం ద్వారా వారి మెడపై కత్తి వేలాడదీయడం తగదన్నారు. విద్యాహక్కు చట్టం-2010లోని సెక్షన్ 23(1)కు సవరణ చేసి ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయించేలా కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
టెట్ పరీక్షల్లో ప్రశ్నల స్థాయి నోటిఫికేషన్‌లో పేర్కొన్న సిలబస్ కంటే ఎక్కువగా, అత్యంత కఠినంగా ఉంటోందని వారు ఆరోపించారు. ఉపాధ్యాయుల బోధనకు సంబంధం లేని అంశాలపై పరీక్షలు రాయాల్సి రావడం ఇబ్బందికరంగా మారిందన్నారు. పాఠశాలల్లో బోధనతో పాటు కుటుంబ బాధ్యతలు, వయసు రీత్యా ఎదురయ్యే అనారోగ్య సమస్యల మధ్య టెట్‌కు సిద్ధమై ఉత్తీర్ణత సాధించడం ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు కష్టతరమవుతోందన్నారు.
ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ, అందులో తాము కోరిన రాయితీలను ప్రభుత్వం కల్పించలేదని అన్నారు. ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు రిజర్వేషన్లతో సంబంధం లేకుండా 40 శాతం అర్హత మార్కులు నిర్ణయించాలని, ఆఫ్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహించాలని, గణితం, సైన్స్ ఉపాధ్యాయులకు వారు బోధించే సబ్జెక్టుల్లోనే పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు కల్పించేలా కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. తమిళనాడు ప్రభుత్వం ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపునకు చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని గుర్తుచేశారు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి స్పెషల్ టెట్‌లో 40 శాతం అర్హత మార్కులు ప్రవేశపెట్టాలని, ఆఫ్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహించాలని, టెట్ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం విద్యాహక్కు చట్టం సెక్షన్ 23(1)కు సవరణ చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పోరుబాట పట్టక తప్పదని హెచ్చరించారు.
ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే ఆగస్టు 26న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో బైక్ ర్యాలీలు, సెప్టెంబర్ 3న ఛలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రభుత్వ వైఖరిని ఎండగడతామని యుటిఎఫ్ నాయకులు ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా సహాధ్యక్షుడు వై. రవికుమార్, ట్రెజరర్ కె. నరసింహారావు, జిల్లా కార్యదర్శులు ఎస్. ఎజాస్ అహ్మద్, జి. గోపీనాథ్, డి.వి. సుబ్బారావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు డి. కృష్ణారెడ్డి, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు రాజశేఖర రాహుల్, సరస్వతి, యుటిఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు రామ కేశవ, చెన్నయ్య, హిపాజతుల్లా, కాయపాటి రామాంజనేయులు, నాగేంద్ర, నాగరాజు, గీత తదితరులు పాల్గొన్నారు.


