*న్యూఢిల్లీ:* భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ అధ్యక్షతన జాతీయ పదాధికారుల సమావేశం, కొత్త జాతీయ కార్యవర్గ సమావేశం జరిగాయి. జాతీయ గీతం వందేమాతరం పూర్తి స్థాయిలో ఆలపించడంతో సమావేశం ప్రారంభమైంది. బలమైన సంస్థ దేశ నిర్మాణానికి గొప్ప శక్తి అని నితిన్ నబిన్ పేర్కొన్నారు. దేశ సేవలో ప్రతి ఒక్కరూ అంకితభావంతో పని చేయాలని పిలుపునిచ్చారు. ఆయన ప్రసంగం కార్యకర్తలకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది.
దేశవ్యాప్తంగా పార్టీని మరింత బలోపేతం చేయడం, ప్రజలతో సన్నిహితంగా పనిచేయడం, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికీ చేరేలా చేయడం వంటి అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం, బలోపేతమైన పార్టీ లక్ష్యంగా మరింత సమర్థవంతంగా పనిచేయాలని సంకల్పించారు.
జాతీయ అధ్యక్షుడు ప్రకటించిన నూతన జాతీయ కమిటీలో ఆంధ్రప్రదేశ్ నుంచి జాతీయ ఉపాధ్యక్షులుగా రామ్ మాధవ్, డి. పురందేశ్వరి ఎంపికయ్యారు. ఆల్ సెల్స్ జాయింట్ కో ఆర్డినేటర్ గా విష్ణు వర్ధన్ రెడ్డి నియమితులయ్యారు. రాష్ట్రానికి ఇంతటి ప్రాధాన్యత లభించడం పట్ల హర్షం వ్యక్తమైంది. వీరి అనుభవం, అంకితభావంతో పార్టీని మరింత బలోపేతం చేస్తూ దేశ సేవలో మరిన్ని విజయాలు సాధిస్తారని ఆకాంక్షించారు. నూతన బాధ్యతలు స్వీకరించిన ముగ్గురు నాయకులకు శుభాభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నీరుకొండ వీరన్న చౌదరి ఆంధ్రప్రదేశ్ కు చెందిన ముగ్గురికి జాతీయ కమిటీలో అవకాశం రావడం గర్వకారణమని అన్నారు. రాష్ట్ర పార్టీ బలోపేతానికి ఇది మంచి సంకేతమని పేర్కొన్నారు.


